మరో టిఆర్ఎస్ ఎమ్మెల్యేపై అవినీతి మరక

తెలంగాణలో అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికార పార్టీ నేతల బండారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేపై అవినీతి మరక పడింది. చిన్న పోస్టుకే 50 లక్షలు డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించిన సంచలనం రేపారు. ఇది నిజం కాదని ఎమ్మెల్యే నిరూపిస్తే ఏ శిక్షకైనా తయార్ అని సవాల్ చేశారు. ఎమ్మెల్యే గుడి మెట్ల మీద ప్రమాణం చేసి ఇది నిజం కాదని చెప్పే దమ్ముందా అని ఎమ్మెల్యేను ఇరుకున పెట్టేశారు. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు.. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా. ఆయన మీద ఆరోపణలు చేసిన వ్యక్తి కూడా ఆశామాషి నాయకుడేం కాదు.. టిఆర్ఎస్ పుట్టకముందునుంచే కేసిఆర్ తో అటాచ్ అయి ఉన్న మనిషి. మొత్తానికి ఈ వ్యవహారంలో ఏం జరిగిందో చూద్దాం..

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికార పార్టీ ఎమ్మెల్యేల లీలలు బయటకు రావడానికి అనేక కారణాలున్నాయి. వారు పదవులు గట్రా ఇప్పిస్తారేమోనని ఇంతకాలం ఎదురుచూసిన వారంతా ఇక ఎలక్షన్ ఇయర్ వచ్చింది కాబట్టి ఇప్పుడేం ఇప్పిస్తాడులే అనుకుని ప్లేట్ ఫిరాయించి ఎమ్మెల్యేల పాత గుట్టు విప్పుతున్నారు. అంతేకాదు ఎమ్మెల్యే బదనాం అయితే తదుపరి తాము టికెట్ రేసులో ఉంటాం కదా అనుకుని కొందరు దిగువ శ్రేణి నేతలు కూడా ఎమ్మెల్యేల బండారం బయటపెడుతున్నారు. మరికొందరైతే అధిష్టానం తమను పట్టించుకోవడంలేదన్న ఆక్రోశంతో లోకల్ ఎమ్మెల్యపై విమర్శలు చేసి సంచలనం చేస్తే పెద్దాయన కండ్లపడొచ్చన్న ప్లాన్ తో ఎమ్మెల్యే చీకటి పనులు బయటపడేస్తున్నారు. అయితే నిజామాబాద్ బీగాల గణేష్ గుప్త పై ఆరోపణలు ఎందుకొచ్చాయి? ఏం జరిగిందంటే..?

ఎఎస్ పోశెట్టి.. ఈ పేరును విన్న నిజామాబాద్ వాస్తవ్యులకు గుర్తొచ్చేది టిఆర్ఎస్ పార్టీ. పోశెట్టి అంటే టిఆర్ఎస్.. టిఆర్ఎస్ అంటేనే పోశెట్టి అన్నట్లుగా నిజామాబాద్ లో పార్టీని నడిపారు ఎఎస్ పోశెట్టి. అంతేకాదు.. తెలంగాణ ఉద్యమం ప్రారంభించకముందు టిఆర్ఎస్ అనే రాజకీయ పార్టీ పెట్టాలని ఆలోచనలు చేస్తున్న కాలంలో కొద్ది మంది తన మిత్రులతో కేసిఆర్ పార్టీ పెట్టే విషయమై ఆలోచనలు పంచుకున్నారు. అలా టిఆర్ఎస్ ఏర్పాటు విషయంలో ఆలోచనలు పంచుకున్న వ్యక్తుల్లో పోశెట్టి కూడా ఒకరు. అన్నం తిని.. అటుకులు బుక్కి పార్టీని నిలబెట్టిన వారిలో పోశెట్టి కూడా ఒకరు. అంతటి స్థాయి ఉన్న పోశెట్టి కాలక్రమంలో టిఆర్ఎస్ లో రోజురోజుకూ స్థాయి తగ్గుతూ వస్తోంది. ఎప్పుడో ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి.. ఇప్పటి వరకు కాలేకపోయాడన్న బాధలో ఉన్నారు. కేసిఆర్ తో ఎంతో చనువున్నా.. ఆయనకు అక్కరకు రాలేదని ఆయన అనుచరులు ఆవేదనతో చెబుతున్నారు. 12 ఏళ్ల టిఆర్ఎస్ ఉద్యమాన్ని తన సొంత ఖర్చుతో పోశెట్టి నడిపారని, అయినా ఆయనకు పార్టీలో కనీస గుర్తింపు లేకుండాపోయిందని ఆయన అభిమానులు బాధపడుతున్నారు.

మొన్నటికి మొన్న నిజామాబాద్ అర్బన్ సీటును ఆయన ఆశించారు. కానీ ఎంపి కవిత రిక్వెస్ట మేరకు బీగాల గణేష్ గుప్తాకు టికెట్ ఇస్తే సహకరించారు. అయితే పోశెట్టికి ఇప్పటి వరకు టిఆర్ఎస్ పోలిట్ బ్యూరో పదవి మాత్రమే దక్కింది తప్ప అధికారంలోకి వచ్చినంక ఆయనను పట్టించుకుంటోడే లేడని అంటున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా కార్పొరేషన్ కు ఛైర్మన్ పదవి దక్కుతుందని ఆశతో ఉన్నారు పోశెట్టి. కానీ ఏమీ దక్కలేదు. దీంతో కనీసం తనకు గుర్తింపు ఇచ్చారన్న సంతృప్తి దక్కేందుకైనా మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవైనా ఇవ్వండి అని ఆయన ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తాను అడిగితే 50 లక్షలు ఇస్తే మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి ఇప్పిస్తానని అన్నట్లు పోశెట్టి బహిరంగ ప్రకటన చేశారు. డబ్బులు అడగలేదని చెప్పే దమ్ము ఎమ్మెల్యేకు ఉందా అని ప్రశ్నించారు. గుడిమెట్ల మీద ప్రమాణం చేయగలరా అని నిలదీశారు. ‘‘ఎమ్మెల్యే టికెట్ పోయింది.. సొంత డబ్బు ఖర్చు చేసి పార్టీకి సేవ చేసింది పోయింది. ఏదైనా కార్పొరేషన్ ఛైర్మన్ పోస్టో.. నామినేటెడ్ పదవో.. ఏదీ ఇవ్వకపోతే టిఆర్ఎస్ ను అట్టి పెట్టుకుంటే దక్కిన గౌరవం ఏముంది?’’ అని పోశెట్టి తన అనుచరులతో ఆవేదనను పంచుకున్నారట.

పోశెట్టి టిఆర్ఎస్ లోకి రాకముందే బిడి కార్మికుల సంఘానికి ఆల్ ఇండియా ప్రసిడెంట్ గా పనిచేసి మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారని అంటున్నారు. టిఆర్ఎస్ లో చేరిన తర్వాత సొంత డబ్బులు ఖర్చు చేసుడే తప్ప ఆయన సంపాదించుకున్నదేమీ లేదని ఆయన అభిమానులు చెబుతున్నారు. తన స్థాయికి సరిపోయే పదవి కాకపోయినా మార్కెట్ కమిటీ అయినా ఇస్తరేమో అని ఎదురుచూస్తే దానికి కూడా 50 లక్షలు లంచం అడగడంతో ఆయన ఆగ్రహంతో రగలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత వరకు ఈవిషయాన్ని చేరవేయడం కోసమే పోశెట్టి బహిరంగంగా ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్త మీద బహిరంగ ఆరోపణలు చేసినట్లు చెబుతున్నారు. మరి దీనిపై సిఎం కేసిఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.