కేటీఆర్ బామ్మర్దిపై మళ్లీ రేవంత్ సంచలన కామెంట్స్

తెలంగాణను తాగుబోతుల కేంద్రంగా చేయాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మాదక ద్రవ్యాల కేసును అణగతొక్కి నాటకమాడారన్నారు. గచ్చిబౌలిలో శనివారం మ్యూజికల్ ఈవెంట్ నిర్వహిస్తున్నారని దీనికి అసలు ఎన్నికల సంఘం అనుమతి ఉందా అని వారు ప్రశ్నించారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి అర్దరాత్రి వరకు గచ్చిబౌలి స్టేడియంలో చీకటి దందాలు నడుపుతున్నారన్నారు.

యువత, క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన స్టేడియంలో మ్యూజికల్ నైట్ పార్టీలను ఎలా ఏర్పాటు చేస్తారని రేవంత్ విరుచుకుపడ్డారు. నాలుగేళ్లలో ఏ ఒక్కరోజు కూడా గచ్చిబౌలి స్టేడియంలో ఆటలు నిర్వహించచేతకాని దద్దమ్మలు ఇవ్వాళ తాగుబోతులు ఎంజాయ్ చేసేందుకు పార్టీలకు అనుమతిస్తున్నారని విరుచుకుపడ్డారు. అసలు సైబర్ బాద్ పోలీసులు ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారా అని ప్రశ్నించారు.

కేటిఆర్ బావమరిది రాజ్ పాకాల ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. కేవలం 3000 రూపాయలు కడితే అమ్మాయిలు అబ్బాయిలు కలుసుకోని మాట్లాడుకోవచ్చు. తాగి తూగవచ్చట. 3 వేలు తీసుకొని అబ్బాయిలకు అమ్మాయిలను అప్పజెప్పుతరు. ముఖ్యమంత్రి కుటుంబమే ఇంత నీచ స్థాయికి దిగజారితే ఇక ప్రజా పాలన ఎలా ఉంది. ఆన్ లైన్ లో 3, 5 లక్షల రూపాయలకు టికెట్లు అమ్ముతున్నారు. తెలంగాణలో మీడియా సంస్థలు, ప్రజాసంబంధ సంస్థలు అసలు ఎందుకు వీటిని పట్టించుకోలేదన్నారు. విద్యార్దులను నాశనం చేసేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. విద్యార్దులను డ్రగ్స్ కు అలవాటు చేసి ప్రభుత్వాన్ని  ప్రశ్నించకుండా బానిసలుగా చేస్తున్నారన్నారు.

15 సంవత్సరాలు ఉన్న చిన్నారులను ఈవెంట్లకు అనుమతిస్తున్నారు. 21 ఏండ్లు ఉండాలన్న నిబంధన ఏమైందన్నారు. తెలంగాణలో టాస్క్ ఫోర్స్ వ్యవస్థ నిద్రపోతుంది. స్టేడియం చుట్టు పోలీసులను పెట్టి లోపల  చీకటి దందాలు నడుపుతున్నారు. అంటే కేటిఆర్ బావమరిది అయినంత మాత్రన అమ్మాయిలకు, అబ్బాయిలకు డేటింగ్ ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నించారు. వ్యభిచార ముఠా నడుపుతున్నోళ్లు తెలంగాణను పాలిస్తున్నారు.  వారికి అనుకూలంగా వారి బంధువులను కీలక పదవుల్లో పెట్టుకొని ఇష్టమొచ్చినట్టు ఆటాడుతున్నారన్నారు.

అధికారులు వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలి. ఎన్నికల అధికారి రజత్ కుమార్ తక్షణమే చర్చలు తీసుకోవాలి. లేని పక్షంలో తానే స్వయంగా సాయంత్రం నాలుగు గంటలకు గచ్చిబౌలి స్టేడియానికి వెళుతానని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలంలో అసాంఘీక కార్యకలాపాలకు అనుమతిచ్చేదే లేదన్నారు. తెలంగాణ పోరాటాల గడ్డ… ఇంతటి అక్రమాలు జరుగుతుంటే ఎందుకు పట్టించుకోరు. ప్రతిపక్ష పార్టీగా పోరాడే బాధ్యత తమపై ఉంది. అందుకే పోరాడుతాం అక్రమాలను ఆపుతామని రేవంత్ రెడ్డి అన్నారు. 

అధికారులు తక్షణమే ఈ  ఈవెంట్ ను ఆపాలి. తెలంగాణ యువతను తాగుబోతులుగా, వ్యభిచారులుగా తయారు చేయాలని కేసీఆర్ కుటుంబం ప్రయత్నిస్తుందన్నారు. కోర్టులో కూడా లంచ్ మోషన్ పిటిషన్ వేస్తామని తెలిపారు. గత సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తే కోర్టులో పిటిషణ్ వేయగా కోర్టు తక్షణమే కార్యక్రమ వీడియో అందజేయాలని ఆదేశించగా ఇప్పటి వరకు అందజేయలేదన్నారు. ఈ రోజు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదన్నారు. ఎన్ ఎస్ యూఐ, కాంగ్రెస్ యూత్ విభాగంతో కలిసి తాను గచ్చిబౌలికి వెళుతానన్నారు. తాను వెళ్లే దాక చూస్తే పరిస్థితులు చేజారుతాయన్నారు. ఇక తాడో పేడో తేల్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందన్నారు.