టిఆర్ఎస్ వేముల వీరేశం తీరు పై నేరడలో నిరసన, టెన్షన్ టెన్షన్ (వీడియో)

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం నేరడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేరడ గ్రామానికి నకిరేకల్ టిఆర్ఎస్ అభ్యర్ధి వేముల వీరేశం  గురువారం నేరడకు ప్రచారానికి వస్తున్నారని తెలుసుకొని అతనిని అడ్డుకోవాలని గ్రామస్థులంతా తీర్మానించారు. నేరడ గ్రామంలో రాజకీయ దిగ్గజాలుగా దుబ్బాక నర్సిరెడ్డి, అతని సోదరుడు సతీష్ రెడ్డికి పేరుంది. దుబ్బాక సతీష్ రెడ్డి సంవత్సరం కింద రోడ్డు ప్రమాదంలో మరణించారు. వీరు ముందుగా కాంగ్రెస్ ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీలో కీలక నేతలుగా ఎదిగారు.

వేముల వీరేశానికి 2014 ఎన్నికల సమయంలో దుబ్బాక సతీష్ రెడ్డి సహాకరించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వీరేశానికి 30 లక్షల రూపాయల సహాయం చేశాడని, ఇల్లు కూడా కట్టించాడని వారు తెలిపారు. దుబ్బాక సతీష్ రెడ్డికి చెల్లించాల్సిన పైసలు ఇప్పటి వరకు వీరేశం చెల్లించలేదు. అతను మరణించిన తర్వాత అనేక సార్లు వెళ్లి అడిగినా కూడా ఇవ్వకపోగా తన రౌడీయిజంతో బెదిరింపులకు పాల్పడ్డాడని వారు తెలిపారు.

దుబ్బాక బ్రదర్స్ నేరడ ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలిచారని అటువంటి కుటుంబానికి వేముల వీరేశం ద్రోహం చేశారన్నారు. పైసలు లేక ఇబ్బంది పడుతుంటే సహాయం చేసిన సతీష్ రెడ్డికి అన్యాయం ఎలా చేయాలనిపించింది. వీరేశం అంటూ వారు ప్రశ్నించారు. తెలుగు రాజ్యంతో దుబ్బాక సతీష్ రెడ్డి అనుచరుడు మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే…

వేముల వీరేశానికి నకిరేకల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దుబ్బాక సతీష్ రెడ్డి సహాయం చేసిన విషయం వాస్తవం. వీరేశానికి సహాయం  చేశాడా లేదా అనేది వీరేశం గుండెల మీద చేయి వేసుకొని చెప్పాలి. సతీష్ రెడ్డి బతికి ఉన్నప్పుడు అడిగితే రేపిస్తా మాపిస్తా అంటూ దాటవేశాడు. అతను చనిపోయిన తర్వాత వెళితే పైసలు ఎవ్వరు ఇవ్వలేదని వీరేశం బెదిరింపులకు గురి చేశాడు. వీరేశం లంగ రాజకీయాలకు భయపడేది లేదు. అతని చరిత్ర అంతా ప్రజలకు తెలుసు. దుబ్బాక సతీష్ రెడ్డి పైసలు   వీరేశం ఎట్ల తీసుకున్నడో అట్ల ఇవ్వాలి. లేకపోతే వీరశం పై చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం. వీరేశానికి పైసలు ఇచ్చినట్టు ఆధారాలు,  సాక్ష్యాలున్నాయి. వాటిని త్వరలోనే ప్రెస్ మీటింగ్ లో బయటపెడుతాం. నేరడ ప్రజలంతా ఏక తాటిపైన నిలిచాం. వీరేశానికి సతీష్ రెడ్డి కుటుంబ ఉసురు తగులుతది. పోలీస్ ఫోర్స్ లు ఊర్లో తిరగగానే భయపడుతామనుకుంటే అది వీరేశం భ్రమ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

వేముల వీరేశానికి ప్రచారంలో అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. పోలీసులు లేనిదే వీరేశం ప్రచారం చేయలేకపోతున్నారని నాయకులు తెలిపారు. నేరడ గ్రామంలో పోలీస్ ఫోర్స్ హడావుడి చేయడంతో గ్రామస్థులు ఒక్కసారిగా ఆందోళనకు గురైన పిరికివాడు దైర్యం లేక పోలీసులను పంపాడని చర్చించుకున్నారు. దమ్ముంటే ఊర్లోకి రావాలి కానీ ఇదేం పని అంటూ పలువురు విమర్శించారు. ఓ మనిషి కోసం ఊరు ఊరంతా పార్టీలకతీతంగా అండగా నిలబడటం ఆశ్చర్యంగా ఉందని పలువురు అన్నారు. గ్రామస్థుల నిరసన వీడియో కింద ఉంది చూడండి. 

నేరడ గ్రామస్థుల తీరు పై టిఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. దుబ్బాక నర్సింహరెడ్డి నల్లగొండ టిఆర్ఎస్ ఇంచార్జీగా ఉండేవారు. ప్రస్తుతం కంచర్ల భూపాల్ రెడ్డి ఇంచార్జ్ గా ఉన్నారు. దుబ్బాక నర్సింహా రెడ్డి పదవి పోవడానికి వీరేశం కారణమని భావించి వారు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వీరేశానికి దుబ్బాక నర్సింహా రెడ్డి పదవి పోవడానికి సంబంధం లేదని తెలిపారు. దుబ్బాక సతీష్ రెడ్డి నిజంగానే పైసలు ఇచ్చినట్టైతే వాటిని తిరిగి ఇచ్చేందుకు వీరేశం సిద్దంగా ఉన్నాడని వచ్చి మాట్లాడుకొని సమస్య పరిష్కరించుకోవాలని వారు కోరారు.