తెలంగాణ సర్కారుకు బిగ్ షాక్, భర్తను మార్చడంపై భార్య ఆగ్రహం (వీడియో)

తెలంగాణ సర్కారు చేసిన నిర్వాకం ఈ ఫ్యామిలీ ఇప్పుడు అభాసుపాలైంది. లోన్లు ఇస్తామని కొందరు అధికారులు మాయమాటలు చెప్పి ఫొటోలు తీసుకుపోయి తమను నవ్వులపాలు చేశారని ఈ ఫ్యామిలీ బాధపడుతున్నది. తన ఫొటో పక్కన తన భర్త ఫొటో కాకుండా వేరే వ్యక్తి ఫొటో పెట్టి తమను అవమానాలపాలు చేశారని ఆవేదన చెందుతున్నది. గంటెడు భూమి లేని మాకు రైతు బీమా ఎట్లొస్తదని ఈ కుటుంబం సర్కారు పెద్దలను నిలదీస్తున్నది. మా బిడ్డ స్నానం చేస్తుండగా ఫొటో తీసి ఇలా ఫొటోలు మార్చడంతో కుటుంబంలో అలజడి రేగిందని చెబుతోంది.

బాధిత కుటుంబానిది సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండలానికి చెందిన తొగర్రాయి గ్రామం. వారి పేరు భర్త పేరు నాగరాజు, భార్య పేరు పద్మ. మూడేళ్ల క్రితం యాదగిరిగుట్ట దగ్గర వంగపల్లి గ్రామంలో వీరు పాత బొంతలు అమ్ముతుండగా కొంతమంది లోన్ల పేరుతో ఫొటోలు తీసుకున్నట్లు చెబుతున్నారు.

తన పక్కన వేరే వ్యక్తిని భర్తగా యాడ్ లో వేసిన చిత్రాన్ని చూపుతున్న భార్య

తెలంగాణ సర్కారు ఇటీవల తెలుగు పత్రికలతో పాటు ఇతర భాషల పత్రికల్లో కూడా కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఫ్రంట్ పేజీ యాడ్స్ కుమ్మరించింది. రైతు బీమా పథకం, కంటి వెలుగు పథకం కింద జనాలకు గొప్ప మేలు చేకూరుస్తున్నట్లు యాడ్స్ లో వివరించింది. అయితే ఆ యాడ్స్ కోసం తీసుకున్న ఫొటోలు వివాదాస్పదమైనాయి. తెలుగు యాడ్స్ లో భర్త, భార్య, వారి బిడ్డ సరిగానే ఉన్నారు. కానీ ఇంగ్లీష్ పత్రికల్లో ఇచ్చిన యాడ్స్ లో మాత్రం భార్య, బిడ్డ ఒకరే కానీ భర్త ఫొటో మార్చేశారు. ఈ అంశాన్ని సోషల్ మీడియా లేవనెత్తింది. అంతేకాదు సర్కారు దుమ్ము దులిపింది. దీనిపై టిఆర్ఎస్ కార్యకర్తలు ఎదురు దాడి చేశారు కూడా. యాడ్స్ లో నటించే వాళ్లు ఎవరితోనైనా నటిస్తారు. దీని మీద కూడా కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రతయ్నం సోషల్ మీడియా మానుకోవలని ఎదురుదాడికి దిగారు.

భార్య, భర్త, పాప.. వీరి ఫ్యామిలీ ఫొటోలు మార్పు చేసిన తెలంగాణ అధికారులు

కానీ ఇప్పుడు టిఆర్ఎస్ శ్రేణులకు, తెలంగాణ సర్కారు అధికారులకు దిమ్మదిరిగే షాక్ తగిలింది. యాడ్ లో ఇచ్చిన ఫొటోలో ఉన్న మహిళ రెస్పాన్డ్ అయ్యారు. తన పక్కన తన భర్త ఫొటో కాకుండా వేరే వ్యక్తి ఫొటో పెట్టి పేపర్లలో యాడ్ వేయడంతో తమ కుటుంబం బజారుపాలైందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పాపకు స్నానం చేయిస్తుంటే తన ఫొటో, తన పాప, తన భర్త ఫొటోలు తీసుకుపోయి ఇలా మారుస్తారా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. అంతేకాదు. తమకు లోన్లు ఇస్తామనేసరికి ఫొటోలు దిగామని ఆమె ఆవేదన చెందుతున్నది. కూలి నాలి చేసుకుని బతికే తమను ఇలా బజారుపాలు చేసి మా సంసారంలో నిప్పులు పోస్తారా అని నిలదీస్తున్నది. పత్రికలో యాడ్ వచ్చిన నాటి నుంచి తమ ఇంట్లో గొడవలు అవుతున్నాయని ఆమె బాధపడుతూ చెప్పారు. 

ఆ మహిళ ఏమంటున్నదో కింద వీడియో ఉంది చూడండి.

 

తెలంగాణ అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం ఈ ఘటన. లోన్లు ఇప్పిస్తామని చెప్పి ఈ కుటుంబాన్ని బజారులో పడేసిన అధికారులు ఎవరైనా సరే వారి మీద చర్యలు తీసుకుంటారా? లేక పాలక పెద్దలు లైట్ తీసుకుంటారా అన్నది చూడాలి. మరి దీనికి గులాబీ దళాలు ఏరకమైన సమాధానం చెబుతాయో చూడాలి. ఆ భార్యాభర్తలకు ఎలాంటి న్యాయం చేస్తారో మరి? ఈ బాధిత మహిళ స్టేట్ మెంట్ తో అయినా గులాబీ శ్రేణుల నోర్లు మూతపడాలని ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.