కేటిఆర్ కు సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి

తెలంగాణ ఎన్నికలలో చాలా పొరపాట్లు జరిగాయని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. అనేక మంది ఓట్లు తొలగించారన్నారు. టిఆర్ఎస్ కు వేయరని అనుకున్న ప్రతి ఒక్కరి ఓట్లు గల్లంతయ్యాయన్నారు. హైదరాబాద్ లోని తన నివాసంలో మాట్లాడిన రేవంత్ ఏమన్నారంటే

“తెలంగాణలో ప్రజా కూటమి విజయం సాధించబోతుంది. సోనియా గాంధీ జన్మదినోత్సవ కానుకగా గెలుపును అందిస్తాం.  ఈ నెల 11న ప్రజా కూటమి గెలుస్తుంది. గెలుపును ఆస్వాదించడానికి కూటమి శ్రేణులు సిద్దంగా ఉన్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగు రాబోతుంది. తెలంగాణకు పట్టిన పీడ నుంచి ప్రజలకు విముక్తి లభించనుంది. విలక్షణమైన తీర్పు ఇవ్వనున్న నాలుగు కోట్ల ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

తెలంగాణ ఎన్నికల్లో చాలా ఓట్లు తారు మారయ్యాయి. చాలా ఓట్లు గల్లంతయ్యాయి. కేసీఆర్ పై ఎన్నికల అధికారులు కేసు నమోదు చేయాలి. ఎందుకంటే కేసీఆర్ రెండు ప్రాంతాలలో ఓటు నమోదు చేసుకున్నారు. ఎర్రవల్లిలో చంద్రశేఖర్ రావు కల్వకుంట్ల అని చింతమడకలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని నమోదు చేసుకున్నారు. ఒక వ్యక్తి రెండు పేర్లతో రెండు ప్రాంతాలలో నమోదు చేసుకోవడం చట్టరీత్యా నేరం. ఎన్నికల అధికారులు తక్షణమే కేసీఆర్ పై కేసు నమోదు చేయాలి. సెక్షన్ 312 కింద కేసు నమోదు చేయాలి. దీని ప్రకారం అతనికి సంవత్సరం జైలు శిక్ష పడుతది.

కేటిఆర్ మాట్లాడుతూ ఎన్నికల అధికారులు చాలా మంచిగా పని చేశారని అంటున్నాడు. పొరపాట్లు జరిగాయి క్షమించడండని అధికారులు కోరుతుంటే కేటిఆర్ పొగడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే అధికారులు టిఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించారని అభినందిస్తున్నారా అని కేటిఆర్ ను అడుగుతున్నా.

కేటిఆర్ ఎన్నికల ప్రచారంలో కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో నిలబడి ఓ సవాల్ విసిరిండు. రేవంత్ రెడ్డి గెలిస్తే తాను రాజకీయ  సన్యాసం తీసుకుంటానని ప్రకటించాడు. రేవంత్ రెడ్డి గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాడా అని అన్నాడు. నేను కేటిఆర్ సవాల్ స్వీకరిస్తున్నా.. కేటిఆర్ కు కూడా నేనో సవాల్ విసురుతున్న.. కొడంగల్ లో నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. నేను గెలిస్తే కేటిఆర్ అన్నట్టుగా రాజకీయ సన్యాసం తీసుకోవాలి. కేటిఆర్ మాట మీద నిలబడకపోతే అతనిది కల్వకుంట్ల వంశమే కాదని తెలంగాణ ప్రజలు భావించాల్సి ఉంటది. దీనికి కేటిఆర్ సిద్దంగా ఉండాలి 

 

 

ఎన్నికలలో చాలా చోట్ల టిఆర్ఎస్ వాళ్లు అవకతవకలకు పాల్పడేందుకు ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్ శ్రేణుల ముందు వారి పప్పులు ఉడకలేదు. ఈవీఎంల ట్యాంపరింగ్ చేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. అటువంటివి చేస్తే సహించేది లేదు. అన్ని సెంటర్లల్ల కూడా కాంగ్రెస్ శ్రేణులు కాపలాగా ఉన్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యకర్తలు గస్తీగా ఉన్నారు. ఎన్నికల ఫలితాలు అయ్యేంత వరకు కూడా కార్యకర్తలు స్ట్రాంగ్ రూముల దగ్గర ఉంటారు. అనుమానాలు ఉన్నాయి కాబట్టే ప్రత్యామ్యాయాలు  ఏర్పాటు చేసుకుంటున్నాం.  

కేసీఆర్ రెండు ఓట్లు నమోదు చేసుకున్నందుకు వెంటనే కేసు నమోదు చేసి శిక్షించాలి. కేటిఆర్ తన సవాల్ కు కట్టుబడి ఉండాలి. ఎన్నికల ఫలితాలు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు.”  అని రేవంత్ తెలిపారు.