రేవంత్ డిఎన్ఎ మాటలపై మహిళా జర్నలిస్ట్ స్ట్రాంగ్ పంచ్

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంట్లో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న కోణంలో ఐటి అధికారులు సోదాలు జరిపారు. రెండు రోజులపాటు వారు దాడులు జరిపి పలు డాక్యుమెంట్స్ ను తీసుకుపోయారు. అక్టోబరు మూడో తేదీన విచారణకు హాజరు కావాలంటూ రేవంత్ కు నోటీసులు జారీ చేశారు. రేవంత్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, అనుచరుల ఇండ్లలోనూ ఐటి రైడ్స్ జరిగాయి.

అయితే ఐటి దాడుల నేపథ్యంలో మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. ఒక పత్రికలో అయితే రేవంత్ అక్రమాస్తులు వెయ్యి కోట్లు అని రాశారు. మరికొన్ని టివి చానెళ్లలో కూడా అలాంటి వార్తలే వచ్చాయి. ఉదయం నుంచి టివిల్లో రేవంత్ ఇండ్ల మీద ఐటి రైడ్స్ అని లైవ్ లు నడిపిన మీడియా సంస్థలు రహస్యంగా ఒక నివేదిక అందగానే టర్న్ తీసుకున్నాయి. రేవంత్ రెడ్డికి ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు అని ప్రసారాలను హోరెత్తించాయి. 

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అసలు వాస్తవాలేంటో మీడియాకు వివరించారు. అదే మీడియా సమావేశంలో జర్నలిస్టులను ఉద్దేశించి రేవంత్ అభ్యంతరకరంగా మాట్లాడారు. ‘‘నాకు అక్కడ ఖాతాలు ఉన్నాయి, ఇక్కడ ఖాతాలు ఉన్నాయని ఒకాయన అంటున్నడు. మీకు దమ్ముంటే నిరూపించాలి. నాకు ఎక్కడెక్కడ ఖాతాలున్నాయో.. లేకపోతే మీరు డిఎన్ఎ టెస్ట్ కు సిద్ధపడాలి. మీ తండ్రి కరెక్టేనా? మీ తల్లి కరెక్టేనా అని… ఏ దానికైనా ఒక హద్దు ఉంటది’’. అంటూ రేవంత్ పరుషమైన భాష మాట్లాడారు. రేవంత్ వ్యాఖ్యలపై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తక్షణమే రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. 

రేవంత్ రెడ్డి మీడియా మీద చేసిన కామెంట్స్ ను నిరసిస్తూ సీనియర్ జర్నలిస్టు నస్రీన్ ఖాన్ ఒక కవిత రాశారు. ఆమె రాసిన కవిత కింద ఉంది చదవండి.

బండబారిన వికారపు పెదాలు
ఏవైనా పలకగలవు
పరిణతి చెందని మెదడుతో
నరం లేని నాలుకతో
జర్నలిస్టులపై విషం కక్కావు  రాజకీయం పేరు చెప్పి

మేకపోతు గాంభీర్యం పైనే ధ్యాసంతా నిలిపి
మోకరిల్లగలవు
సున్నితమైన మనసుని నిరూపించుకునే తాపత్రయంలో
మునిగి
నీ కదలికలకు ప్రచారమిచ్చి హీరోని చేసినందుకు తేలికగానే డిఎన్ఏ టెస్టులనగలవు

అలరారుతుంటాయి అలంకార ప్రాయాలుగా
ఆధునికవాదులమనే అందమైన ట్యాగులు
తన్నుకొస్తుంటాయి లోలోపల దాగిన
 మూర్ఖపు భావాలు ఒక్కటొక్కటిగా

అదిగో…
నీ అబద్ధపు పునాదుల సౌధం
కూలిపోతోంది నిర్మితమైన చోటునే
పెకళించగలవా ‘రేవంత్’
నిజాయితీ లోపించిన నీ మాటల గారడీతో…

-నస్రీన్ ఖాన్
30.9.2018