ఇద్దరు టిఆర్ఎస్ ఎంపీల రాజీనామా

ఇద్దరు టిఆర్ఎస్ ఎంపీలు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. శుక్రవారం లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కలిసి తమ రాజీనామా లేఖలు అందజేశారు. స్పీకర్ ఫార్మాట్ లో ఎంపీలు రాజీనామాలు చేశారు. ఆ ఇద్దరు ఎంపీల రాజీనామా లేఖలు తీసుకున్న స్పీకర్ వారి రాజీనామాలు ఆమోదించాల్సి ఉంది.

మల్కాజ్ గిరి ఎంపీగా పని చేస్తున్న చామకూర మల్లారెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. మేడ్చల్ నుంచి టిఆర్ఎస్ అభ్యర్దిగా బరిలోకి దిగారు. సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ కు చెందిన కిచ్చెనగారి లక్ష్మారెడ్డి పై 87,990 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. తెలంగాణ మంత్రిగా మల్లారెడ్డికి చోటు దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది.

ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఎంపీ పదవికి మల్లారెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శుక్రవారం స్పీకర్ లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు అందజేశారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా ప్రాసెస్ ను పూర్తి చేసి అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన మల్లారెడ్డికి స్పీకర్ సుమిత్రా మహాజన్ శుభాకాంక్షలు తెలిపారు.

టిఆర్ఎస్ నుంచి ఎంపీగా ఎన్నికైన కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేవేళ్ల నుంచి ఎంపీగా ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీలో వచ్చిన విబేధాల కారణంగా ఆయన టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కానీ తన ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు.

శుక్రవారం స్పీకర్ చాంబర్ లో స్పీకర్ ను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. ఈ సందర్బంగా రాజీనామాకు గల కారణాలకు స్పీకర్ కొండా విశ్వేశ్వర రెడ్డిని అడిగారు. పార్టీలో వచ్చిన విబేదాల వల్లనే రాజీనామా చేస్తున్నానని స్పీకర్ కు కొండా తెలిపారు. టిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరానని స్పీకర్ తో ఆయన చెప్పారు. ఒక పార్టీ గుర్తు పై గెలిచి మరో పార్టీలో కొనసాగుతూ పదవిలో ఉండటం సముచితం కాదని ఆయన అన్నారు. మంచి నాయకునిగా ఎదగాలని స్పీకర్ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో ఆప్యాయంగా అన్నారు. 

ఇద్దరు ఎంపీల రాజీనామాలతో రెండు ఎంపీ స్థానాలు ఖాళీ అయ్యాయి. మరో 4 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో వీటికి కూడా అప్పుడే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

పెద్ద పలి ఎంపీ బాల్క సుమన్ కూడా ఎంపీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. బాల్క సుమన్ కూడా చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో త్వరలోనే బాల్క సుమన్ కూడా ఎంపీ పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.