ఇదే జరుగుతుంది! -‘ఏదైనా జరగొచ్చు’ మూవీ రివ్యూ!

ఇదే జరుగుతుంది! – ‘ఏదైనా జరగొచ్చు’ మూవీ రివ్యూ!

సీనియర్ నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజాని హీరోగా పరిచయంచేస్తూ ‘ఏదైనా జరగొచ్చు’ తీశారు. ప్రముఖ దర్శకుడు చంద్ర శేఖర్ ఏలేటి అసిస్టెంట్ రమాకాంత్ దర్శకుడుగా పరిచయమవుతూ దీన్ని హార్రర్ కామెడీగా తీశాడు. హార్రర్ కామెడీల సీజన్ చల్లారేక ఈ వర్షాకాలంలో వేడి పుట్టించడానికన్నట్టు దెయ్యపు కేకలు పెట్టించాడు. కానీ ప్రేక్షకులు హార్రర్ కామెడీలూ, రోమాంటిక్ కామెడీలూ తీసి అవతలబెట్టి, థ్రిల్లర్స్ తో చలి కాచుకుంటున్నారు. వారం వారం థ్రిల్లర్స్ కి ఎగబడుతున్న ప్రేక్షకులు ఈ హార్రర్ కామెడీకి ఐపు లేకుండా పోయారు. ప్రేక్షకుల గెస్సింగ్ ఎంతవరకు కరెక్టో ఈ కింద చూద్దాం…

కథ 
ఇది సులభంగా డబ్బు సంపాదించాలనుకునే ముగ్గురు కుర్రాళ్ళ కథ. జై (విజయ్ రాజా) కి ఇద్దరు స్నేహితులుంటారు. ఒక ప్రకటన చూసి జై ఓ బ్యాంక్ రికవరీ ఏజెంట్ గా చేరతాడు. శశి రేఖ (పూజా సోలాంకీ) అనే అమ్మాయి దగ్గర బాకీ వసూలు చేయడానికి వెళ్లి ప్రేమలో పడతాడు. ఆమె ఒక స్టార్ట్ అప్ కంపెనీ ప్రారంభించి నష్టపోయి వుంటుంది. ఆమెని ఆదుకోవడానికి క్రికెట్ బెట్లు కట్టి ఆ గెలిచిన డబ్బు వసూలు చేసుకోవడానికి స్నేహితులతో కాళీ (బాబీ సింహా) అనే క్రిమినల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ కాళీ దెయ్యంతో వుంటాడు. ఆ దెయ్యం వీళ్ళని చూసి పగబడుతుంది. దాంతో జై, అతడి స్నేహితులు పారిపోయి వచ్చేస్తారు. దెయ్యమైన ఆ అమ్మాయి ఎవరు? కాళీతో ఎందుకుంది? కాళీ దగ్గర జై డబ్బు వసూలు చేసుకున్నాడా? దెయ్యం పీడా వదిలించుకున్నాడా? ఈ సందేహాలన్నీ మిగతా కథలో తీరుతాయి.

ఎలా వుంది కథ
హార్రర్ కామెడీల పరిశ్రమ ఖాయిలా పడ్డాక వచ్చిన హార్రర్ కామెడీ ఇది. కొత్త దర్శకుడు హార్రర్ కామెడీల ట్రెండ్ లోనే ప్రయత్నాలు ప్రారంభించి వుంటాడు. అవి ఫలించే సరికి పుణ్యకాలం కాస్తా గడిచి పోయింది. అయినా మార్కెట్ యాస్పెక్ట్ తో ఎకనమిక్స్ అంశంతో కథ బాగానే ప్రారంభించాడు. మధ్య కొచ్చేసరికి దెయ్యంతో ముడిపెట్టి టెంప్లెట్ లో హార్రర్ కామెడీగా మార్చెయ్యడంతో మార్కెట్ యాస్పెక్ట్ కుదేలై కొంపముంచింది. ఇటీవల చిన్నబడ్జెట్లో ఎకనమిక్స్ మార్కెట్ యాస్పెక్ట్ తో, రియలిస్టిక్ గా స్ట్రగుల్ చూపించిన ‘హుషారు’ స్లీపర్ హిట్టయ్యింది. ఎకనమిక్స్ కైనా, రోమాంటిక్స్ కైనా ఇప్పుడు మార్కెట్ యాస్పెక్ట్ కి రియలిస్టిక్ చిత్రణలు అవసరం. టెంప్లెట్ ఫార్ములాలు కాలం చెల్లిపోయాయి. కానీ ఇదే పట్టుకుని కొత్త దర్శకుడు, కొత్త హీరో దెబ్బతిని పోయారు.

ఎవరెలా చేశారు
కొత్త హీరో విజయ్ రాజా హైట్, ఫేస్, బాడీ ఎలాటి పాత్రకైనా ఓకే అన్నట్టున్నాయి. పైగా మంచి నవ్వు ముఖం. ఈజీగా నటన వచ్చేస్తుంది. కాకపోతే ‘ఏదైనా జరగొచ్చు’ తో యువప్రేక్షకుల్లో తనకేమీ జరగలేదు. పూర్తిగా వాళ్ళ దృష్టిలో పడకుండానే ఈ సినిమా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకో మంచి ప్రయత్నం చేసి ఎక్కువ మార్కెట్ గల యువప్రేక్షకులని ఆకర్షించే ఏకైక ఎజెండా తో, అలాటి సబ్జెక్టునిచ్చే దర్శకుల్ని ఆచితూచి ఎంపిక చేసుకోవాలి. ఎవర్ని పడితే వాళ్ళని నమ్మకూడదు.
హీరోయిన్ మిస్ సోలాంకీ అప్పట్లో లేత

హీరోయిన్ గా సారికా వున్నప్పటి పోలికలతో వుందిగానీ, అభినయంతో లేదు. అయినా ఒక సినిమా చేసి పోయే కొత్త హీరోయిన్ల టాలెంట్ గురించి ఆలోచించవసరం లేదు. దెయ్యం పాత్ర వేసిన రెండో హీరోయిన్ సాషా సింగ్ పాత్రతీరు ఎవరికీ నచ్చే అవకాశం లేదు. ఆ పాత్ర తీరుతో ఆమె నటనా భరించలేరు. బాబీసింగ్ మొరటు విలన్ గా అతిహింస ప్రదర్శిస్తాడు.

సాంకేతికంగా, సంగీతపరంగా చెప్పుకునేంత ఏమీ లేదు. హార్రర్ గ్రాఫిక్స్ సోసో.

చివరికేమిటి
దర్శకుడు టైటిల్స్ వేసిన విధానం చూస్తే ఇదేదో ఫిలిం నోయర్ జానర్ లో న్యూ ఏజ్ థ్రిల్లర్ గా వుండ వచ్చని ఒక అంచనా కొస్తాం. ఈ మధ్య వారానికో థ్రిల్లర్ విడుదలవుతూ  కొత్త గాలులు వీస్తున్న అనుకూల వాతారణంలో కొత్త దర్శకుడు సరైన ప్రొడక్టుతో వచ్చాడని ఉత్సాహపడతాం. ఈ ఉత్సాహమంతా టైటిల్స్ పూర్తవగానే నీరుగారి పోతుంది. పోనీలే డబ్బు సంపాదించే ఎకనామిక్ మార్కెట్ యాస్పెక్ట్ తోనైనా సీన్లు నడుస్తున్నాయనుకుంటే, ఇది కూడా వెళ్లి మార్కెట్ నుంచి మాయమైపోయిన హర్రర్ కామెడీ జానర్ లో పడుతుంది. దీంతో సెకండాఫ్ అంతా చిందరవందరై పోయి ఇన్ స్టెంట్ ఫ్లాపు కింద జమ అయిపోయింది. ఆమె దెయ్యం ఎలా అయిందో సెకండాఫ్ ప్రారంభంలో సుదీర్ఘమైన ఫ్లాష్ బ్యాక్ ప్రారంభించి అందులో హింసాత్మకమైన మూడు ముక్కలాట ముఠాల కథ చెప్పుకొచ్చాడు. అంతా బీ గ్రేడ్ సినిమా వ్యవహారం. ఆ రౌడీ పాత్రలు, గంజాయి అమ్ముకునే ఆ రెండో హీరోయిన్ పాత్ర, ఆమె ప్రేమించే విలన్ పాత్రా ఎవరికీ కనెక్ట్ కావు, నచ్చవు.

ప్రేక్షకులు కరెక్ట్ గానే గెస్ చేశారు – ఇంకా హార్రర్ కామెడీకి వెళ్తే ఏం జరుగుతుందో. ‘ఏదైనా జరగొచ్చు’ అనే వూహాగానాలకి చోటే లేదు.

రచన – దర్శకత్వం : రమాకాంత్‌
తారాగణం : విజయ్‌ రాజా, పూజా సోలంకి, సాషా సింగ్‌, బాబీ సింహా, వెన్నెల కిశోర్‌
సంగీతం : శ్రీకాంత్‌ పెండ్యాల ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి
వేట బ్రెయిన్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాత : సుదర్శన్‌ హనగోడు
1.5

―సికిందర్