తెలంగాణ కానిస్టేబుల్ పార్ట్ 2 ప్రాసెస్ ఎప్పుడంటే

తెలంగాణలో నిర్వహించిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో 50.90 శాతం మంది అర్హత సాధించినట్టు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ వివి. శ్రీనివాసరావు తెలిపారు. 2,28, 865 మంది దేహదారుడ్య పరీక్షకు అర్హత సాధించారు. మొత్తం 200 మార్కులకు నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలో టాప్ మార్కులు 151, అత్యల్పంగా 12 మార్కులు వచ్చాయి.

మే 31న 16,925 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పరీక్షలకు 4,79,158 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 4,49,650 మంది హాజరయ్యారు.  ప్రిలిమ్స్ లో 2,28,265 మంది ఉత్తీర్ణులయ్యారు. అందులో 96,352 మంది బీసీలు,65,160 మంది ఎస్సీలు, 10,861 మంది ఓసీలు, 52,927 ఎస్టీలు,37,817 మహిళలు, 3565 మంది మాజీ సైనికోద్యోగులు ఎంపికయ్యారు. అర్హత సాధించిన అభ్యర్దులకు కొలతలు, దేహధారుడ్య పరీక్షల తేదిలను త్వరలోనే ప్రకటిస్తామని బోర్డు తెలిపింది.

పార్ట్ 2 దరఖాస్తు పత్రాన్ని అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లోనే సమర్పించాలన్నారు. ఉద్యోగ ప్రకటనలో పేర్కొన్న ధ్రువపత్రాలన్నీ స్కాన్ చేసి దరఖాస్తుతోపాటు అప్ లోడ్ చేయాలని తెలిపారు. ఆ తర్వాత పరీక్ష వివరాల లేఖలను కూడా వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. గత కానిస్టేబుల్ పరీక్షకు 39 శాతం మంది అర్హత సాధిస్తే ప్రస్తుతం 50.90 శాతం మంది అభ్యర్దులు అర్హత సాధించారు.

కానిస్టేబుల్ పరీక్ష చాలా కఠినంగా ఉందని సివిల్స్ తరహాలో నిర్వహించారని అభ్యర్దులు ఆందోళన వ్యక్తం చేశారు. పలు ప్రశ్నలు తప్పులుగా వచ్చాయని, మరికొన్ని సిలబస్ లో లేనివి వచ్చాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.  

అభ్యంతరం వ్యక్తం చేసిన తొమ్మిది ప్రశ్నలను తొలగించి వాటికి తొమ్మిది మార్కులు కలిపారు. అలాగే మరో 5 ప్రశ్నలు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు కరెక్టు కావడంతో వాటికి కూడా మార్కులు కలిపారు. 12 నుంచి 15 ప్రశ్నలకు అభ్యర్దులు అభ్యంతరం చెప్పారు. దాదాపు ఒక్కో అభ్యర్దికి 10 మార్కులు కలిపినట్టు తెలుస్తోంది.

కానిస్టేబుల్ పార్ట్ దరఖాస్తుల ప్రక్రియ త్వరలోనే ప్రారంభమైనా మిగిలిన ప్రక్రియ అంతా తెలంగాణలో ఎన్నికలు ముగిశాకనే జరగనుందని సీనియర్ పోలీసు అధికారి ద్వారా తెలుస్తోంది. ఎన్నికల వేళ బందోబస్తు ఉండటంతో సిబ్బంది అంతా ఎన్నికల విధుల్లో ఉండనున్నారు. మిగిలిన ప్రక్రియ డిసెంబర్ చివరి వారంలో ప్రారంభం కావచ్చని తెలుస్తోంది.