బిగ్ బ్రేకింగ్… రేవంత్ రెడ్డి అరెస్టు కేసులో ఎస్పీ పై వేటు

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారం సరికొత్త మలుపులు తిరుగుతున్నది. రేవంత్ రెడ్డిని మిడ్ నైట్ బెడ్రూమ్ తలుపులు పగలగొట్టి మరీ అరెస్టు చేయడాన్ని హైకోర్టు తప్పు పట్టడమే కాదు డిజిపి కి అక్షింతలు వేసింది. ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందని సీరియస్ అయింది. డిజిపి తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆర్డర్ వేసింది.

హైకోర్టు గరం గరం కావడంతో ఎన్ని కల సంఘం సిఇఓ రజత్ కుమార్ అప్పటి కప్పుడు స్పందించారు. తక్షణమే వికారాబాద్ జిల్లా ఎస్పీ అన్నపూర్ణపై బదిలీ వేటు వేశారు. డిజిపిని తమ ఎదుట హాజరు కావాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ అయిన తర్వాత క్షణాల్లోనే రజత్ కుమార్ నిర్ణయం వెలువడింది. ఎస్పీ అన్నపూర్ణను బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు. 

రేవంత్ రెడ్డి అరెస్టు సమయంలో రేవంత్ సతీమణి గీత పోలీసులను ప్రశ్నించారు.. ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. దానికి అరెస్టు చేసిన పోలీసు బృందం చెప్పిన సమాధానం ఏమంటే? సుపీరియర్ ఆర్డర్స్ ఉన్నాయి.. అందుకే అరెస్టు చేస్తున్నాం.. అని బదులిచ్చారు. మరి సుపీరియర్ ఆర్డర్స్ అంటే ఏంటో పక్కన పెడితే జిల్లా ఎస్పీ అన్నపూర్ణ మాత్రమే సుపీరియర్ అవుతారా? లేదంటే ఆమె కంటే పై స్తాయి అధికారులు కూడా సుపీరియర్స్ గా ఉంటారా అన్న చర్చ మొదలైంది.

వికారాబాద్ ఎస్పీ గా ఉన్న అన్నపూర్ణను డిజిపి ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు సిఇఓ రజత్ కుమార్. ఆమెకు ఎన్నికల విధులు అప్పగించవద్దని ఈసీ తన ఆదేశాల్లో పేర్కొంది. అవినాష్ మొహంతి వెంటనే విధుల్లో చేరాలని ఈసీ ఆదేశించింది. అవినాష్ మొహంతి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన రాత్రి వరకు వికారాబాద్ కు చేరుకుని విధుల్లో చేరే అవకాశం ఉంది. అవినాష్ బాధ్యతలు స్వీకరించే వరకు వికారాబాద్ ఏఎస్పీకి అదనపు బాధ్యతలు అప్పగించారు.  

వికారాబాద్ ఎస్పీగా అవినాశ్ మహంతి

రేవంత్ అరెస్టు పై హైకోర్టు సీరియస్ అయ్యింది.  ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా అర్ధరాత్రి వెళ్లి అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించింది. డీజీపీ మహేందర్ రెడ్డి తమ ముందు విచారణకు హాజరు కావాల్సిందేనని, అరెస్ట్ వ్యవహారంపై సమాధానం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. తాము కూడా కేసుల విచారణలో బిజీగా ఉన్నామని… కోర్టుకు రావడానికి డీజీపీ ఒక్క గంట సమయాన్ని కేటాయించలేరా? అని కోర్టు ప్రశ్నించింది. డీజీపీ కోర్టుకు వచ్చి నేరుగా సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ మధ్యాహ్నం 2.30 గంటలకు తదుపరి విచారణను వాయిదా వేసింది.  

అడుగడుగునా టెన్సన్…

కొడంగల్ లో ఆదివారం రాత్రి నుంచి హైడ్రామా నడుస్తోంది.  ఆదివారం రాత్రి రేవంత్ అనుచరుల ఇండ్లలో పోలీసులు సోదాలు జరిపారు. ఈ సోదాల విషయంలో రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రాత్రిపూట సోదాలు చేసి భయపెడతారా అని నిలదీశారు. రాత్రిపూటే రోడ్డుపై బైటాయించి ధర్నా చేపట్టారు. అదే సమయంలో మంగళవారం కేసిఆర్ సభ నాడే కొడంగల్ బంద్ కు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.

దీంతో పోలీసులు మంగళవారం మిడ్ నైట్ ఇంట్లోకి చొరబడి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కేసీఆర్ సభను అడ్డుకునే కుట్రలో భాగంగా రేవంత్ కొడంగల్ బంద్ కు పిలుపునిచ్చారని నియోజకవర్గ నేతలు ఈసికి ఫిర్యాదు చేశారు. ఈసీ ఆదేశాలతో పోలీసులు రేవంత్ పై కేసు నమోదు చేశారు. కేసీఆర్ సభకు అనుమతులున్నాయని సభను అడ్డుకోవద్దని పోలీసులు రేవంత్ ను కోరారు.  

మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రేవంత్ రెడ్డి ఇంట్లోకి పోలీసులు బలవంతంగా ప్రవేశించారు. ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి చేరుకున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అరెస్టు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల సంఘం అరెస్టు చేయమని చెప్పిందా అని రేవంత్ పోలీసులను నిలదీశారు. ఎన్నికల సంఘం ఏం చెప్పలేదని సభను అడ్డుకోవద్దని ఆదేశించిందన్నారు. 

 రేవంత్ అరెస్టు పై కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. రేవంత్ అరెస్టును నేతలంతా ఖండించారు. ఈసీ ఆదేశాలతో రేవంత్ ను పోలీసులు భారీ భద్రత మధ్య కొడంగల్ కు తరలించారు. దీంతో   రేవంత్ అరెస్టు ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అని హైకోర్టు పోలీసుల పై మండిపడింది. తెలంగాణ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేయడానికి అంతలా వ్యవహారించాల్సిన అవసరమేముంది అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎట్టకేలకు రేవంత్ విడుదలతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ సీన్ హైకోర్టుకు మారింది. 

కోర్టు సీరియస్ కావడతో జిల్లా ఎస్పీ మీద బదిలీ వేటు పడింది. నిజంగా జిల్లా ఎస్పీ సొంతంగానే రేవంత్ రెడ్డిని మిడ్ నైట్ బెడ్రూమ్ తలుపులు పగలగొట్టి అరెస్టు చేయాలని నిర్ణయం తీసుకున్నారా? లేదంటే ఆమె కంటే ఇంకా పై అధికారులెవరైనా ఇలాంటి ఆదేశాలు ఇచ్చారా అన్న విషయం తేలాల్సిన అవసరం ఉంది. సుపీరియర్స్ ఆదేశాలు అనే విషయంలో రేవంత్ ను బెడ్రూమ్ నుంచి గొర్ర గొర్ర గుంజుకురావాలన్న ఆదేశాలు ఇచ్చిన సుపీరియర్స్ ఎవరో అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరి కోర్టులో ఈ కేసుకు ఎలాంటి ముగింపు దొరుకుతుందో చూడాలి.