తెలంగాణ జవాన్ మృతి కేసులో బయటపడ్డ అసలు నిజం

జమ్ముకశ్మీర్ లో మరణించిన జవాన్ మరణం విషయంలో ట్విస్ట్ బయటపడింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ కు చెందిన జవాన్ రాజేష్ సోమవారం రాత్రి మరణించాడు. ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో మరణించాడని అంతా భావించారు.కానీ ఆర్మీ అధికారుల విచారణలో విస్తుపోయే  నిజం బయటపడింది. రాజేష్ ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించలేదని తోటి జవానే రాజేష్ ను కాల్చి చంపాడని తేలింది.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతమానేపల్లి మండలం రవీంద్ర నగర్ కు చెందిన రాజేష్ భాద్వేరాలోని రాష్ట్రీయ రైఫిల్స్ హెడ్ క్వార్టర్స్ లో హవల్దార్ గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి రాజేష్ కు మరో జవాన్ కు మధ్య తగాదా జరిగినట్టు తెలుస్తోంది. దీంతో తోటి జవాన్ కోపంతో తన వద్ద ఉన్న తుపాకీతో రాజేష్ పై కాల్పులు జరిపాడు. దీంతో రాజేష్ అక్కడికక్కడే మరణించాడు.  

ముందుగా ఉగ్రవాదులు కాల్పులు జరిపితే మరణించాడని అంతా భావించారు. కానీ ఆర్మీ అధికారులు ఈ ఘటన పై విచారణ చేయడంతో అసలు నిజం బయటపడింది. ఈ ఘటన పై కోర్టు ఆఫ్ ఎంక్వయిరీకి ఆదేశించామని ఆర్మీ అధికారులు తెలిపారు.

బుధవారం సాయంత్రం స్వగ్రామానికి రాజేష్ మృతదేహం

మణిమోహన్ డాక్వా, లలితా డాక్వా దంపతులకు రాజేశ్ ఏకైక కుమారుడు. 1978 సెప్టెంబర్ 5న జన్మించిన రాజేశ్ రవీంద్రనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత కాగజ్‌నగర్‌ లోని శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో పదో తరగతి పూర్తిచేశాడు. 1997లో జరిగిన ఆర్మీ సెలెక్షన్స్ లో పాల్గొన్నారు. 19 ఏండ్లకే ఉద్యోగంలో చేరి బెంగళూరు ఇంజినీరింగ్ రెజిమెంట్‌లో శిక్షణ పూర్తిచేశారు. హవల్దార్‌గా ఉద్యోగోన్నతి పొందాడు. 

 తండ్రి మణిమోహన్ ఏడేండ్ల క్రితం మరణించడంతో రాజేశ్ కుటుంబానికి పెద్దదిక్కయ్యారు. ఉద్యోగం చేస్తూ ఇద్ద రు సోదరీమణుల పెండ్లిండ్లు జరిపించాడు. 2008 లో ఈస్‌గాంలోని బెంగాలీక్యాంపునకు చెందిన జయ ను పెండ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఖుషిడాక్వా(10), రోష్ని డాక్వా(8) ఉన్నారు. కాగజ్‌నగర్‌లోని ఫాతిమా కాన్వెంట్‌లో ఖుషి ఐదో తరగతి, రోష్ని రెండో తరగతి చదువుతున్నది. ఆయన మరణవార్తతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

బుధవారం సాయంత్రానికల్లా మృతదేహం స్వగ్రామానికి చేరుకుంటుందని చింతలమానేపల్లి ఎస్సై రాజ్‌కుమార్ చెప్పారు. సమీప గ్రామాల ప్రజలు, సన్నిహితులు ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో వచ్చి రాజేశ్ కుటుంబసభ్యులను ఓదార్చారు.