ఈటల ఇలాకాలో టిఆర్ఎస్ కు షాక్

మంత్రి ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గంలో కీలక నేతలు పార్టీకి రాజీనామా సమర్పించారు. దీంతో ఈటలకు ఇది పరాభవంకానే చెప్పవచ్చని నేతలంటున్నారు. హూజురాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు నలుగురు సభ్యులు టిఆర్ ఎస్ కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

హుజురాబాద్ మున్పిపల్ కౌన్సిలర్లు చింత శ్రీనివాస్, చెట్టి శ్రీనివాస్, భీమగోని సురేష్, పోరెడ్డి రజిత టిఆర్ ఎస్ కు రాజీనామా చేశారు.2001 నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నా కూడా తమకు సరైన గుర్తింపు దక్కలేదన్నారు. అనేక అవమానాలు ఎదుర్కొన్నామని తమను కాదని ఇతరులకు అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో ఇక ఇందులో ఇమడలేక బయటికి వస్తున్నట్టు వారు ప్రకటించారు.

గతంలో అనేక సార్లు ఈటలకు చెప్పినా కూడా కనీసం చర్చలు జరపలేదన్నారు. వీటన్నింటి నేపథ్యంలోనే మున్సిపల్ పదవులతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వీరితో పాటు టిఆర్ ఎస్ నాయకులు పంజాల కళాధర్, చాడ గంగాధర్, పోరెడ్డి శంతన్ రెడ్డి రాజీనామా చేశారు.

ఎన్నికల వేళ కీలక నేతలు పార్టీని వీడడంతో టిఆర్ ఎస్ కు ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. అనేక ప్రాంతాలలో నేతలంతా అసంతృప్తితో పార్టీని వీడుతుండటంతో క్యాడర్ లో కలవరం మొదలైంది. ఎన్నికల వేళ నాయకులకు అండగా ఉండాల్సిన వారు పార్టీని వీడటం నేతల్లో గుబులు రేకెత్తిస్తుంది. నేతలు పట్టించుకోకపోవడంతో కార్యకర్తలు అదును చూసి పార్టీని వీడుతున్నారు. ఏదేమైనా ముఖ్య కార్యకర్తల రాజీనామాలతో నేతల్లో టెన్షన్ మొదలైంది.