టిఆర్ఎస్ లో ఏమైతుంది? హరీష్ శిబిరంలో టెన్షన్ (వీడియోలు)

తెలంగాణ వర్కింగ్ ప్రసిడెంట్ గా కేటిఆర్ ను ప్రకటించారు కేసిఆర్. ఈ ప్రకటనలో పెద్దగా ఎవరికీ ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ముందస్తు ఎన్నికలు అనేవే కేటిఆర్ కు పట్టాభిషేకం చేయడం కోసమే వచ్చాయన్న చర్చ ఉంది. కేసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి కాలు పెట్టబోతున్నారు. అందుకోసం రానున్న పార్లమెంటు ఎన్నికలు వేదిక కాబోతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో టిఆర్ఎస్ ట్రబుల్ షూఃటర్ గా ఉన్న హరీష్ రావు పరిస్థితి ఏంటి? హరీష్ రావు లక్ష పైచిలుకు ఓట్ల మెజార్టీతో నిన్న గెలిచారు. దేశంలో చాలా అరుదైన రికార్డు నెలకొల్పిన వారి జాబితాలో చేరారు. ఈ పరిస్థితుల్లో హరీష్ భవితవ్యం టిఆర్ఎస్ లో ఏంటి? అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

కేటిఆర్ ను వర్కింగ్ ప్రసిడెంట్ గా శుక్రవారం కేసిఆర్ ప్రకటించారు. నిన్న పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం హరీష్ రావు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మినిస్టర్ క్వార్టర్స్ లోని తన నివాసానికి చేరుకుని ఆయనను కలిశారు. వందల సంఖ్యలో ఆయన అభిమానులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మినిస్టర్ క్వార్టర్స్ కు చేరుకున్నారు. టిఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా ఉన్న హరీష్ రావు కు టిఆర్ఎస్ లో రానున్న రోజుల్లో ఏరకమైన ప్రాధాన్యత ఉండబోతున్నది అని వారు ఆరా తీస్తున్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మినిస్టర్ క్వార్టర్స్ కు రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. 

అయిేత రానున్న రోజుల్లో హరీష్ పాత్ర ఏరకంగా ఉండబోతున్నది అనే విషయంలో మాత్రం కార్యకర్తలో తీవ్రమైన చర్చ సాగుతున్నది. కేటిఆర్ కు వర్కింగ్ ప్రసిడెంట్ గా అనౌన్స్ కాగానే హరీష్ రావు ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు. ఆ తర్వాత కేటిఆర్ స్వయంగా హరీష్ రావు ఇంటికి వచ్చి ఆశిస్సులు తీసుకున్నారు. అయితే కేటిఆర్ కు వర్కింగ్ ప్రసిడెంట్ పదవి విషయం హరీష్ రావుకు ముందే తెలుసా అన్నది కేడర్ లో చర్చ జరుగుతున్నది. ఆయనకు ముందే సమాచారం ఉంది కాబట్టే ప్రకటన వచ్చిన వెంటనే ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు అని కొందరు వాదిస్తున్నారు. 

కానీ రానున్న రోజుల్లో హరీష్ రావు పాత్ర ఎలాంటిది అనేది మాత్రం చర్చనీయాంశమైంది. హరీష్ రావు సిద్ధిపేట నియోజకవర్గంలో అజాత శత్రువుగా అభివర్ణించబుడుతున్నారు. ఒక్క సిద్ధిపేటలోనే కాదు తెలంగాణ అంతటా, అన్ని పార్టీల వారు ఆయనను ఒక ఫైటర్ గా గుర్తిస్తారు. తెలంగాణ ఉద్యమంలో మామ కేసిఆర్ అడుగు జాడల్లో నడుస్తూ పనిచేశారు. అందుకే ఉమ్మడి రాష్ట్రంలోనే హరీష్ రావు ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా నెగ్గారు. తర్వాత రాజీనామాలు చేసిన సందర్భంలో మంత్రి పదవిని వీడారు. 

అయితే తెలంగాణ వచ్చిన తర్వాత తొలి కేబినెట్ లో హరీష్ రావు మంత్రివర్గంలో క్రియాశీలక పాత్ర పోశించారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా, మార్కెటింగ్ శాఖ మంత్రిగా, ఇరిగేషన్ శాఖలో ఆయన తనదైన ముద్ర వేశారు. ఇక ఈదఫా ఎన్నికలకు ముందు వరకు ఏ ఎన్నిక వచ్చినా హరీష్ రావు ఎంట్రీ ఇచ్చేవారు. ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ మీద బాధ్యతలు పెడితే గెలిపించుకురావడమే తరువాయి అన్నట్లుగా ఉండేది. నిన్న జరిగిన ముందస్తు ఎన్నికల్లోనూ హరీష్ రావుకు కట్టబెట్టిన బాధ్యతలు సక్సెస్ ఫుల్ గా నిర్వర్తించారు. కొడంగల్, గద్వాల ఎన్నికల బాధ్యతలను హరీష్ రావుకు అప్పగిస్తే అక్కడ కాంగ్రెస్ ప్రముఖులైన రేవంత్ రెడ్డి, డికె అరుణను ఓడించిన ఘనత హరీష్ కే దక్కింది.

ఈ సమయంలో ఎన్నికల కంటే ముందు పరిణామాలను కూడా కేడర్ చర్చించుకుంటున్నారు. నెలరోజులపాటు హరీష్ రావు ను టిఆర్ఎస్ అధికారిక చానెల్ గా ఉన్న టిన్యూస్ లో, నమస్తే తెలంగాణ పత్రికలో అనధికారిక నిషేధం విధించినట్లు వార్తలొచ్చాయి. హరీష్ మాట్లాడినా, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా వార్తలు ప్రసారం కాలేదు. పబ్లిష్ కాలేదు. తర్వాత మళ్లీ మామూలు స్థితి వచ్చింది. కానీ ఇప్పుడు కేటిఆర్ వర్కింగ్ ప్రసిడెంట్ నియామకం నేపథ్యంలో మరి హరీష్ రావు పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న కేడర్ నుంచి ఉత్పన్నమవుతున్నది. అందుకే శనివారం ఆయన అభిమానులంతా ఆందోళనతో ఏం జరుగుతున్నదో తెలుసుకునేందుకు మినిస్టర్ క్వార్టర్స్ కు పరుగులు పెట్టారు.

అభిమానుల తాకిడి హరీష్ రావు ఇంటి వద్ద ఎలా ఉందో పైన వీడియోలు చూడండి.