టిఆర్ఎస్ ను కలవరపెడుతున్న ఆ 150 మంది ఆంధ్రోళ్లు

అవును మీరు చదివింది నిజమే. నాన్నా… సింహం సింగిల్ గానే వస్తది… అని డైలాగ్ కొట్టుకుంట మరీ ముందస్తు ఎన్నికలకు దిగింది టిఆర్ఎస్. ఏ పార్టీతో పొత్తు లేకుండానే గత 2014 ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా ఒంటరిపోరుకు దిగింది. ఒంటరిపోరా అని సీరియస్ గా అడిగితే ఒంటరి పోరు కాకపోయినా మజ్లిస్ పార్టీతో స్నేహం ఉందని చెప్పుతున్నది. అయినప్పటికీ మజ్లిస్ పోటీ చేసిన సీట్లల్లో బలహీనమైన క్యాండెట్స్ ను దింపింది. కానీ పోటీ మాత్రం 119 సీట్లకు చేసింది టిఆర్ఎస్.

ఇక ఎన్నికల సభల్లో నాయకుడు ఎవరో తెలియని కూటమి పార్టీల సీల్డ్ కవర్ సిఎం కావాల్నా? లేదంటే సింహం లాంటి కేసిఆర్ కావాల్నా అని ఇటు కొడుకు కేటిఆర్, అటు బిడ్డ కవిత ప్రచారం చేశారు. ఇంత ఘనమైన పలుకుబడి ఉన్నప్పటికీ ఒక విషయంలో టిఆర్ఎస్ మొదటి నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నది. ఆ ముచ్చట గురించి పదే పదే ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నది. ఏంటా విషయం? ఎవరా 150 మంది చదవండి.

తెలంగాణలో ఎన్నికల సమరం షురూ కాగానే ఆంద్రప్రదేశ్ కు చెందిన 150 మంది ఇంటెలిజెన్స్ అధికారులు తెలంగాణలో మకాం వేశారు. వారు అప్పటి నుంచి నియోజకవర్గానికి ఒకరు చొప్పున తెలంగాణలో గ్రౌండ్ రియాలిటీని బేరీజు వేసి అమరావతికి సమాచారాన్ని చేరవేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక కానిస్టేబుల్ చొప్పన 119 మంది కానిస్టేబుళ్లు, జిల్లాకు ఒకరు చొప్పున ఇంటెలిజెన్స్ సబ్ ఇన్స్పెక్టర్ చొప్పున 31 మంది ఎస్సైలు విధుల్లో ఉన్నారు.

ఏ నియోజకవర్గంలో ఏ రకమైన ట్రెండ్ ఉంది? ఏ పార్టీ ప్రచారంలో ఎలా ఉంది? జనాల మూడ్ ఎలాం ఉంది? కేటగిరీల వారీగా ప్రజల్లో రకమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి లాంటి అన్ని ఎన్నికల అంశాలకు సంబంధించిన సమాచారాన్నంతా ఈ అధికారులు క్రోడీకరించి ఎపి సిఎం చంద్రబాబుకు అందజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డిజి వెంకటేశ్వరరావు అయితే హైదరాబాద్ లోనే మకాం వేసి తెలంగాణ ఎలక్షన్స్ ట్రెండ్స్ ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రభుత్వానికి నివేదిస్తున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎపిలో టిడిపి అధికారంలో ఉన్నందున అక్కడ ిఇంటెలిజెన్స్ పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కూటమి నేతలు తమ ప్రచార వ్యూహానికి పదును పెడుతున్నారు. నియోజకవర్గాల వారీగా పరిస్థితులను బట్టి ఎక్కడ ఏరకంగా మసులుకోవాలో కూటమి నేతలు ప్లాన్ చేసుకున్నారు. ఎపి ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగానే చంద్రబాబు కూటమి నేతలకు దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. అందుకే ప్రచార సమయంలో భాగంగా రెండు రోజులు వరుసగా పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చంద్రబాబు ఇంటికి వెళ్లి మరీ ఆయనతో సమావేశమై పరిస్థితులపై చర్చించారు. 

ఈ వ్యవహారం టిఆర్ఎస్ పార్టీకి మింగుడపడడంలేదు. ఎపి ఇంటెలిజెన్స్ పోలీసులు తెలంగాణలో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని తాజాగా ఎన్నికల సంఘానికి టిఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇప్పుడే కాదు గతంలోనూ కరీంనగర్ లో ఎపి ఇంటెలిజెన్స్ పోలీసులు తిరగడాన్ని టిఆర్ఎస్ వ్యతిరేకించింది. ఎన్నికల సీజన్ ఆరంభంలోనే కరీంనగర్ లో ఈ వ్యవహారం వివాదం రేపింది. అయితే ఇంటెలిజెన్స్ పోలీసులు ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉండడంతో టిఆర్ఎస్ పార్టీ వారిని ఏమీ చేయలేక పోతుందన్న వాదన ఉంది. వారిని వెనక్కు పంపలేక, ఇక్కడి సమాచారాన్ని చేరవేకుండా అడ్డుకోలేక టిఆర్ఎస్ పార్టీ సతమతమవుతోందని చెబుతున్నారు.