తెలంగాణలో సమ్మె బాట పడుతున్న మరో శాఖ ఉద్యోగులు

తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని ఉద్యోగులు సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. మామూలు సమ్మె మాత్రమే కాకుండా ఏకంగా కుటుంబసభ్యులందరితో కలిసి ఆమరణ నిరహారదీక్షకు రెడీ అవుతున్నారు వారు. ఐదు డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన బాట పడుతున్నారు. ఇంతకూ ఎవరీ ఉద్యోగులు, వారి డిమాండ్లేంటి? పూర్తి వివరాలు చదవండి.

తెలంగాణలోని సొసైటీ ఎలిమినేషన్ రూరల్ పావర్టీ  (సెర్ప్) ఉద్యోగులు మరోసారి సమ్మె బాట పట్టారు. ఆగస్టు 30వ తేదీ రాత్రి వరకు తమ డిమాండ్లు పరిస్కరించకపోతే ఆగస్టు 31వ తేదీ నుంచి సమ్మెతోపాటు కుటుంబసభ్యులతో కలిసి ఆమరణ నిరహారదీక్షలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శనివారం వారు సెర్ప్ సిఇఓ పౌసమీ బసు కు సమ్మె నోటీసు ఇచ్చారు. ప్రధానంగా ఐదు డిమాండ్లతో సెర్ప్ ఉద్యోగులు నోటీసు ఇచ్చారు.

గతంలో సమ్మె కాలంలో మంత్రి జూపల్లిని కలిసిన సెర్ప్ ఉద్యోగులు

తెలంగాణ వ్యాప్తంగా సెర్ప్ లో 4258 మంది సెర్ప్ లో వివిధ కేటగిరీల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో కమ్యూనిటీ కోఆర్డినేటర్లు 2458 మంది పనిచేస్తున్నారు. ఎపిఎం (అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్) లు 720 మంది ఉన్నారు. డిపిఎం (డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజర్)లు 120 మంది ఉన్నారు. ప్రాజెక్టు మేనేజర్లు 33 మంది ఉన్నారు. వీరంతా సెర్ప్ ఉద్యోగుల జెఎసి ఏర్పాటు చేసుకున్నారు. జెఎసి ఆధ్వర్యంలోనే ఆగస్టు 31 వ తేదీ నుంచి సమ్మె బాట పట్టనున్నట్లు నోటీసులో పేర్కొన్నారు.

సెర్ప్ హెచ్ ఆర్ పాలసీ 2008 కింద 3166 మంది పని చేస్తున్నారు. అలాగే 2011, 12 కమ్యూనిటీ బేస్ డ్ ఆర్గనైజేషన్ హెచ్ ఆర్ పాలసీ కింద 789 మంది పని చేస్తున్నారు. మినిస్ట్రీరియల్ హెచ్ ఆర్ పాలసీ 309 మంది ఉన్నారు. వీరు ఇదివరకే 2017 లో 33 రోజులపాటు సమ్మె చేశారు. ఆ సమయంలో ప్రభుత్వం త్రి సభ్య కమిటీ వేసింది. వారి డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. త్రిసభ్య కమిటీ 15 రోజుల్లోనే నివేదిక సమర్పించాలని కూడా ప్రభుత్వం విడుదల చేసిన జిఓలో పేర్కొన్నది. కానీ ఇప్పటి వరకు త్రి సభ్య కమిటీ ఏం నివేదిక ఇచ్చిందన్నది ఉద్యోగులకు తెలియడంలేదు. నివేదిక మాత్రం అందినట్లు చెబుతున్నారు.

డిమాండ్ల కోసం సెర్ప్ ఉద్యోగుల ఆందోళన

సెర్ప్ ఉద్యోగుల డిమాండ్ల విషయమై సెర్ప్ ఉద్యోగుల జెఎసి నేత ఏపూరి నర్సయ్య ‘తెలుగు రాజ్యం’తో మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తాత్సారం చేయడం దారుణమన్నారు. తమ ప్రధాన డిమాండ్లలో 58 ఏళ్లకు ప్రభుత్వ ఉద్యోగి మాదిరిగానే రిటైర్ అయ్యేలా అగ్రిమెంట్ ఇవ్వాలన్నారు. ప్రస్తుతం ప్రతి ఐదేళ్ల కోసం కాంట్రాక్టు రెన్యువల్ చేసే విధానం అమలులో ఉందన్నారు. సెర్ప్ ఉద్యోగులందరికీ కేబినెట్ అప్రూవల్ తో ఇచ్చిన సెర్ప్ హెచ్ ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని వెసులుబాట్లు ఇస్తామన్నారు కానీ అమలు చేయలేదని తక్షణమే తమకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే వెసులుబాట్లు కల్పించాలన్నారు. పదో పిఆర్సి ప్రకారం పే స్కేల్ అమలు చేయాలన్నారు. ఈ పిఆర్సి అమలు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద ఏటా 87 కోట్ల మేరకు అదనపు భారం పడుతుందని చెప్పారు. మిగులు బడ్జెట్ రాష్ట్రంలో నాలుగు వేల మంది ఉద్యోగులకు ఈమాత్రం ఖర్చును సర్కారు భరించలేదా అని ప్రశ్నించారు. అన్ని స్థాయిల్లో వారికి ప్రమోషన్లు ఇవ్వాలన్నారు.

ఎల్ 1 కేటగిరీ ఉద్యోగులకు ఎల్ 2 ఉద్యోగులకు మధ్య వేతనాల మధ్య వ్యత్యాసం తక్కువగా ఉందని చెప్పారు. ఎల్ 1 నుంచి ఎల్ 2కి ప్రమోషన్ ఇచ్చినా లాభం లేకుండాపోయిందన్నారు. రెండు కేటగిరీ వాళ్లకు 15,600 మాత్రమే వేతనం ఉందన్నారు. ప్రస్తుతం ఎల్ 2 గా 1300 మందికి ప్రమోషన్ వచ్చిందని చెప్పారు. కానీ ఆర్థికపరమైన లబ్ధి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్ 2 వారికి 26,700 వేతనం ఉండాలన్నారు. దాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు.

సమ్మెతో పాటు ఆమరణదీక్షలు చేస్తామని సెర్ప్ ఉద్యోగుల జెఎసి ఇచ్చిన నోటీసు

ప్రభుత్వం తమ డిమాండ్లపై గత ఏడాది నవంబరు చివరి వారంలో త్రిసభ్య కమిటీ వేసినా ఇప్పటి వరకు ఆ నివేదిక అమలు లేదన్నారు. మరో ఐదు రోజుల్లో ప్రభుత్వం స్పందించి తమ ఐదు డిమాండ్లు పరిష్కరించకపోతే ఆగస్టు 31వ తేదీ నుంచి సమ్మె మాత్రమే కాకుండా కుటుంబసభ్యులందరితో కలిసి ఆమరణ దీక్షలు చేపడతామని హెచ్చరించారు. సెర్ప్ ఉద్యోగులు ఇచ్చిన నోటీసు పైన ఉంది చూడండి.

(నోట్ : ఫ్యూచర్డ్ ఫొటో తో పాటు మిగతా ఫొటోలు గతంలో సమ్మె చేసిన కాలం నాటివి గమనించగలరు. సమ్మె నోటీసు  ఇవాళ్టిది. )