మల్టిపుల్ తికమక- ‘గేమ్ ఓవర్’ రివ్యూ

ఈ రెండేళ్లుగా ముల్క్, నీవెవరో, మన్మర్జియా, బద్లా అనే రియలిస్టిక్ సినిమాల్లో మరిన్ని బలమైన పాత్రలు నటించిన తాప్సీ సోలో ప్రయాణం, 2016 లో ‘పింక్’ తో ప్రారంభమయ్యింది. మళ్ళీ ‘పింక్’ లాంటి లేడీస్ కి పనికొచ్చే ఇంకో థ్రిల్లర్ ‘గేమ్ ఓవర్’ తో ఇప్పుడు పలకరిస్తోంది. కాకపోతే ఈసారి తెలుగు -తమిళ -హిందీ భాషల్లో. ‘మయూరి’ ఫేమ్ తమిళ దర్శకుడు అశ్విన్ శరవణన్ తన శైలిలో ఇంకో ప్రయోగం చేస్తూ ఈ మూవీ తీశాడు. ఈ ప్రయోగానికి తాప్సీ అతనికో ఎస్సెట్. ఇవ్వాలనుకున్నది లేడీస్ కో మెసేజ్. మరి ఇవన్నీ ఒక సమగ్ర కాన్సెప్ట్ గా కుదిరాయా? ఈ కింద పరిశీలిద్దాం..

కథ

అమృత (సంచనా నటరాజన్) అనే అమ్మాయిని ఒక సైకో కిల్లర్ దారుణంగా చంపేస్తాడు. కొంత కాలంగా ఇతను దొరక్కుండా నగరంలో అమ్మాయిల్ని చంపుతున్నట్టు వార్తలొస్తాయి. స్వప్న (తాప్సీ) ఒక వీడియో గేమ్ డెవలపర్. ఏడాది క్రితం రేప్ కి గురై – ఆ అవమానభారంతో వొంటరిగా జీవిస్తూ, పేరెంట్స్ ని కూడా కలవకుండా, పని మనిషి కలమ్మ (వినోదిని) తో ఒక ఫ్లాట్లో వుంటూ, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ వుంటుంది. ఒక రోజు కలమ్మ షెల్ఫ్ క్లీన్ చేస్తూంటే, తన రూంలో ఏదీ క్లీన్ చేయవద్దని వారిస్తుంది స్వప్న, అదేమిటి న్యూ ఇయర్ కైనా క్లీన్ చేయవద్దా అంటుంది కలమ్మ. దీంతో స్వప్న డిస్టర్బ్ అయి పోతుంది. చీకట్లో వుండాలంటే విపరీతంగా భయపడి పోతుంది. సైకియాట్రిస్టు (అనీష్ కురువిల్లా) పరీక్ష చేసి, ఇది యానివర్సరీ రియాక్షన్ అనే మానసిక రుగ్మతగా తేలుస్తాడు. జీవితంలో ఏదైనా జరగరానిది జరిగితే, ప్రతీ ఏడాది అదే సమయానికి అది గుర్తుకొచ్చి డిస్టర్బ్ అవడం సహజమనీ, ఒంటరిగా వుండకుండా నల్గురి సమక్షంలో వుంటే సరిపోతుందనీ అంటాడు.

ఏడాది క్రితం న్యూ ఇయర్ డే నాడు రేప్ అయింది తను. అదిప్పుడు ‘న్యూ ఇయర్ కైనా క్లీన్ చేయవద్డా’ అని కలమ్మ అనెయ్యడంతో, చటుక్కున ఆ సంఘటన గుర్తుకొచ్చి ఇలా యానివర్సరీ రియాక్షన్ కి దారి తీసిందన్న మాట. ఇదిలా వుంటే, ఏడాది క్రితం పొడిపించుకున్న పచ్చబొట్టు గుచ్చుకుంటున్నట్టు బాధ పెడుతుంది. దాన్ని తొలగించుకోవాలన్నా వీల్లేకుండా బాధ పెడుతుంది. ఇదెంటో టాటూ సెంటర్లోనే తెలుస్తుంది. తను పచ్చబొట్టు పొడిపించుకున్నప్పుడు, పొరపాటున ఇంకొకరి కోసం సిద్ధం చేసిన ఇంకు వాడడం జరిగింది. ఆ ఇంకులో అస్థికలు కలిసి వున్నాయి. ఇమ్మోర్టల్ టాటూ అని ప్రారంభమైన కొత్త ట్రెండ్ ప్రకారం, కొందరు చనిపోయిన తమ ఆత్మీయుల అస్థికల్ని ఇంకులో కలిపి పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారు. ఇలా వేరే ఆవిడకోసం సిద్ధం చేసిన ఇంకుతో స్వప్నకి టాటూ పొడిచేశారు.

ఇది తెలుసుకుని షాక్ అవుతుంది స్వప్న. తన శరీరంలో ఇంకొకరి ఆస్థికలు, దాని తాలూకు ఆత్మ! ఈ ఆస్థికలు ఎవరివో కావు, సీరియల్ కిల్లర్ చంపిన అమృతవే… ఇక మొదలైపోతుంది స్వప్నకి దుస్వప్నాలతో సమరం…

ఎలావుంది కథ

హెచ్ఐవీ రక్తాన్ని పొరపాటున ఒకరికి ఎక్కించేస్తే ఏమిటి పరిస్థితి? అదే ఇక్కడ అస్థికల ఇంకుతో దుస్థితి. ఇది సైకలాజికల్, హార్రర్, క్రైం థ్రిల్లర్, టెక్నో థ్రిల్లర్ ల మల్టీ జానర్ కథ. స్వప్నాలూ సత్యాలూ పెనవేసుకుపోయిన కథనంతో జీవితాన్ని వీడియో గేమ్ తో పోలుస్తూ లేడీస్ కి మెసేజ్ ఓరియెంటెడ్ కథ. ఐతే లేడీస్ ఎంతవరకు ఈ సినిమా చూస్తారో తెలీదు. పాత ‘అభినందన’ అనే సినిమాలో పాట చరణముంటుంది – కలలకు భయపడి పోయాను, నిదురకు దూరం అయ్యాను, వేదన పడ్డానూ… స్వప్నాలైతే క్షణికాలేగా, సత్యాలన్నీ నరకాలేగా, స్వప్నం సత్యమైతే వింత, సత్యం స్వప్నమయ్యేదుందా … అని. ఈ చరణాలే ఈ కథలో కథానాయిక కథ. జరిగేదంతా మనస్సులోనే. ఈ స్వప్న- సత్యాల సంక్షుభిత మనస్సుని జయించాలి. కురుక్షేత్రం ఇంకెక్కడో జరగలేదు, నిత్యం మనస్సులో జరిగేదే. మనస్సులో నూరుమంది కౌరవులనే నెగెటివ్ శక్తుల్ని, పంచ పాండవులనే ఐదు పాజిటివ్ శక్తులతో జయించమన్నారు. ఇదే వీడియో గేమ్ చెప్తుంది. వీడియో గేమ్ లో ముందు రెండు లైఫ్ లైన్స్ తో ఓడిపోయినా, చివరిదైన మూడో లైఫ్ లైన్ తో గెలిచి తీరాలని ఎలా ఆడతారో, అలా జీవితంలో దారులన్నీ మూసుకుపోయి చావే తప్పని వేళ, ప్రాణాలకి తెగించి పోరాడాలని ఈ కథ చెప్తుంది – ఆడవాళ్ళ మీద పెరిగిపోతున్న అత్యాచారాలకి సంబంధించి.

తాప్సీ హిందీలో అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించిన కోర్టు రూమ్ డ్రామా ‘పింక్’ అనే హిట్ కాన్సెప్ట్ ఇదే. అందులో ఒక నైట్ పార్టీలో అసభ్యంగా ప్రవర్తించిన తోటి స్టూడెంట్ తలపగుల గొట్టి కేసులో ఇరుక్కుని న్యాయపోరాటం చేస్తుంది. ప్రస్తుత కథలో న్యూ ఇయర్ పార్టీ తర్వాత అత్యాచార బాధితురాలిగా మిగిలి, తన చిత్త భ్రాంతులతో తనే పోరాడుతుంది. ‘పింక్’ లో ఔటర్ స్ట్రగుల్, ‘గేమ్ ఓవర్’ లో ఇన్నర్ స్ట్రగుల్. ‘పింక్’ కి దేశవ్యాప్తంగా లేడీస్ ఆదరణ విపరీతంగా లభించింది, ‘గేమ్ ఓవర్’ కి కష్టమే. ఇందులో లేడీస్ ఆప్పీల్ కి సైకలాజికల్, హార్రర్, క్రైం థ్రిల్లర్, టెక్నో థ్రిల్లర్ మల్టీ జానర్స్ తో, డార్క్ మూవీ కథగా చెప్పడం, హైఫై యంగ్ లేడీస్ కి తప్ప నచ్చక పోవచ్చు.

ఎవరెలా చేశారు

చేయడానికి ఇద్దరే వున్నారు. ఇద్దరూ బాగా చేశారు. తాప్సీ, వినోదిని. గతవారం విడుదలైన ‘కిల్లర్’ లో హీరోయిన్ ఆషిమా నర్వాల్, ఆమె తల్లి పాత్ర పోషించిన సీత ఎలా చేశారో, వీళ్ళిద్దరూ అలా చేసి సినిమాని నిలబెట్టారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. స్టార్ సినిమాల్లో కాకుండా ఇలాటి సినిమాల్లోనే మన నటీమణులు ఎంత టాలెంటెడో చూడగల్గుతాం. నటీమణుల నటన చూడాలని మొహంవాచి వున్న ప్రేక్షకులకి ఇలాటి సినిమాలే బంగారు అవకాశం.

తాప్సీ ఫస్టాఫ్ లోనే ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుని వీల్ చైర్ కి పరిమితమయ్యాక, ఫ్లాట్ అనే ఒకే లొకేషన్ లో మిగతా అరవై నిమిషాలూ దృశ్యాల్ని రక్తి కట్టిస్తుంది. మొత్తం సినిమా వంద నిమిషాలకి మించి లేదు. హార్రర్ తో భయపెట్టే దృశ్యాలు చీప్ గా లేవు.

టెక్నికల్ గా ఉన్నతంగా వుంది. కొన్ని షాట్స్ క్రేజీగా వున్నాయి. పాటలు లేవు. నేపథ్య సంగీతం బావుంది. డైలాగులు పది పేజీలకి మించి వుండకపోవచ్చు. వీటిని చక్కగా అనువదించాడు వెంకట్ కాచర్ల. దర్శకుడు అశ్విన్ శరవణన్, రచయిత్రి కావ్యా రాం కుమార్ ల స్క్రీన్ ప్లే ఈ భయాన్ని జయించే కాన్సెప్ట్ ని కన్ఫ్యూజ్ చేస్తుంది.

చివరికేమిటి

ఈ మల్టీ జానర్ సబ్జెక్టు కొన్ని లేయర్స్ (పొరలు) తో వుంటుంది. అయితే ఇదే దర్శకుడు శరవణన్ నయన తారతో తీసిన గత ‘మయూరి’ (తమిళంలో ‘మాయ’) అనే హార్రర్ లో వున్న లేయర్స్ తో పోలిస్తే ఇది దిగువ స్థాయి క్రియేటివిటీయే. ‘మయూరి’ ఇంటలిజెంట్ రైటింగ్ అయితే ఇది కన్ఫ్యూజింగ్ రైటింగ్. ‘మయూరి’ సినిమా మేకప్ అంతా కమర్షియల్ – యూరోపియన్/ అవాంట్ గార్డ్/ నోయిర్ సినిమాల కలబోతగా వుంటుంది. కమర్షియల్ సినిమాని ఒడుపుగా వరల్డ్ సినిమాతో సంకరం చేసినట్టు వుంటుంది. సినిమాలో సినిమాగా – మనం చూస్తున్న సినిమాలోకే పాత్రలు వెళ్ళిపోయి సన్నివేశాల్లో పాల్గొనడం లాంటి అధివాస్తవిక (సర్రియలిజం) పోకడ ఇక్కడ కనపడుతుంది. ప్రత్యేకంగా యూరోపియన్/ అవాంట్ గార్డ్/ నోయిర్/ వరల్డ్ సినిమా/ సర్రియలిజం ఎట్సెట్రా ఎట్సెట్రా తీస్తే ఇక్కడెవరూ చూడరు. కానీ శరవణన్ చాలా నేర్పుగా కమర్షియల్ ఫార్మాట్ లో ఇవన్నీ ఇరికించాడు.

ప్రస్తుత సబ్జెక్టుకి లూప్ లైన్ కథనం చేశాడు. అంటే ఒకే అనుభవం రెండు మూడు విధాలుగా జరిగితే ఎలా వుంటుందన్న ఊహలోంచి పుట్టే కథనం. దీనికి జర్మన్ మేకింగ్ ‘రన్ లోలా రన్’ ఎప్పుడో ప్రబల నిదర్శనంగా వుంది. ఇదే పంథాని స్క్రీన్ ప్లేకి అనుసరించాడు. తనని చంపడానికి వచ్చిన సీరియల్ కిల్లర్ ఒక్కడే మూడుగా వున్నాడు. ఈ మూడు భ్రాంతులతో ఒక్కొక్క తీరులో రిపీటయ్యే సఫరింగ్. ఆ సఫరింగ్ ని వీడియో గేమింగ్ వ్యూహంతో జయించే క్రమం. ఆమె తన మనస్సుతో వీడియో గేమే ఆడుకుంటుంది … రావణుడ్ని ఎంత చంపినా తలలు మొలుచుకు వచ్చినట్టు, ఈ సీరియల్ కిల్లర్స్ అంతే. ప్రస్తుతానికైతే ముగ్గుర్ని చంపి ముగించుకుంది గానీ… మళ్ళీ ప్రతీ సంవత్సరం తనకి జరిగిన రేప్ తాలూకు ఈ మానసిక క్షోభ రిపీటయ్యేదే. ఆమెకి వున్న మానసిక రుగ్మత రేప్ సంఘటనతో యానివర్సరీ రియాక్షన్. ఇది మళ్ళీ ప్రతీ సంవత్సరం ఇదే సమయానికి ఎటాక్ చేస్తుంది. దాంతో మళ్ళీ పోరాటం చెయ్యాలి. ఈసారికి పచ్చబొట్టు పొడిపించుకున్న ఖర్మాన సీరియల్ కిల్లర్ చంపిన అమ్మాయి ఆత్మ తనలోకి ఇంకి, ఆ సీరియల్ కిల్లర్ తన యానివర్సరీ రియాక్షన్ తో కనెక్ట్ అయ్యాడు. దాంతో వాడి రూపాలతో పోరాడి జయించింది. వచ్చే సంవత్సరం మరి దేనికి కనెక్ట్ అవుతుందో యానివర్సరీ రియాక్షన్.

ఇంకోటేమిటంటే, ఆమెకి యానివర్సరీ రియాక్షన్ ఒకటే కాదు కంటిన్యూ అయ్యే జీవిత సమస్య- పచ్చబొట్టు వల్ల తనకి సంక్రమించిన అమ్మాయి తాలూకు ఆత్మ ని కూడా మొయ్యాలి. అయితే ఈ ఆత్మ తనని చంపిన సీరియల్ కిల్లర్స్ తో ఈమె ఇంతగా పోరాడుతూంటే ఎందుకు సాయం చేయడం లేదన్న ప్రశ్నకి సమాధానం, ఇది నిజమైతేగా? సీరియల్ కిల్లర్ ఆమె యానివర్సరీ రియాక్షన్ కి కనెక్ట్ అయిన మానసిన భయం మాత్రమే. భౌతికంగా ఆమెకేదైనా జరిగితే ఆత్మ అడ్డుకుంటుందేమో – అందుకే ఆమె ఆత్మహత్య చేసుకోబోతే అడ్డుకుంది ఆత్మ.

ఇంకో జాగ్రత్తేం తీసుకున్నారంటే, ఈ సైకలాజికల్ థ్రిల్లర్ లో ఆత్మ వుంది కదాని హార్రర్ థ్రిల్లర్ గా మార్చేసే అఘాయిత్యానికి పాల్పడక పోవడం. అప్పుడు రసభంగమై సినిమా ఏమయ్యేదో. గతంలో గోవిందా – టబు – కరిష్మా కపూర్ లతో ‘షికారీ’ లో ఇంతే జరిగింది. ఆ సైకో కిల్లర్ కథ కాస్తా సెకండాఫ్ లో హారర్ మూవీగా మారిపోవడంతో ప్రేక్షకులు జీర్ణించుకోలేక ఫ్లాపయ్యింది.

తాప్సీ పాత్ర గురించి ఎన్నో ప్రశ్నల్ని మిగిల్చే ఈ ముగింపు అసంపూర్ణంగా అన్పించవచ్చు. అకస్మాత్తుగా ముగించేసినట్టే వుండొచ్చు. మానసికంగా యానివర్సరీ రియాక్షన్ రుగ్మత అలాగే వుంది, భౌతికంగా శరీరంలో ఆత్మ అలాగే వుండిపోయింది. ఇదేం ముగింపు? ఈ థీమే ఇంత. యానివర్సరీ రియాక్షన్ ఆమెకి నయం కాలేదు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకో రకంగా ఎటాక్ చేస్తుందన్న అర్ధం ఈ ముగింపులో వుంది. ఈ థీమ్ కున్న బ్యూటీ ఏమిటంటే చాలా సీక్వెల్స్ తీయవచ్చు. ఒక్కో సీక్వెల్ లో ఒక్కో యానివర్సరీ రియాక్షన్ తాలూకు ఎటాక్, దాంతో పోరాటం. స్వప్న అనే ఈ మెంటల్ పేషంట్ క్యారెక్టర్ ఫ్రాంచైజ్ అయి, ఇంటింటి పాత్రగా బాగా పాపులర్ అయ్యే అవకాశం కూడా వుంది. చివరికి రావణుడ్ని చంపాలంటే అతడి భావజాలాన్ని చంపాలని బ్రహ్మాస్త్రాన్ని ఎక్కు పెట్టినట్టు…స్వప్న కూడా తన ఈ మానసిక స్థితికి కారణమైన తన భావజాలం మీదే ‘బ్రహ్మాస్త్రం’ ప్రయోగించుకుంటే తప్ప ఈ నరకం నుంచి విముక్తి లేదు. సీక్వెల్స్ తీస్తే ఇదే ఆఖరి సీక్వెల్స్ కి ముగింపవుతుంది.

ఫస్టాఫ్ పరస్పరం సంబంధంలేని విషయాలతో కన్ఫ్యూజింగ్ గా వుంటుంది. సీరియల్ కిల్లింగ్స్ జరగడం, దీంతో సంబంధం లేని యానివర్సరీ రియాక్షన్ డయాగ్నసిస్, మళ్ళీ దీంతో సంబంధంలేని పచ్చబొట్టు వ్యవహారం… గతవారం విడుదలైన తమిళ ‘కిల్లర్’ లో కూడా ఫస్టాఫ్ అర్ధం గాదు. ఒక హత్యతో ప్రారంభమై పరస్పర సంబంధం లేని దృశ్యాలు వస్తూంటాయి. ఇవన్నీ సెకండాఫ్ లో గానీ అర్ధం గావు. ప్రస్తుత మూవీలోనూ సెకండాఫ్ లోనే విషయం కనెక్ట్ అవుతుంది. ఐతే రెండిటిలోనూ తెలుగులో చేయడానికి గత రెండు దశాబ్దాలుగా బాగా అలవాటు పడి, పదుల సంఖ్యలో అట్టర్ ఫ్లాప్ చేసుకున్నట్టు – అందుకు కారణమయ్యే ఎండ్ సస్పెన్స్ కథనం లేకపోవడం గొప్ప విషయం.

ఐతే… ఐతే…అసలు కన్ఫ్యూజన్ దేంతోనంటే, కాన్సెప్ట్ తోనే. స్వప్నకి జరిగిన రేప్ వల్ల యానివర్సరీ రియాక్షన్ తో ఆమె కథ సాగిందా? లేదు. అమృత ఆస్థికల ఇంకుతో అమృతని చంపిన సీరియల్ కిల్లర్ పీడకలల కథగా మారిపోయింది. యానివర్సరీ రియాక్షన్ అనే సైకలాజికల్ కాన్సెప్ట్ ని, అస్థికల ఇంకు అనే హార్రర్ కథ ఓవర్ టేక్ చేసింది. ఇక స్వప్నకి యానివర్సరీ రియాక్షన్ తో స్ట్రగుల్ ఎక్కడున్నట్టు? ఉన్నదల్లా తప్పుడు పచ్చబొట్టుతో వచ్చిన స్ట్రగులే. అలాంటప్పుడు యానివర్సరీ రియాక్షన్ అంటూ ఎత్తుగడ ఎందుకు? నేరుగా తప్పుడు పచ్చబొట్టు కథే నడిపేస్తే సరిపోతుంది కదా? ఇలా నాల్గు జానర్లు కలగాపులగం చేసి, ప్రేక్షకులకి దొరక్కుండా నమ్మించేద్దామనుకుంటే ఎలా?

హమ్మయ్య! మొత్తానికిలా స్వప్న పచ్చబొట్టు పొడిపించుకోవడంతో యానివర్సరీ రియాక్షన్ పారిపోయిందన్న మాట. ఇక రేప్ లేదు గీప్ లేదు. ఆమెకి  ప్రశాంతమయమైన మచ్చ లేని నిండు జీవితంతో అభినందిద్దాం!

దర్శకత్వం : అశ్విన్ శరవణన్
తారాగణం : తాప్సీ, వినోదిని, అనీష్ కురువిల్లా, సంచనా నటజరాజన్ తదితరులు
రచన : అశ్విన్ శరవణన్, కావ్యా రాంకుమార్, మాటలు: వెంకట్ కాచర్ల, సంగీతం: రోన్ ఏతాన్ యోహాన్, ఛాయా గ్రహణం : ఎ. వసంత్
బ్యానర్స్ : వై నాట్ స్టూడియోస్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
నిర్మాత‌: ఎస్.శ‌శికాంత్ చ‌క్ర‌వ‌ర్తి రామ‌చంద్ర‌
విడుదల జూన్ 14, 2019
2. 5 / 5

―సికిందర్