సీఎం కేసీఆర్ పై షర్మిల సెటైర్లు.. ఒక్క వరదకే కేసీఆర్ కు కష్టాలంటూ?

సీఎం కేసీఆర్ తాజాగా క్లౌడ్ బరస్ట్ గురించి చేసిన వ్యాఖ్యల గురించి నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతి వచ్చిందని క్లౌడ్ బరస్ట్ వెనుక ఏవో కుట్రలు ఉన్నాయని చెబుతున్నారని తాజాగా కామెంట్లు చేశారు. ఇతర దేశాల వాళ్లు మన దేశంలో కావాలనే అక్కడక్కడా క్లౌడ్ బరస్ట్ చేస్తున్నట్టు తెలుస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. గోదావరీ పరివాహక ప్రాంతంపై కూడా క్లౌడ్ బరస్ట్ చేస్తున్నట్టు చూచాయగా సమాచారం ఉందని కేసీఆర్ కామెంట్లు చేశారు.

కేసీఆర్ చేసిన కామెంట్ల గురించి షర్మిల స్పందిస్తూ ఆంధ్రవాళ్ల అణచివేతలు అయిపోయాయని ప్రతిపక్షాల పన్నాగాలు అయిపోయాయని తిరుగుబాటుదారుల వెన్నుపోటులు కూడా అయిపోయాయని కామెంట్లు చేశారు. జాతీయ పార్టీల జిమ్మిక్కులు, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కూడా అయిపోయిందని షర్మిల అన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ కుట్రలు మొదలయ్యాయని షర్మిల కామెంట్లు చేశారు.

ఒక్క వరద వల్ల మన సీఎం గారికి ఎన్ని కష్టాలు వచ్చాయంటూ షర్మిల చెప్పుకొచ్చారు. షర్మిల సెటైర్ల గురించి కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంది. షర్మిల ఎంతగానో కష్టపడుతున్నా తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ బలపడటం లేదు. షర్మిల మినహా పార్టీలో చెప్పుకోదగ్గ స్థాయిలో గుర్తింపు ఉన్న నేతలెవరూ లేకపోవడం పార్టీకి మైనస్ అవుతోంది.

అయితే విమర్శించడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా షర్మిల ఆ అవకాశాన్ని వదులుకోవడం లేదు. గోదావరి వరదతో భద్రాచలం జలమయం కావడంతో క్లౌడ్ బరస్ట్ కుట్ర జరిగిందని కేసీఆర్ వ్యక్తం చేసిన అనుమానాలపై ప్రతిపక్షాల నుంచి ధీటైన సమాధానాలు వస్తున్నాయి. కేసీఆర్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ట్రోలింగ్ జరుగుతుండటం గమనార్హం. ప్రతిపక్షాల విమర్శలపై కేసీఆర్ స్పందిస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.