రేవంత్ పై భూకబ్జా ఫిర్యాదుల వెనుక ‘గులాబీ’ మతలబు ఇదే

సందిళ్ళ శ్రీకాంత్ రెడ్డి

 

రేవంత్ రెడ్డి పై రామారావు అనే వ్యక్తి శనివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అసలు ఈ రామారావు కు మై హోమ్ రామేశ్వర్ రావుకు ఉన్న సంబంధం ఏంటి?  రేవంత్ కు కాంగ్రెస్ లో పదవి అనౌన్స్ చేసే ముందే ఇలాంటివి తెరమీదకు ఎందుకు వస్తున్నాయి? ఈ విషయాన్ని నా ఆర్టికల్ చివర్లో మాట్లాడుకుందాం.

ముందు రామారావు పెట్టిన కేసు విషయానికి వద్దాం. రామారావు ఆరోపణ ఏమనగా? 2002 లో 7 ప్లాట్లను రేవంత్ రెడ్డి అక్రమంగా అమ్మేశాడు అని ఒక ఆరోపణ చేయగా, కోర్టులో ఫైల్ కూడా రేవంత్ రెడ్డి మాయం చేశాడు అని ఇంకో ఆరోపణ చేశారు. ఇక అసలు విషయానికి వద్దాం రామారావు చెప్తున్న 7 ప్లాట్లు 1994 లో కేటాయించారు అప్పుడు రేవంత్ రెడ్డి ఆ సొసైటీలో మెంబెర్ గా లేడు, 2002 లో అవి రిజిస్ట్రేషన్ అయ్యాయి. అప్పుడు కూడా రేవంత్ రెడ్డి కేవలం ఎగ్జిక్యూటీవ్ మెంబెర్ గా మాత్రమే ఉన్నాడు. అసలు ఏ హౌసింగ్ సొసైటీలో అయినా అధికారం అంతాకూడా ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరరీ ల చేతిలోనే ఉంటుంది. మరి ఈ ల్యాండ్ కు సంబంధించిన ఫైల్ మెంబెర్స్ దగ్గరకు కూడా రాదు అలాంటప్పుడు ఒక ఈసీ మెంబెర్ గా ఉన్న రేవంత్ రెడ్డి 7 ప్లాట్లు ఎలా అమ్ముకున్నాడు?

అప్పుడు ప్రెసిడెంట్, జనరల్ సెక్రెటరీ, ట్రెజరరీ గా ఉన్న ముగ్గురు వ్యక్తులు అప్పటి సీఎంకు అత్యంత సన్నిహితులు. ఆ మాటకొస్తే.. ఇప్పటి తెలంగాణ సీఎం కు కూడా వాళ్ళు సన్నిహితులే. పోనీ రామారావు చెప్తున్నట్లు ఈసీ మెంబెర్స్ దే తప్పు అనుకుందాం. మరి రేవంత్ రెడ్డి తో పాటు మరో ఏడుగురు ఈసి మెంబర్స్ ఉన్నారు కదా వాళ్ళ  సంగతేంది? వాళ్ల పై రామారావు ఎందుకు ఫిర్యాదు చేయలేదు. ఆ ఏడుగురిలో ఒకరు జయశ్రీ రెడ్డి.. ఈమె ప్రస్తుత మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి సొంత అక్క. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 లో ఉంటారు. మరో ఇద్దరు ఈటిక్యాల విష్ణు రావు,  జగ్గారావు. వీళ్ళు ఇద్దరు కేసీఆర్ కు దగ్గరి బంధువులు. మరి వీళ్ళను ఎందుకు వదిలేశారో అర్థం కావడంలేదు. నిజంగా మెంబెర్స్ దే తప్పు అయితే ఈ ముగ్గురు పైన కూడా ఫిర్యాదు చేయాలి కదా?

ఇక కోర్టులో ఫైల్ మాయం అవ్వడంపై ఫిర్యాదు చేసిన రామారావు 2014 లో హైకోర్టు లో ఒక పిటిషన్ వేశారు. దాంట్లో ఆయన చెప్పిందేమంటే ? తాను మెట్రోపాలిటన్ కోర్టులో కేసు తాలూకు ఫైల్ అడిగితే 10 సంవత్సరాలు దాటిన ఫైల్స్ డిస్ట్రాయ్ చేస్తాము అని మెట్రోపాలిటన్ కోర్టువారు అన్నట్లు హైకోర్టు కు తెలిపారు. మరి ఇప్పుడేమో అది రేవంత్ రెడ్డే మాయం చేశాడన్నట్లు మాట్లాడుతున్నాడు దింట్లో ఏది నిజం?

ఇక ఆ రామారావు ఇప్పుడే ఎందుకు ఊడి పడ్డాడో తెలియని ముచ్చటేం కాదు. ఆయన ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చాడు అనేది చాలా ముఖ్యమైన విషయం. రేవంత్ రెడ్డి ప్రస్తుతం అమెరికా లో ఉన్నాడు. వచ్చాక రామేశ్వర్ రావు పై కొన్ని కేసులు ఫైల్ చేయబోతున్నాడు. వాటికి కౌంటర్ గా ముందే ప్లాన్ చేసి ఇవాళ రామారావు కేసు వేసినట్లుగా అనిపిస్తుంది.

దింట్లో ఇంకో కోణం కూడా దాగి ఉంది. అతి త్వరలో రేవంత్ రెడ్డి కి ప్రచార కమిటీ పదవి వచ్చి రాష్ట్రమంతా తిరగకుండా కొన్ని కేసులు బనాయించి వాటి చుట్టే తిరిగేలా చేయడం అధికారపార్టీ ఎత్తుగడ. రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీ పదవి వచ్చి రాష్ట్రం అంతా తిరిగితే జరిగే పరిణామాలు కేసీఆర్ కు పూర్తిగా తెలుసు. అందుకే ప్రతిసారి రేవంత్ రెడ్డి కి పదవి అనౌన్స్ చేసే సమయం దగ్గరకు వచ్చిన వెంటనే ఏదో ఒక కేసు లేదా ఏదో రకమైన వివాదం తెర మీదకు తీసుకొస్తున్నారు టిఆర్ఎస్ పెద్దలు.

రామారావు వేసిన కేసు కేవలం బదనాం చేయడం కోసమే తప్ప ఏమాత్రం సరుకు లేదని వందకు వంద శాతం చెప్పగలను.

 

*రచయిత : సందిళ్ళ శ్రీకాంత్ రెడ్డి, పాలమూరు జిల్లా. సెల్ నెం. 96407 17123

(ఈ వార్తా కథనంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతమైనవి.)