తెలుగు సిఎంలే ‘జాతీయ ఫ్రంటు’ అని ఎందుకు తిరుగుతున్నారు?

భారత  దేశంలో చాలా ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలున్నాయి. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఈ పార్టీ లన్నీ ఆయా రాష్ట్రాలలలో బలమయిన పార్టీలే.

ఈ పార్టీల నేతలందరికి, ఉదాహరణకు సమాజ్ వాది పార్టీ అధినేత ములాయాం సింగ్, బిఎస్ పి నాయకురాలు  మాయవతి ,  జనతాదళ్ యునైటెడ్ నితీష్ కుమార్, తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ, బిజూ జనతాదళ్ నవీన్ పట్నాయక్, డిఎంకె స్టాలిన్… ఇలా  చాలా పేర్లు చెప్పవచ్చు, వీళ్లందరికి ప్రధాని అయ్యే అర్హతలున్నాయి.

వీళ్ల పార్టీలన్నీ కూడా ఎపుడో ఒకపుడు జాతీయ స్థాయిలో ఒక పాత్ర పోషించినవే. అయితే, ఈ నాయకులెవరూ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకో, లేదా ప్రధానమంత్రి అయ్యేందుకో, లేదా కాంగ్రెస్, బిజెపి వ్యతిరేక ఫ్రంటులు కట్టేందుకో రాష్ట్రాలు పట్టుకు తిరగలేదు. నేషనల్ ఫ్రంటొకదాన్ని ఏర్పాటుచేసి దేశాన్ని నడిపించాలనే లక్ష్యంతో ప్రత్యేక విమానాలేసుకుని ముఖ్యమంత్రులందరిని కలసి  హడావిడి సృష్టించడం లేదు.

నాలుగుసార్లు వరుసగా ఒదిషా ముఖ్యమంత్రి అయిన నవీన్ పట్నాయక్, ఇక రాష్ట్రం చాలు, దేశాన్ని నడిపించాలని, ఒక ఫ్రంటు కట్టేందుకు ఎపుడూ ప్రయత్నం చేయలేదు. ఆయన జాతీయ రాజకీయాల గురించి మాట్లాడేదే తక్కువ. కేంద్రంలో ఎవరుంటే ఏముంది , నా రాష్ట్రం, నా ప్రజలంటూ చడీ చప్పుడు లేకుండా పనిచేయడం, గెలవడం తప్ప ఆయన మరొక సౌండ్ చేయడు.

మయావతి,మమతాబెనర్జీలో ప్రధాని కావాలనే కోరికతోె ఉన్నా, దాన్ని మేం ఢిల్లీలోనే చూసుకుంటాం అంటారుతప్ప ఫ్రంటు కడదాం రండి అంటూ  ప్రత్యేక విమానాలేసుకుని తిరగలేదు.

బీహార్ ముఖ్య మంత్రి నితిష్ కుమార్ కూడా ఇలా లేని పోని జాతీయ బాధ్యతలు భుజానేసుకుని దేశాటనకు వెళ్లలేదు. ఇక తమిళనాడు వాళ్లెపుడూ ఇలాంటి ప్రయత్నాలు చేయలేదు. కేంద్రంలో ఏ ఫ్రంటు వచ్చినా, వాళ్ల రాష్ట్రానికి సంబంధించి ఫ్రంటున ఉండేది వాళ్లే.

అయితే, జాతీయ రాజకీయాల్లో పాత్ర, ఏమో దేశ ప్రధాని కావచ్చే మో అంటూ ప్రత్యేక విమానాలేసుకుని రాష్ట్రాలన్ని తిరిగి హంగామా చేస్తున్నది తెలుగు ముఖ్యమంత్రులు కెసియార్, చంద్రబా బు నాయుడే.

ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నాయకత్వంలో బిజెపికి వ్యతిరేకంగా ఫ్రంటు కట్టేందుకు చాలా శ్రమ పడ్తున్నారు. ఆయన కూడా తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాలు పర్యటించారు. ఇతర రాష్ట్రాలు కూడా పర్యటించాలనుకుంటున్నారు.

ఇపుడు  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇపుడు ఇదే యాత్రలో ఉ‘న్నారు. ఈ విషయంలో  తెలుగు ముఖ్యమంత్రులు పోటీ పడుతున్నారు. తెలుగు ముఖ్యమంత్రులే ఎందుకు ఇంత చొరవ తీసుకుంటున్నారు. మిగతా ముఖ్యమంత్రులు ఇలా వెంపర్లాడటం లేదు, ఎందుకు? పలువురు రాజకీయ వ్యాఖ్యాతలను, పరిశోధకులను, సోషియాలజిస్టులను సంప్రదించాక, వాళ్లందించిన అభిప్రాయాలలో కీలకమయిన తొమ్మిందింటిని ఇక్కడ అందిస్తున్నాం.

# తెలుగు  రాజకీయ నాయకులకు ఆడంబరాలెక్కువ. పూజల దగ్గర నుంచి పెళ్లిళ్ల దాకా పొలిటికల్ ఇన్వెస్ట్ మెంటు అనే దోరణిలో చూస్తారు. వీళ్ల రాజకీయ పర్యటలన్నీ విలాసవంతమయిన, ఆడంబరమయన, అధికారయాత్రలుగా ఉంటాయి. ఇలా చేసి ప్రాముఖ్యం  ఉందని చెప్పుకుంటుంటారు.అందుకే ప్రతి దానికి ప్రత్యేక విమానాల్లో వెళ్లు అలవాటు చేసుకున్నారు.

#ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలా ప్రత్యేక విమానాల్లో వెళ్లేందుకు జనం లో చెడ్డపేరు వస్తుందని భయపడతారు. తెలుగుువాళ్లకు అది లేదు, ఇలాచేస్తే గుర్తింపు వస్తుందనే నమ్మకం.

#ఒకటి రెండు ఎన్నికలు గెలుస్తూనే  తెలుగు ముఖ్యమంత్రులు తమని మించిన మేధావులు ఇండియాలో లేరనుకుంటారు. ఒక దేశానికి నాయకత్వం వహించాల్సిన సమయం వచ్చిందని  తెగ ఫీలవుతారు. అందుకే జాతీయ రాజకీయాలు భజానేసుకుని రాష్ట్రాలు తిరుగుతుంటారు.

# తెలుగు ముఖ్యమంత్రులకు చాలా ఇగో సమస్య. ఎన్నికల్లో గెలవడమేకాదు, తమకు ఇంకా చాలా శక్తి యుక్తులున్నాయని ఓటర్లకు చూపించేందుకు  ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం తిరిగి హంగామా సృష్టిస్తుంటారు.

# వీళ్లదంతా ఎన్నారై లైఫ్ స్టయిల్. రాజకీయాలను కూడా ఇదే స్టయిల్లో నడపాలనుకుంటారు. దీనికి రాష్ట్ర రాజకీయాలు మాత్రమే చాలవు.  జాతీయ స్థాయిలోకి కూడా వెళ్లాలి. అందుకే ఇది ఎన్నారై స్టయిల్లోనే నడుస్తూ ఉంది.

#రెండు రాష్ట్రాలలో అవినీతి చాలా ఎక్కువ. జాతీయ పార్టీలంటే చాలా భయం, ఏదో ఒక పార్టీకి సాయం చేసి దగ్గరకు చేరి వాటినుంచి ముప్పు రాకుండ ఉండేందుకు  ఈ జాతీయ రాజకీయాటలు అడుతుంటారు.

#వీళ్లకి ఈడొచ్చిన రాజకీయ వారసులున్నారు. తాము రిటైరయి వాళ్లకి పట్టాభిషేకం చేయడం ఇష్టం లేదు. అందువల్ల కేంద్రంలో గౌరవ ప్రదమయిన హోదా సంపాదించేందుకు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలపాత్ర అంటూ బయలుదేరుతున్నారు. అక్కడేదయిన చాన్స్ కనిపించగానే వారసుల్ని సీట్లో కూర్చోబెడతారు.

# వీళ్లంతా సాధారణ కుటుంబాలనుంచి వచ్చారు.  తాము గొప్ప బ్యాక్ గ్రౌండ్ తో వచ్చామని ఇంప్రెషన్ ఇచ్చేందుకు బాగా ఆడంబరాలు అలవాటు చేసుకున్నారు. ఈ ఇగోని ఇంకా ముందుకు తీసుకుపోయేందుకు  జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకుంటున్నారు.

# ఇతర ముఖ్యమంత్రుల కంటే, ఇతర ప్రాంతీయ పార్టీ ల నేతల కంటే తాము జ్ఞానులమనే ప్రగాఢమయిన విశ్వాసం ఉంది. ఈ జ్ఞానంతో దేశరాజకీయాల నడిపించడం ఏమంత కష్టం కాదనే నమ్మకం ఇద్దరిలో ఉంది.