కేసిఆర్ ప్రశ్నకు సింపుల్ గా జవాబు చెప్పిన ఉత్తమ్

తెలంగాణ సిఎం కేసిఆర్ ప్రశ్నలకు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా సింపుల్ గా జవాబు చెప్పారు. ఆదివారం సిఎం కేసిఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ మాయమాటలతో మోసం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. రైతులకు 2లక్షల రుణమాఫీ అనేది సాధ్యమయ్యే ప్రసక్తే లేదని కేసిఆర్ తేల్చి చెప్పారు. నిరుద్యోగ భృతి ఎంత మందికి ఇస్తారు? అని ప్రశ్నించారు. అసలు ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారో లెక్కలు తెలుసా మీకు అంటూ ఎద్దేవా చేశారు.

సిఎం కేసిఆర్ వేసిన ప్రశ్నలకు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన భారీ బహిరంగ సభలో కట్టె కొట్టె తెచ్చె అన్నట్లుగా జవాబు ఇచ్చారు. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ వద్ద ఉద్యోగం కోసం తెలంగాణ వ్యాప్తంగా 15 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని ఉత్తమ్ చెప్పారు. వారందినీ నిరుద్యోగులుగానే తాము గుర్తిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అందులో కనీసం 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు ఒక్కో నిరుద్యోగికి మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని మాయమాటలు చెప్పిన టిఆర్ఎస్ పార్టీ ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ.. కేసిఆర్ ఇంట్లో నాలుగు ఉద్యోగాలు సంపాదించుకున్నారని ఆరోపించారు. తెలంగాణ యువత ఉద్యోగాలు రాక తీవ్ర మనోవేధనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.