టోటల్ యాక్షన్ చరిత్ర! – ‘సైరా’ మూవీ రివ్యూ

టోటల్ యాక్షన్ చరిత్ర!

 

మెగాస్టార్ చిరంజీవి 151 వ చలన చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’ ప్రతిష్టాత్మకంగా విడుదలైంది. దీని ప్రచార విశేషాలు చాలా ఇప్పటికే ప్రేక్షకులకి చేరిపోయాయి. మూవీని బయటి నుంచి పరిచయం చేశాయి. కాబట్టి సమయం వృధా చేసుకోకుండా మూవీ  లోపలి విశేషాలేమిటో తెలుసుకుందాం…

కథ 
1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామ నేపథ్యంలో రాణీ ఝాన్సీ లక్ష్మీ బాయి (అనూష్కా శెట్టి) తో ప్రారంభమవుతుంది. పోరాటంలో ఆమె దళం ధైర్యం కోల్పోయి ఆంగ్లేయ పాలకులకి లొంగిపోదామనుకుంటున్నప్పుడు, లక్ష్మీ బాయి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పరాక్రమ గాథ చెప్పి ధైర్యాన్ని నూరిపోస్తుంది. ఈ గాథ సరీగ్గా అంతకి పదేళ్ళ క్రితం 1847 లో కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడలో జరుగుతుంది. ఆ ప్రాంతంలో 61 మంది పాలెగాళ్ళు (సామంత రాజులు) బ్రిటిష్ వాళ్ళకి అణిగి మణిగి వుండేవాళ్ళు. ఒకరిద్దరు అటూ ఇటూ చాడీలు చెప్పే బ్రిటిష్ తొత్తులు (రఘుబాబు, పృథ్వీ) వుండేవాళ్ళు.

ఒక పాలెగాడు ఉయ్యాలవాడ పెద మల్లారెడ్డి. ఈయన దత్తపుత్రుడు నరసింహా రెడ్డి(చిరంజీవి). ఇతను చిన్నపుడే బ్రిటిషర్ల ఆగడాలు చూసి తిరగబడతానని గురువు గోసాయి వెంకన్న (అమితాబ్ బచ్చన్) అనుమతి కోరుతాడు. గోసాయి వెంకన్న ప్రోత్సహిస్తాడు. నరసింహారెడ్డి యుద్ధ కళలు నేర్చుకుంటాడు. పెద్దవాడయి తండ్రి వారసత్వంగా పాలెగాడు అవుతాడు. మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నర్ దీన్ని ఖండిస్తాడు. దత్తపుత్రుడికి పాలెగాడి హోదా చెల్లదంటాడు. మరోవైపు కరువు కాటకాలతో పంటలు పండక పన్నులు కట్టలేని ప్రజల్ని దోచుకుంటూంటాడు బ్రిటిష్ కలెక్టర్. దీంతో నరసింహారెడ్డి బ్రిటిష్ దళాలతో తలపడి కలెక్టర్ తల నరికేస్తాడు. దీంతో గవర్నర్ కి మండిపోయి నరసింహా రెడ్డి మీదికి మరిన్ని దళాల్ని ఎగదోస్తాడు. నరసింహారెడ్డి తోటి పాలెగాళ్ళని పోరాటానికి సంఘటితం చేసేందుకు విఫలయత్నం చేస్తాడు. ఎవరూ ముందుకు రారు. ఈ పరిస్థితుల్లో నరసింహారెడ్డి తనే ప్రజల్ని సైన్యంగా మార్చుకుని బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడతాడు. ఈ తిరుగుబాటులో ఏమేం జరిగాయన్నది మిగతా కథ.

ఎలావుంది కథ
ఇది కాల్పనిక చరిత్ర అని ముందే డిస్ క్లెయిమర్ వేశారు. కాబట్టి ప్రామాణికత గురించి ఆలోచించే ప్రసక్తే వుండదు. ఉయ్యాలవాడ గాథ ఎక్కడోవున్న లక్ష్మీబాయి చెప్పడమంత కల్పన కూడా చేశారు – హిందీ ప్రేక్షకులు కూడా ఈజీగా తీసుకుంటారని. తెలుగులో ఇటీవల చరిత్రలో ఒక వీరగాథ బాలకృష్ణ నటించిన ‘గౌతమీ పుత్రశాతకర్ణి’ తర్వాత రాలేదు. ఇప్పుడు చిరంజీవితో ఉయ్యాలవాడ రావడం ప్రేక్షకులకి ఆసక్తే. ఈ బయోపిక్ గానూ చరిత్రగానూ నమ్మలేని పీరియడ్ మూవీని ఉయ్యాలవాడ కోసం చూడాలా, చిరంజీవి కోసం చూడాలా అన్న ప్రశ్న ఎదురైతే మాత్రం చిరంజీవి కోసమే చూడాల్సి వుంటుంది. ఎందుకంటే ఒక అస్పష్ట ఇమేజి వున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ కాని కథని తెరకెక్కించేప్పుడు అతన్నొక స్మృతి పథంలో నిల్చి పోయే సుస్పష్ట లెజెండ్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ‘లారెన్స్ ఆఫ్ అరేబియా’ లో పీటర్ ఓ టూల్ నటించిన లారెన్స్ పాత్రనీ, ‘లయన్ ఆఫ్ డిసర్ట్’ లో ఆంథోనీ క్విన్ నటించిన ఒమర్ ముఖ్తార్ పాత్రనీ, కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు’ పాత్రనీ స్మృతిపథంలో నిలచిపోయే లెజెండ్స్ గా సుస్పష్టంగా మనముందుంచారు. ‘సైరా’ లో ఇదే లోపం. ఇంత మల్టీ మిలియన్ బడ్జెట్ సినిమాకి సోల్ అండ్ హార్ట్ నివ్వని లోపం.

ఎవరెలా చేశారు
చిరంజీవి 151 వ పాత్ర ఉయ్యాలవాడని ‘ఖైదీ’ నాటి యంగ్ టైగర్ పౌరుషంతో చేశారు. ఈ సినిమాలో చరిత్రని పట్టించుకోనట్టే, ప్రేక్షకులు చిరంజీవి వయస్సునీ పట్టించుకునే స్థితిలో లేరు. సీట్లకి అతుక్కుపోయి పులి పంజాల్ని, పులి గాండ్రింపుల్నీ కళ్ళప్పగించి చూడడమే. ఐదుసార్లు పోరాట దృశ్యాలు చిరంజీవి సత్తాని చాటాయి. భావోద్వేగాల బలమైన ప్రదర్శన వుంది. కానీ ఒక్క చోటైనా బాధ కల్గించే సన్నివేశం లేకపోవడం ఈ యాక్షన్ ఓరియెంటెడ్ కాల్పనికానికి తగ్గటే వుంది. నయనతార, తమన్నాలతో సంక్షిప్త రిలేషన్ షిప్ సన్నివేశాలు మాత్రం పాత్ర ఉదాత్తతని దెబ్బతీయకుండా వున్నాయి.

ఉయ్యాలవాడని మరపురాని లెజెండ్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు గానీ, మధ్యలో నరసింహావతారమని మిథికల్ టచ్ ఇచ్చే విఫలయత్నం చేశారు. ఇదైనా మనస్ఫూర్తిగా చేసివుంటే మిథికల్ క్యారక్టర్ గా దైవత్వంతో మన్ననలందుకునేది. ‘అల్లూరి సీతారామ రాజు’ లో దీన్ని విజయవంతగా నిర్వహించారు దైవత్వాన్ని ఆపాదించి – ‘స్వాతంత్ర్య వీరుడా స్వరాజ్య భానుడా’ అంటూ కీర్తి గానాలతో. విప్లవాన్ని, ఆధ్యాత్మికతని విజయవంతంగా మిక్స్ చేసి అల్లూరి పాత్రని అజరామరం చేశారు.

నాట్యగత్తెగా తమన్నా నటిస్తే, చిన్నప్పుడే ఉయ్యాలవాడతో పెళ్ళయిపోయిన యువతిగా నయనతార నటించింది. ఇద్దరివీ సంక్షిప్త పాత్రలే. పాలెగాళ్ళుగా జగపతిబాబు, కిచ్చా సుదీప్, రవికిషన్ నటించారు. విజయ్ సేతుపతి సెకండాఫ్ మధ్యలో తమిళనాడు నుంచి దండుతో వచ్చి, ఉయ్యాలవాడ దళంలో చేరే గెరిల్లాగా వుంటాడు. బ్రిటిష్ తొత్తుగా రఘుబాబు టక్కరి నటన చూడల్సిన ఒక ముఖ్యాంశం. ఇక అమితాబ్ బచ్చన్ సరే, ఆయన్ని కూర్చోబెట్టేసి డైలాగులు చెప్పిస్తూ పోయారు. ఒకవిధంగా చెప్పాలంటే చిరంజీవికి తప్ప ఏ పాత్రకీ పెద్దగా ప్రాధాన్యం లేదు.

ఇక గొప్పగా చెప్పుకోవాల్సిన విషయమేమిటంటే, నిర్మాతగా రాంచరణ్ ప్రొడక్షన్ విలువలు. కొన్ని కళాత్మక విలువలు. పాటల నృత్యాల్లో కళాత్మక విలువలు వెల్లివిరిశాయి. పోరాటాలు ఎంత భారీగా వున్నాయో పాటల చిత్రీకారణా అంతే భారీగా వుంది. కెమెరా వర్క్, లొకేషన్స్, పీరియెడ్ సెట్స్ ఎక్సెలెంట్. కళాదర్శకత్వం, కూర్పు ఎన్నదగినవి. రెండుగంటల 50 నిమిషాల నిడివి ఒక్కటే శిరోభారం. ఇద్దరు హాలీవుడ్ నిపుణులతో బాటు, రాంలక్ష్మణ్ ల పోరాట దృశ్యాల కొరియోగ్రఫీ వంక పెట్టలేనిది. గ్రాఫిక్స్ వర్క్ కూడా. ప్రారంభంలో వృషభాల దండు చేసే దాడి దృశ్యాలు తెలుగు తెరకి కొత్త.

రచనా పరంగా కావాల్సినంత రాణించలేదు. సాయినాథ్ బుర్రా సంభాషణలు మాత్రం బలంగా వున్నాయి. స్క్రీన్ ప్లే ఫ్లాట్ గా వుంది. ఫస్టాఫ్ లో, సెకండాఫ్ లో అత్యధిక సమయం పోరాట దృశ్యాలకే పోగా, కథగా చెప్పి ఆకట్టుకోవడానికి మిగిలింది కొంతే. ముగింపు యాక్షన్, ఎమోషన్స్, డైలాగ్స్ చిరంజీవితో కదిలించేవిగా వున్నాయి. ప్లస్ మైనస్ లెలా వున్నా, చిరంజీవితో ఇంత బాధ్యత మోసిన దర్శకుడు సురేందర్ రెడ్డికి ప్రశంసలే అందుతాయి. గత సినిమాల కంటే దర్శకత్వంలో రాణించాడు. 

దర్శకత్వం : సురేందర్ రెడ్డి
తారాగణం : చిరంజీవి, అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, రవికిషన్, నయనతార, తమన్నా, బ్రహ్మానందం, రఘుబాబు, బ్రహ్మాజీ తదితరులు
రచన : పరుచూరి బ్రదర్స్, స్క్రీన్ ప్లే : సురేందర్ రెడ్డి,  సంగీతం : అమిత్ త్రివేది, ఛాయాగ్రహణం : రత్నవేలు, పోరాటాలు : రాం లక్ష్మణ్, గ్రెగ్ పావెల్,లీ విటేకర్ 
బ్యానర్ : కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ
నిర్మాత:  రామ్ చరణ్
విడుదల : అక్టోబర్ 2, 2019
3/5


―సికిందర్