మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ – ‘rdx లవ్’ రివ్యూ!

మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ – ‘rdx లవ్’ రివ్యూ!

‘Rx 100’ తో అతి బోల్డ్ హీరోయిన్ గా పరిచయమైన హీరోయిన్ పాయల్ రాజ్పుత్ తో ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ‘Rdx లవ్’ తీశారు. దీనికి కొత్త దర్శకుడు శంకర్ భాను దర్శకత్వం వహించాడు. ‘హుషారు’ హీరో తేజస్ కంచర్ల పాయల్ సరసన నటించాడు. హీరోయిన్ పాయల్ కేర్పడ్డ బోల్డ్ ఇమేజిని దృష్టిలో పెట్టుకుని, దీన్ని మాత్రమే సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో ఎలాటి మొహమాటం లేకుండా దీన్నెలా తీశారో చూద్దాం…

కథ
అలివేలు (పాయల్) ఐదుగురు స్నేహితురాళ్ళతో కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రచారం చేస్తూంటుంది. మొదట ఎయిడ్స్ నిర్మూలన కోసం కండోములు అందిస్తూ ప్రచారం చేస్తుంది. ఒక కండోంని అందుకుని సిద్దూ (తేజస్) పరిచయమవుతాడు, ప్రేమలో పడతాడు. దీని తర్వాత అలివేలు ఇంకో గ్రామాని కెళ్ళి, అక్కడ ఊరంతా పిల్లల్ని కనని ఆడవాళ్లు తాగుబోతు మొగుళ్ళతో పడుతున్న బాధలు తెలుసుకుని, ఆ మొగుళ్ళకి వాత్సాయన కామ సూత్రాలు నేర్పి, తాగుడు మాన్పిస్తుంది. ఆ తర్వాత నగరానికెళ్ళి గుట్కాలు తినడాన్ని మాన్పిస్తుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నావని సిద్దూ అడిగితే, ఒక లక్ష్యం గురించి సీఎం బాపినీడు( నాగినీడు) దృష్టిలో పడి ఆయన్ని కలుసుకునేందుకు చేస్తున్నానంటుంది. ఏమిటా లక్ష్యం? ఇందుకు సీఎం ని కలుసుకోగల్గిందా? దీన్ని ఛానెల్ ఓనర్ గిరి ప్రకాష్ (ఆదిత్యా మీనన్) ఎందుకు అడ్డుకున్నాడు? చివరికి అలివేలు ఎదుర్కొన్న పరీక్షేమిటి? ఇదీ మిగతా కథ…

ఎలావుంది కథ
అతి పురాతన అవుట్ డేటెడ్ కథ. వూళ్ళో వంతెన నిర్మించడం కోసం ప్రభుత్వంతో పోరాడే బహుపురాతన కథ. కొత్త దర్శకుడు తాతల కాలంలో వున్నాడు ఇప్పుడు టార్చర్ పెట్టడానికి. దీనికిప్పుడు మార్కెట్ యాస్పెక్ట్ లేదు సరే, క్రియేటివ్ యాస్పెక్ట్ అతి దారుణంగా వుంది. వంతెన నిర్మాణమనే ఒక వూరి ప్రజల సమస్యని పచ్చి బూతుని జోడించి చెప్పడంగా వుంది. ప్రారంభం సీతారాముల విగ్రహాలతో పవిత్రంగా ప్రారంభిస్తూ, ఆ తర్వాతంతా పచ్చి బూతు చూపడంగా వుంది. అదీ అలివేలు అని పేరు పెట్టి హీరోయిన్ పాత్రతో. ఈమెని ఒక పోలీసు పాత్ర ‘గింజ’ అని పదేపదే పిలవడం. కథకి ఇరవై ఏళ్ల క్రితం హీరోయిన్ తండ్రి సీతా రాముల విగ్రహాలని విడదీసి సీత విగ్రహాన్ని నది అవతల పెట్టేస్తాడు. ఇక రాముడు నీకోసం వెతుక్కుంటూ వారధి నిర్మించుకుంటూ వస్తాడని ప్రతిజ్ఞ చేస్తాడు. వంతెన కోసం ప్రభుత్వం దిగి రావడానికి రామాయణంలోంచి ఐడియా లాగి ఇలా నిరసన అన్న మాట. ఇక దీంతో సమస్యని సీఎం దృష్టికి తీసి కెళ్ళడానికి హీరోయిన్ (అలివేలు పేరు వాడడం లేదు) సెక్సు చేష్టలు మొదలు! వంతెన కథని బూతు కథగా దర్శకుడు చెప్పాలనుకుంటే చక్కగా చెప్పుకోవచ్చు, మధ్యలో దేవతల్నిలాగే తెలివి తేటలు దేనికి? పైగా ‘A’ సర్టిఫికేట్ తో?

ఎవరెలా చేశారు?
హీరో తేజస్ ని విలన్ ముఠా భుజమ్మీద ఎత్తుకుపోతూంటే హీరోయిన్, ఆమె స్నేహితురాళ్ళు వెంట పడివాళ్ళతో ఫైటింగ్ చేస్తారు. కాబట్టి హీరో క్యారక్టర్ ఎలాటి పిప్పళ్ళ బస్తాలా వుందో దీనితో అర్ధమైపోతుంది, పక్కన పెట్టేద్దాం. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ కథ. ఈమె వంతెన సమస్యని సీఎం దృష్టికి తీసి కెళ్ళడానికి నది వొడ్డున అన్నం మానేసి కూర్చోకుండా, ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని బూతుగా ప్రచారం చేస్తూంటుంది. ఈ ప్రచారం చూసి సీఎం పిలిస్తే, అప్పుడెళ్లి వంతెన సమస్య చెప్పాలని తన లక్ష్యమట!

సినిమాలో ఈమె మొట్టమొదటి డైలాగు, ఫ్రెండ్స్ తో వున్న హీరో దగ్గరికి వెళ్లి ‘మీరెప్పుడైనా అపరిచితులతో సెక్సు చేశారా?’ అనెయ్యడం. సేఫ్టీ లేకుండా సెక్సు చేస్తే ఎయిడ్స్ వస్తుందని అందరికీ సేఫ్టీలు పంచడం. తన హాస్టల్లో సేఫ్టీలు వుంచుకుని ఏ అర్ధరాత్రి ఎవరి కవసర మొచ్చినా ఇవ్వడం. ఒకసారి హీరో వచ్చి అడిగితే, తన దగ్గర లేకపోతే, అర్ధరాత్రి ఇంకో ఇంటికి వెళ్లి, సెక్సు చేస్తున్నతన్ని  లేపి, సేఫ్టీలు తీసుకుని ఇవ్వడం! ఎయిడ్స్ కంట్రోలు పేరుతో వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తూ బరితెగించి తిరగడం. పోలీసులు పట్టుకుని రేప్ చేయబోతే, తనకి ఎయిడ్స్ వుందని భయపెట్టి తప్పించుకోవడం. ఇలాటి ఆపదల్లో ఆడవాళ్లు ఎయిడ్స్ వుందని చెప్పుకోవాలని ఐడియా తట్టడం! కొత్త దర్శకుడికి చాలా చాలా కొత్త ఐడియాలున్నాయి.

ఇలా సేఫ్టీలతో ఇంకా చాలా సీన్లు చేశాక, ఇంకో ఊరికెళ్ళి అక్కడ పిల్లల్లేని ఆడవాళ్ళకి పిల్లల్నిపుట్టించే ఇంకో సెక్సు పథకం చేపడుతుంది. అక్కడ తాగుబోతు మొగుళ్ళు కాపురాలే చేయడంలేదని ఆడవాళ్ళకి వాత్సాయన కామసూత్రాలు చెప్పి మొగుళ్ళ చేత మంచాలు విరగ్గొట్టిస్తూ ఆ సీన్లు ఎంజాయ్ చేస్తుంది. ఆ తర్వాత నగరానికెళ్ళి రోమాంటిగ్గా గుట్కాలు మాన్పిస్తుంది. ఇవన్నీ ఫస్టాఫ్ సంగతులు. ఇక సెకండాఫ్ లో ఏం చేస్తుందంటే, తనే ఎక్స్ పోజ్ చేస్తూ హీరోతో రకరకాల బోల్డ్ సీన్లు, లిప్ లాక్స్, సెక్సు డైలాగ్స్, ఎరోటిక్ సాంగ్స్  చేస్తుంది. మరి లక్ష్యం ఏమయింది? చిట్ట చివరిదాకా గుర్తే రాదు.

అడల్ట్ మూవీస్ ఫేమ్ కొత్త బోల్డమ్మాయి పాయల్ రాజ్పుత్ కి వెంకటేష్ – నాగ చైతన్యలు నటిస్తున్న ‘వెంకీ మామ’ అనే ఫ్యామిలీ మూవీలో హీరోయిన్ గా నటించే అవకాశం రావడం విశేషం.

సీనియర్ కెమెరా మాన్ రాంప్రసాద్ ఈ బోల్డ్ మూవీని నిర్మాత పెట్టిన మంచి ఖర్చుతో కలర్ఫుల్ గా తీశారు. రధన్ సంగీతం రొద. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ దర్శకత్వాన్ని బట్టే వుంది. కొత్త దర్శకుడి దర్శకత్వం, రచన అధ్వాన్నం. హీరోయిన్ పాత్రని ‘గింజ’ అనడమంత సెన్సారు స్వేచ్ఛ. ఆడ పాత్రలు, మగ పాత్రలూ అన్నీ విచ్చల విడిగా బూతులు మాట్లాడేస్తూంటాయి.

చివరికేమిటి?
గత ఇరవై ఏళ్లుగా ఎన్నో తెలుగు సినిమాలు మిడిల్ మటాష్ కథలతో, ఎండ్ సస్పెన్సులతో అట్టర్ ఫ్లాప్ అవుతున్నా, ఈ కొత్త దర్శకుడికి ఈ జ్ఞానమే లేకుండా ఇంకో అలాటిది తీసేశాడు. మార్కెట్ నాలెడ్జి ఏమాత్రం లేని అవుట్ డేటెడ్ బి గ్రేడ్ అయిన ఇతను, ఇంటర్వెల్ కయినా కథేమిటో చెప్పడు. ఒక లక్ష్యం కోసం సీఎం ని కలవాలనుకుంటున్నట్టు హీరోయిన్ తో చెప్పిస్తాడు గానీ ఆ లక్ష్యమేమిటో చెప్పించడు. తీరా సీఎం దగ్గరికి వెళ్తే టైము దాటి పోయిందని అప్పాయింట్ మెంట్ క్యాన్సిల్ అనడం. అప్పుడు అర్ధరాత్రి పోతున్న హీరోయిన్ని మోనా డేవిడ్ (ముమైత్ ఖాన్) అనే ఇన్స్ పెక్టర్ పట్టుకుపోయి బూతు టార్చర్ పెట్టడం. దీంతో ఇంటర్వెల్. ఈమె ఎందుకు టార్చర్ పెడుతోందో తెలీదు. హీరోయిన్ లక్ష్యం ఏమిటో రివీల్ కాదు కథలోకి వెళ్ళడానికి.

ఇంటర్వెల్ తర్వాత హీరోని కలవద్దని హీరోయిన్ కి వార్నింగ్ ఇస్తుంది ఇన్స్ పెక్టర్. ఎందుకు కలవద్దో కూడా ప్రేక్షకులకి తెలియనివ్వడు కొత్త దర్శకుడు. హీరో తండ్రి ఛానెల్ ఓనర్ ‘గిరి ప్రకాష్’ విలన్ అని తెలియజేస్తాడు. ఈ విలన్ హీరోయిన్ ని కొడుక్కి ఎందుకు దూరం పెడుతున్నాడో కూడా రివీల్ చెయ్యడు. కథంతా దాచి పెట్టి, సస్పెన్స్ పోషిస్తున్నట్టు, సినిమాకి గొప్ప లాభం చేస్తున్నట్టు ఫీలవుతున్నాడు- సస్పెన్స్ డైనమిక్స్ ఏమిటో కూడా కనీసం తెలియకుండా.

సెకండాఫ్ లో అరగంటకి హీరోయిన్ బూతు చేష్టలాపి, సీఎంని కలుస్తుంది. హమ్మయ్య ఇప్పుడైనా ప్లాట్ పాయింట్ వన్ వచ్చిందిరా, కథ ప్రారంభమయిందిరా అని తెరిపిన పడతాం. ఇంతా చేసి హీరోయిన్ తన బూతు కార్యక్రమాలతో సీఎం ని కలవాలనుకుంటున్నది వూళ్ళో వంతెన కోసమని ఇప్పుడు మనకి తెలుస్తుంది! తెలిసి నంతలోనే చల్లబడి పోతుంది. సీఎం కాదు పొమ్మంటాడు. హీరోయిన్ వెళ్ళిపోయి హీరోతో మళ్ళీ అవే చేష్టలు. అంటే ప్రారంభమైన కథ ప్రారంభమైనట్టే ప్రారంభం కాలేదు. హీరోయిన్ కి ఇప్పుడు కూడా గోల్ ఏమిటో తెలీదు. అప్పుడు ఈ రెండున్నర గంటల బారెడు బాధకి రెండు గంటలా 10 నిమిషాల దగ్గర, మళ్ళీ ఇంకో ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది!

ఈ సారి విలన్ తో. ఈసారి మళ్ళీ కథేమిటో పూర్తిగా తెలుస్తుంది. ఈ కథ విలనీ తో ఈ చివరి ఇరవై నిమిషాలే వుంటుంది. మొత్తం ఈ అడల్ట్ కంటెంట్ కి కథ చివరి ఇరవై నిమిషాలకి వచ్చి, ఎండ్ సస్పెన్స్ రివీలై, స్క్రీన్ ప్లే మిడిల్ మటాష్ కూడా అయి- సినిమా ఆర్డీఎక్స్ పేలినట్టు పేలి, సక్సెస్ కోసం చేసిన గుడ్డి ప్రయత్నమంతా తునాతునకలై పోయిందన్న మాట! ఇంత ఘోరమైన స్క్రిప్టు ఎప్పుడూ చూడలేదు.

ఈ చివరి ఇరవై నిమిషాల్లో మొదలైన  కథ మళ్ళీ వూళ్ళో సీతమ్మ విగ్రహం దగ్గర చేరుతుంది! ఇంత రంధి తర్వాత మళ్ళీ విగ్రహం దగ్గరికొస్తే – “మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ” అని ‘అందాల రాముడు’ లో సీతమ్మ విగ్రహం ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కినేని నాగేశ్వరరావు పాడిన పాట తల్చుకుని దండం పెట్టుకుంటాం – “మా కష్టాలు కాస్త చూసిపొమ్మని నువ్వయినా చెప్పవమ్మా రామయ్యకూ… ఆ అయ్యకూ!” – అన్న అక్కినేని వేదనే, మనకి తీరని మానసిక క్షోభ అయి, కొత్త దర్శకుడి నెత్తిన సీతమ్మ శాపమై పోతుంది!!

రచన దర్శకత్వం : శంకర్ భాను
తారాగణం : పాయల్ రాజ్పుత్, తేజస్ కంచర్ల, వికె నరేష్, నాగినీడు, ఆదిత్యా మీనన్, తులసి, ముమైత్ ఖాన్ తదితరులు
సంగీతం : రధన్, ఛాయాగ్రహణం : రాం ప్రసాద్
బ్యానర్ : హ్యాపీ మూవీస్ 
నిర్మాత : సి. కళ్యాణ్
విడుదల : అక్టోబర్ 11, 2019
1 / 5

―సికిందర్