ఆ పార్టీతో కాంగ్రెస్‌కు పొత్తు వద్దు: విజయశాంతి

విజయశాంతి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినీ హీరోయిన్ గా, రాజకీయ నేతగా ప్రజలందరికి విజయశాంతి సుపరిచితం. 2000 సంవత్సరం నుంచి సినీ రంగం వీడి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. బిజెపి లో ఉన్న విజయశాంతి  బయటకు వచ్చి తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. తెలంగాణ ఉద్యమం ఉదృత్తం అవ్వడంతో తల్లితెలంగాణ పార్టీని కేసీఆర్ ఆహ్వానం మేరకు టిఆర్ ఎస్ లో విలీనం చేశారు. ఆ తర్వాత టిఆర్ ఎస్ మెదక్ ఎంపీగా పనిచేశారు.

తదనంతర కాలంలో కేసీఆర్ కు, విజయశాంతికి పొసగక ఆమె టిఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటి చేసి ఓడిపోయారు. అయితే కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న విజయశాంతి ఈ మధ్య రాహుల్ గాంధీతో బేటి అయ్యి మళ్లీ తెరమీదకి వచ్చారు. అయితే కాంగ్రెస్, టిడిపి పొత్తు పెట్టుకుంటాయి అని వస్తున్న వార్తలపై విజయశాంతి స్పందించారని తెలుస్తోంది.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పొత్తు ప్రతిపాదనను విజయశాంతి వ్యతిరేకిస్తున్నారు. టిడిపితో పొత్తు పెట్టుకుంటే భారీ నష్టం తప్పదని ఆమె భావిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి లేఖ రాసే యోచనలో విజయశాంతి ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం చాలా సమస్యలు పరిష్కారం కాకపోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని విజయశాంతి గతంలోఆరోపించారు. ఈ పరిస్థితుల్లో టిడిపితో పొత్తు పెట్టుకుంటే నష్టపోతామని విజయశాంతి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది.

ప్రస్తుతం చావో రేవో అన్నట్టుగా ఉన్న ఈ పరిస్థితిలో కొందరు పార్టీ నేతలు కాంగ్రెస్ అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విజయశాంతి వాపోయారని తెలుస్తోంది. టిడిపితో పొత్తు వల్ల కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో తీవ్ర నష్టం తప్పదని విజయశాంతి అన్నారని సమాచారం. హైదరాబాద్ లో కొన్నిసీట్లు గెలుస్తామన్న భావనలో ఉన్న కొందరు కాంగ్రెస్ నేతలు టిడిపితో పొత్తు కోసం ఆరాటపడుతున్నారని ఆమె భావిస్తున్నారు. మరీ రాములమ్మ అభ్యర్థన రాహుల్ పై ఎంత మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. ఇప్పటికే ఆంధ్రాలో టిడిపితో  కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందని వస్తున్న వార్తల నేపథ్యంలో విజయశాంతి చేసిన వ్యాఖ్యలతో అంతా చర్చనీయాంశమైంది.