కాంగ్రెస్ జానారెడ్డి, షబ్బీర్ అలీకి టిఆర్ఎస్ సర్కార్ బిగ్ షాక్

కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ కి టిఆర్ఎస్ సర్కారు బిగ్ షాక్ ఇచ్చింది. గత అసెంబ్లీ టర్మ్ లో జానారెడ్డి శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే షబ్బీర్ అలీ మొన్నటి వరకు కూడా తెలంగాణ శాసనమండలికి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే జానారెడ్డి ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ఆపరేషన్ ఆకర్ష్ వలలో చిక్కి టిఆర్ఎస్ గూటికి చేరడంతో షబ్బీర్ అలీ కి ఉన్న ప్రతిపక్ష హోదా రద్దు చేయబడింది. అలాగే కామారెడ్డిలో షబ్బీర్ అలీ కూడా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 

ఈ సమయంలో వారిద్దరికీ తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో ఏముందంటే.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వారిద్దరూ తమకు ఉన్న ప్రొటోకాల్ ప్రకారం బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్ వాడుకున్నారు. ప్రభుత్వమే వారికి ప్రొవైడ్ చేసింది. అయితే ఇప్పుడు వారిద్దరూ ఓడిపోయి తమ పదవులు కోల్పోయారు. కాబట్టి వారు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వాడుకున్నందుకు 9లక్షల 860 చెల్లించాలని నోటీసు తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు.

జానారెడ్డి 87రోజులు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ వాడినందుకు కిలోమీటర్ కు 37 రూపాయల చొప్పున, డ్రైవర్ బత్తా రోజు కు 100 రూపాయల చొప్పున 4,20,094 రూపాయలు చెల్లించాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. 

అలాగే షబ్బీర్ అలీ 90 రోజులు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ వాడినందుకు కిలోమీటర్ కు 37 రూపాయల చొప్పున, డ్రైవర్ బత్తా రోజు కు 100 రూపాయల చొప్పున మొత్తం 4,79,936 రూపాయలు చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.

ఈ నోటీసులు కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. 

వారిద్దరికీ తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ పంపినీ చేసిన నోటీసు కింద ఉంది చూడండి.