బ్రేకింగ్ : కాంగ్రెస్ లో క్యామ మల్లేష్ పై వేటు

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న క్యామ మల్లేష్ ను డిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తూ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున క్యామ మల్లేష్ ను పదవి నుంచి తప్పించినట్లు ఉత్తమ్ వెల్లడించారు. 

అంతేకాకుండా పార్టీపై తీవ్రమైన ఆరోపణలు గుప్పించిన క్యా మ మల్లేష్ కు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు ఉత్తమ్. . రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా క్యామ మల్లేష్ ను పదవి నుంచి తొలగించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్..

పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినందుకు డిసిసి అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూనే.. ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది టీపీసీసీ. మంగళవారం రాత్రి లోగా వివరణ ఇవ్వకపోతే రేపు క్యామ మల్లేష్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉంది. 

రంగారెడ్డి డిసిసి అధ్యక్ష పదవి కోల్పోయిన క్యామ మల్లేష్

క్యామ మల్లేష్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. పార్టీ నేతలు ముడుపులు తీసుకుని టికెట్లు అమ్ముకుంటున్నారంటూ విమర్శలు గుప్పించారు. దానం నాగేందర్ వద్ద 10 కోట్లు తీసుకుని ఖైరతాబాద్ టికెట్ ను డాక్టర్ దాసోజు శ్రవణ్ కు కట్టబెట్టారని క్యామ మల్లేష్ ఆరోపించారు.

స్ర్ర్కీనింగ్ కమిటీ సభ్యుడు భక్తచరణ్ దాస్ మీద సైతం విమర్శలు గుప్పించారు. సీటు కావాలంటే మూడు కోట్లు అడిగినట్లు ఆరోపణలు చేశారు. ఆయన మనుషులు డబ్బు డిమాండ్ చేసినట్లు సూచించే ఆడియో టేపులు రిలీజ్ చేసి సంచలనం రేపారు. కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీగా మారిపోయిందని ఆరోపించారు. బిసిలకు టికెట్లు ఇవ్వకుండా అగ్రవర్ణాలకే కట్టబెట్టారని ఆరోపించారు. యాదవులకు ఒక్క సీటు ఇవ్వడం వారిని తీవ్రంగా అవమానించడమే అని మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో క్యామ మల్లేష్ పదవి నుంచి తొలగించడంతోపాటు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది పిసిసి. అయితే ఆయన రాత్రి వరకు వివరణ ఇవ్వకపోతే రేపు ఉదయం ఆయనను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయవచ్చని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.