మున్నూరు కాపులకు టిఆర్ఎస్ కవిత గుడ్ న్యూస్

మున్నూరు కాపు కార్పోరేష‌న్ ఏర్పాటు కోసం త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత తెలిపారు. సోమ‌వారం నిజామాబాద్‌లో న‌గ‌ర మున్నూరు కాపు సంఘాల ఆత్మీయ స‌మ్మేళ‌నం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డితో క‌లిసి ఎంపి క‌విత ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.
ఈ సంద‌ర్భంగా మున్నూరు కాపుల స‌మ‌గ్రాభివృద్ధికి ప్ర‌త్యేక కార్పోరేష‌న్ ఏర్పాటు చేయాల‌ని సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు కొండ దేవన్న కోరారు. అనంత‌రం ఎంపి క‌విత మాట్లాడుతూ సంఘం నేత‌లు కోరుతున్న విష‌యాన్ని సిఎం కెసిఆర్ గారి దృష్టికి తీసుకెళ‌తాన‌ని, కొండ దేవ‌న్నను త‌న వెంట తీసుకువెల్లి కార్పోరేష‌న్ సాధ‌న‌కు ప్ర‌య‌త్నిస్తాన‌న్నారు.

అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌జాప్ర‌తినిధులు ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో..అదే వారి నిజ‌మైన వైఖ‌రి అన్నారు. టిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపిలు త‌మ‌ను ఎన్నుకున్న ప్ర‌జ‌ల బాగు కోసం ప‌నిచేస్తున్న‌ విష‌యం మీకు తెలిసిందేన‌న్నారు. నాలుగేళ్లుగా తెలంగాణ‌, నిజామాబాద్ స‌మ‌గ్రాభివృద్ధికి చేస్తున్నకృషిని చూస్తున్నారు…మ‌ళ్లీ ఆశీర్వ‌దించండి..సేవ చేసే అవ‌కాశాన్నివ్వండి..అని కోరారు. మున్నూరు కాపుల్లోనూ రైతులున్నారు..వారికి ప్ర‌భుత్వం రైతు బంధు, భీమా ప‌థ‌కాల‌ను వ‌ర్తింప‌చేసింది. అన్నారు.

నిజామాబాద్ న‌గ‌ర అభివృద్ధికి రూ. 900 కోట్ల‌ను ప్ర‌భుత్వం మంజూరు చేసింది. మున్సిప‌ల్ కార్పోరేష‌న్‌కు అంత పెద్ద మొత్తం నిధుల‌ను దేశంలో ఏ రాష్ట్రంలో నిధులు మంజూరు కాలేదు..ముఖ్య‌మంత్రికి నిజామాబాద్ న‌గ‌ర అభివృద్ధిపై ఎంత ప్రేమ ఉందో ఈ విష‌యం తెలియ‌జేస్తుంద‌ని వివ‌రించారు. 350 కొత్త రోడ్లు వేశామ‌ని, వీటిలో 200 కు పైగా రోడ్ల ప‌నులు పూర్త‌యిన‌ట్లు ఎంపి క‌విత చెప్పారు. అండ‌ర్ డ్ర‌యినేజి, బ్యూటిఫికేష‌న్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయ‌ని, తాజా మాజీ ఎమ్మెల్యే బిగాల గ‌ణేశ్ గుప్తా మేయ‌ర్‌, కార్పోరేట‌ర్ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ప‌నుల‌ను వేగంగా పూర్తిచేయిస్తున్నార‌ని క‌విత తెలిపారు.

స‌మావేశంలో ఎమ్మెల్యే బిగాల గ‌ణేశ్ గుప్తా, ఎమ్మెల్సీ వి.జి గౌడ్‌, మేయ‌ర్ ఆకుల సుజాత‌, బాజిరెడ్డి జ‌గ‌న్‌, ఓలంపిక్ అసోసియేష‌న్ జిల్లా అధ్య‌క్షులు గ‌డీల రాములు, దినేశ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.