వాటర్ ఫైట్: తెలంగాణ వాదన వీగిపోయిందా.?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా నది నీటి వినియోగం విషయమై వివాదం తలెత్తిన విషయం విదితమే. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు యెదుట ఇరు పక్షాలూ ఈ రోజు తమ తమ వాదనల్ని వినిపించాయి. గత కొద్ది రోజులుగా నడుస్తున్న వివాదానికి ఈ సమావేశంతో కాస్త ఉపశమనం దొరుకుతుందని అంతా భావించారు. అయితే, ఆంధ్రప్రదేశ్ వాదనను కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ సమర్థించినట్లుగా ప్రచారం జరుగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ అలాగే పులిచింతల ప్రాజెక్టుల నుంచి నీటి వాడకం విషయమై తెలంగాణ అనుసరిస్తున్న వైఖరి సరిగా లేదన్నది ఏపీ వాదన. జల విద్యుత్ పేరుతో నీటిని తెలంగాణ వృధా చేస్తోంటే, ఆ నీరంతా సముద్రంలో కలిసిపోవడం తప్ప, ఎవరికీ ప్రయోజనం వుండదన్నది ఏపీ తెరపైకి తెస్తున్న అంశం.

అయితే, శ్రీశైలం ప్రాజెక్టు నుంచీ, నాగార్జున సాగర్ నుంచీ, పులిచింతల నుంచీ విద్యుత్ ఉత్పత్తి చేసే హక్కు తమకు వుంటుందని తెలంగాణ వాదిస్తోంది. అంతే కాదు, కృష్ణా జలాల్లో తెలంగాణ – ఏపీ వాటా చెరి సగం వుండాల్నది తెలంగాణ వాదన. అందుకు ఏపీ సమ్మతించడంలేదు. 80 – 20 లేదా 70 – 30 శాతం వాటాల అంశాన్ని ఏపీ ప్రస్తావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ వద్ద ఇరు పక్షాల సమావేశం ఒకింత గందరగోళంగా తయారైనట్లు తెలుస్తోంది. తమ వాదనలకు బోర్డు వద్ద మద్దతు లభించకపోవడంతో తెలంగాణ అధికారులు, బోర్డు సమావేశం నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయే సమయంలో.. ఇరు రాష్ట్రాలకూ నీటి కేటాయింపులు కేంద్రం చేయకపోవడమే ఈ సమస్యకు కారణం. గడచిన ఏడేళ్ళుగా మోడీ సర్కార్ సైతం ఈ సమస్యపై దృష్టిపెట్టకపోవడం గమనార్హం.