టిఆర్ఎస్ మీటింగ్ లో ఈ ట్విస్ట్ ఎందుకబ్బా ?

తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ శాసనసభా పక్షం, పార్లమెంటరీ పార్టీల ఉమ్మడి సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో అత్యంత కీలకమైన అంశాలపై చర్చ జరగవచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ సిఎం కేసిఆర్ పార్టీ నేతలకు అనేక అంశాలపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చే చాన్స్ ఉందని అంటున్నారు. అయితే ఈ సమావేశం గత సమావేశాలకు భిన్నంగా మొదలు కావడం చర్చనీయాంశమైంది. ఈ కొత్త ట్విస్ట్ ఏందబ్బా అని పార్టీ నేతల్లోనే కాకుండా జనాల్లోనూ చర్చనీయాంశమైంది. ఇంతకూ ఆ ట్విస్ట్ ఏందో కింద చదవండి.

తెలంగాణ భవన్  లో సమావేశానికి సరికొత్త పద్ధతిని ఫాలో అయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు అందరికి సెల్ ఫోన్లను అనుమతించలేదు. పార్టీ నేతలంతా తమ సెల్ ఫోన్లు బయటనే ఉంచాలని ఆదేశాలు అందాయి. పార్టీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, జరిగిన చర్చల విషయంలో గోప్యత పాటించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అందుకే సమావేశానికి హాజరైన మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులంతా తమ సెల్ ఫోన్లను తమ వ్యక్తిగత సహాయకులు, గన్ మెన్ల వద్ద ఉంచి సమావేశ మందిరంలోకి వెళ్లారు. ఎంపిలు, ఎమ్మెల్యేలే కాదు తుదకు మంత్రులు కూడా సెల్ ఫోన్లు బయట తమ సిబ్బందికి అప్పగించి లోపలికి వెళ్లారు. సెల్ ఫోన్లే కాదు ఇతర ఏ ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా తీసుకుపోయేందుకు అనుమతించలేదు.

ఈ హడావిడి అంతా చూస్తుంటే సమావేశంలో జరిగిన చర్చలకు సంబంధించి గోప్యత కోసమేనా? లేదంటే మరేదైన బలమైన కారణాలున్నాయా అన్న కోణంలోనూ చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో సెల్ ఫోన్లలో చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలోకి వదిలిన దాఖలాలున్నాయి. తద్వారా రహస్యంగా ఉంచాల్సిన అంశాలు కూడా బట్టబయలు కావడం చూస్తూనే ఉన్నాం. అంతెందుకు చాలా మంది టిఆర్ఎస్ నేతలు ఫోన్లలో అవతలివాళ్లను బెదిరించడం, తిట్టడం లాంటి ఘటనలు వెలుగులోకి వచ్చిన పరిస్థితి ఉంది. దీంతో తిట్టిన వారి బండారం బయటకు రావడం కూడా జరిగింది. అంతేకాదు పోలీసు స్టేషన్లలో పోలీసులు బెదిరించే తీరు కూడా వీడియోలతో సహా బయటకు వచ్చిన దాఖలాలున్నాయి. సెల్ ఫోన్లు తీసుకుపోతే ఈ తరహా సమస్యలు వస్తాయన్న ఉద్దేశంతో టిఆర్ఎస్ అధిష్టానం సెల్ ఫోన్లను తీసుకురావొద్దని ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.

ఇదేకాకుండా మరో ఆసక్తికరమైన చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. రానున్న ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు గ్యారెంటీ అని సిఎం కేసిఆర్ పలు సందర్భాల్లో ప్రకటనలు ఇచ్చారు.. ఇంకా ఇస్తున్నారు. కానీ కొందరు ఎమ్మెల్యేలకు కొంత అనుమానం మాత్రం ఉంది. ఎందుకంటే సిఎం జరిపించే సర్వేల్లో వారు వెనుకబడ్డారన్న చర్చ ఉంది. దీంతో సిఎం చేయించిన సర్వేల్లో వెనుకబడ్డ ఎమ్మెల్యేలందరూ తమకు సీటు వస్తుందో రాదో అన్న ఆందోళనతో ఉన్నారు. అంతేకాకుండా కొందరు రకరకాల పనులు చేసి జనాల్లో పలుచన అయ్యారు. నియోజకవర్గంలో చెడ్డపేరు తెచ్చుకున్నవారు కూడా ఉన్నారు. వారు కూడా తమకు టికెట్ వస్తుందో రాదో అన్న భయంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వారిలో కొందరు టికెట్ రాదని తెలిస్తే పక్క పార్టీల్లోకి జంప్ అయ్యేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అటువంటి ఆలోచన ఉన్నవారు ఈ సమావేశంలో సెల్ ఫోన్లతో పోతే సమావేశం వివరాలన్నీ ఫోన్లో రికార్డు చేసుకుని తర్వాత రోజుల్లో వాటిని సోషల్ మీడియాలోకి వదిలే ప్రమాదం ఉంది అన్న ఉద్దేశంతో కూడా సెల్ ఫోన్ల నిరాకరణ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఇంత పకడ్బందీగా సమావేశం జరుపుతున్నారంటే ఏదో తీవ్రమైన నిర్ణయమే ఉంటుందేమో అన్న చర్చ రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య జనాల్లోనూ నెలకొంది. ముందస్తు ఎన్నికలకు పోతారా లేదా? అన్నదానిపై సిఎం క్లారిటీ ఇవ్వొచ్చని అంటున్నారు. దాంతోపాటు సర్వే ఫలితాలు లాంటి కీలకమైన విషయాలను కూడా సమావేశంలో చర్చించే అవకాశముందని అంటున్నారు. మొత్తానికి శుక్రవారం తెలంగాణ భవన్ లో జరుగుతున్న టిఆర్ఎస్ శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీల సమావేశం రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలకు వేదిక కానుందా అన్న చర్చ ఊపందుకున్నది.