మంత్రి ఈటెల రాజేందర్ కు నిరసన సెగ

మంత్రి ఈటెల రాజేందర్ కు పరాభవం ఎదురైంది. సొంత నియోజకవర్గంలో మంత్రి ప్రచారం చేస్తుండగా మహిళలు నిలదీశారు. దీంతో చేసేది లేక మంత్రి అక్కడి నుంచి వెనుదిరిగారు. శుక్రవారం రాత్రి మంత్రి ఈటెల తన సొంత నియోజకవర్గం హూజూరాబాద్ లో ప్రచారం చేస్తుండగా ఈ సంఘటన జరిగింది.

హూజురాబాద్ లోని డిసిఎస్ కాంప్లెక్స్ లో మంత్రి ప్రచారం చేస్తున్నారు. ఇంతలో కొంత మంది మహిళలు మీరెందుకు ప్రచారం చేస్తున్నారు, అసలు ఇచ్చిన హామీలు నెరవేర్చారా అంటూ మంత్రిని నిలదీశారు. కేజి టూ పిజి విద్య అమలేది, దళితులకు మూడెకరాల భూమి ఏది, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఏవంటూ వారు మంత్రి పై ప్రశ్నల వర్షం కురికపించారు.

ఇంతలో మంత్రి కలగజేసుకొని ఏంటమ్మా ఏమో ప్రశ్నిస్తున్నారు అని మాట్లాడేలోపు అక్కడే ఉన్న మంత్రి అనుచరులు మంత్రిని పక్కకు తీసుకెళ్లారు. మంత్రికి పక్కకు వెళ్లిన తర్వాత కొంత మంది నేతలు అసలు మీది ఏ పార్టీ అంటూ మిమ్ముల ఎవరూ పంపించారంటూ వారిపై రుబాబు చేశారు. దీంతో మహిళలంతా తిరగబడి టిఆర్ ఎస్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో చేసేది లేక కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లి పోయారు.

టిఆర్ ఎస్ నాయకులు ఒక దశలో అక్కడ ఉన్న మహిళలతో వాగ్వాదానికి దిగారు. మహిళలు కూడా అంతే రీతిలో ప్రతిఘటించడంతో చేసేది లేక వారు వెనుదిరిగారు. మంత్రి కూడా జరిగిన సంఘటనతో ఖంగుతిని ప్రచారాన్ని అర్దాంతరంగా నిలిపివేసి వెల్ళిపోయారు.

ఈటెల రాజేందర్ కు సొంత నియోజకవర్గంలోనే వ్యతిరేకత రావడంతో అంతా ఖంగుతిన్నారు. టిఆర్ ఎస్ లో హరీష్ రావు, ఈటెల రాజేందర్ అంటే మంచి పేరుంది. పార్టీల పరంగానే కాకుండా వారిని పలు సందర్బాల్లో ప్రతిపక్ష నాయకులు సైతం మెచ్చుకున్నారు. అటువంటిది ఈటెల రాజేందర్ కు తన స్వంత నియోజకవర్గంలోనే నిరసన సెగ తగలడంతో అంతా ఆశ్చర్య పోయారు.

తెలంగాణ వ్యాప్తంగా టిఆర్ ఎస్ పట్ల ఎంత వ్యతిరేకత ఉందో అర్ధమవుతందని పలువురు చర్చించుకున్నారు. అమలు చేస్తామన్న హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదని మళ్లీ ఏ ముఖం పెట్టుకొని వచ్చారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పిన పనులు చేయ చేతగానీ వారికి ఓటు అడిగే హక్కు లేదంటూ వారు మండిపడ్డారు.