డిఎస్ కొడుకు ధర్మపురి సంజయ్ కి మరో దెబ్బ

నర్సింగ్ విద్యార్థినిలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మపురి సంజయ్ (టిఆర్ఎస్ ఎంపి డిఎస్ కొడుకు) కి మరో గట్టి దెబ్బ తగిలింది. ఆయనపై నర్సింగ్ విద్యార్థినిలు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చి సచివాలయంలో హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డికి ఫిర్యాదు చేయడంతో సంజయ్ మీద నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది.

అయితే తన మీద కేసు నమోదు కావడంతో సంజయ్ మాయమైపోయాడు. విచారణ ఎదుర్కొంటానని ప్రకటించిన సంజయ్ హైదరాబాద్ వచ్చి పరార్ అయ్యాడు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.

అయితే తన మీద నమోదైన కేసుపై సంజయ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారు. తనపై తెలంగాణ ప్రభుత్వం నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. సంజయ్ తరుపున అడ్వొకెట్ ప్రధ్యుమ్న రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సంజయ్ వేసిన క్వాష్ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం పిటిషన్ రద్దు చేసింది.

ఈ కేసులో సిఆర్ పిసి సెక్షన్ 41(ఎ) కింద పోలీసులు ప్రొసీడ్ కావొచ్చని తేల్చి చెప్పింది న్యాయస్థానం. సెక్షన్ 41(ఎ) ప్రకారం పోలీసులు ముందస్థు అరెస్టు చేసే అవకాశం లేదని చెబుతున్నారు. ముందుగా సంజయ్ కి నోటీసులు ఇచ్చి సంజాయిషీ కోరాలి.. ఆ తర్వాత దర్యాప్తు చేయాలన్నది ఈ సెక్షన్ ఉద్దేశం అని చెబుతున్నారు. ఏడున్నర సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే కేసులను ఈ సెక్షన్ కింద దర్యాప్తు చేస్తారని అంటున్నారు.

ఈ పరిస్థితుల్లో సంజయ్ పోలీసుల ముందుకొచ్చి విచారణ ఎదుర్కొంటారా? లేక పోలీసులు అరెస్టు చేసి తీరుతారా అన్నది తేలాల్సి ఉంది.