తెలంగాణలో ఈ నకిరేకల్ రైతు మరో బోర్ల రామిరెడ్డి

బోర్ల రామిరెడ్డి అనే మాట తెలుగు ప్రజలకు సుపరిచితమే. తెలంగాణ ప్రజలకు ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే అప్పటి ఉద్యమ నేత కేసిఆర్ అనేక సందర్భాల్లో బోర్ల రామిరెడ్డి గురించి వివరించేవారు. బోర్ల రామిరెడ్డి పేరు తెలంగాణ ఉద్యమ కాలంలో మారుమోగిపోయింది. బోర్ల రామిరెడ్డిది నల్లగొండ జిల్లాలోని ముషంపల్లి గ్రామం. ఆయన స్వయంగా రైతు. మషంపల్లిలో కరువు కారణంగా ఎండిపోతున్న తన బతాయి తోటను రక్షించుకునేందుకు బోర్ల రామిరెడ్డి ఏకంగా 67 బోర్లు వేయించాడు. తన పొలం నిండా బోర్లు వేసిన గుర్తులే కనిపించేవి. బోర్ల రామిరెడ్డి అసలు పేరు బైరు రామిరెడ్డి అయితే.. బోర్లు వేసి బోర్లు వేసి ఆయన పేరు బోర్ల రామిరెడ్డిగా మారిపోయిందని ఉద్యమ కాలంలో కేసిఆర్ పదే పదే ప్రస్తావించేవారు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్ సిఎం హోదాలో బోర్ల రామిరెడ్డిని తన ఇంటికి పిలిపించుకుని ఆయనతో కలిసి భోజనం చేశారు. రైతాంగం సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ బోర్ల రామిరెడ్డి విషయం ఇలా ఉంటే ఇదే నల్లగొండ జిల్లాలో బోర్ల రామిరెడ్డి లాంటి వాళ్లు లెక్కలేనంతమంది ఉన్నారు. ఊరికో బోర్ల రామిరెడ్డి ఉంటారంటే ఆశ్చర్యం కలగకమానదు. నల్లగొండ జిల్లాలోని కేతేపల్లి మండలం, కొండకిందిగూడెం గ్రామంలో రైతు కోట్ల ఆదినారాయణ లైఫ్ స్టయిల్ కూడా బోర్ల రామిరెడ్డి లాంటిదే. ఆది నారాయణ 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వేసిన బోర్ల సంఖ్య 34. ఆదినారాయణ మధ్యతరగతి రైతు. ఆయనకు 3 ఎకరాల నిమ్మతోట, మరో 2 ఎకరాల చెల్క ఉంది. బోర్ల ఆధారంగానే నిమ్మతోట పంట చేతికందుతుంది. వేసవి మొదలైందంటే ఆదినారాయణ నిమ్మతోటకు నీళ్లు సరిపోకపోయేవి. దీంతో బోరు బండి పిలిపించుడు.. బోరు వేయించుడే పనిగా పెట్టుకున్నారు. ప్రతి ఏటా ఎండకాలంలో ఆయన బోరు వేయించకుండా ఉన్న పరిస్థితి లేదు.

ఏడాదిలో వానాకాలంలో మూడెకరాల నిమ్మతోటకు బోర్ల నుంచి నీళ్లు అందుతుండగా మిగిలిన రెండు ఎకరాల్లో పొలం పెట్టేవాడు. కానీ యాసంగి మాత్రం బోర్ల నీళ్లు నిమ్మతోటకే సరిపోకపోయేవి. దీంతో నిమ్మతోట ఎండిపోకుండా ఉండేందుకు బోర్లు వేస్తూ ఉండేవారు. ఈఏడాది అంటే 2018 మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఆదినారాయణ ఏకంగా 7 బోర్లు వేయించాడు. అయినా అవి సక్సెస్ కాకపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి నిమ్మతోటను రక్షించారు.

ఎండకాలం వస్తే బోర్లేపించుడే మా పని : సైదులు

ఆదినారాయణ సతీమణి పిండిగిర్నీ నడుపుతారు. కొన్నిసార్లయితే వ్యవసాయం మీద వచ్చిన సొమ్ములే కాకుండా పిండిగిర్ని మీద వచ్చిన ఆదాయాన్ని కూడా బొర్లకే వెచ్చించిన దాఖలాలున్నాయని ఆదినారాయణ కొడుకు కోట్ల సైదులు ప్రజారాజ్యంతో చెప్పారు. నిమ్మతోట ఎండిపోకుండా ఉండేందుకు ‘‘ఎండకాలం వచ్చిందంటే బోర్లు ఏపించుడే మా పని.. ఈ బోర్లతోటి నీళ్లొచ్చింది లేదు ఏం లేదు కానీ.. అప్పులు మాత్రం బాగా అయినయ్’’ అని ఆయన పేర్కొన్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో నిమ్మ రైతులు కుదేలవుతున్నారు. నిమ్మ కాయకు ధరలేకపోవడంతో పాత నిమ్మతోటలన్నీ పీకి పడేస్తున్నారు రైతులు. అయితే ఎప్పటికైనా గిట్టుబాటు కాకపోతుందా అని కొందరు తోటలను ఇంకా రక్షిస్తూనే ఉన్నారు. ఇక తెలంగాణ సిఎం కేసిఆర్ ప్రవేశపెట్టిన 24 గంటల కరెంటు ఇప్పుడు నల్లగొండ జిల్లాలో రైతులను భయాందోళనలకు గురిచేస్తోంది. భూగర్భజలాలు మరింత లోతుల్లోకి పడిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా మోటార్లు కాలిపోవుడు ఎక్కువైందని చెబతున్నారు. త్వరితగతిన ఎస్ఎల్ బిసి పనులు పూర్తి చేసి నీళ్లిస్తేనే నల్లగొండలో బోర్ల రామిరెడ్డి, కోట్ల ఆదినారాయణ లాంటి రైతుల బాధలకు ముగింపు పలకలేమని అంటున్నారు.

ఆదినారాయణ చెల్కలో బోర్ల ఫొటోలు కింద ఉన్నాయి చూడండి.