షాకింగ్ న్యూస్ : తొడగొట్టిన రేవంత్ రెడ్డికి భయం భయం

తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని భయాందోళన వ్యక్తం చేశారు. తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించే వరకు కాలు బయట పెట్టబోనని ప్రకటించారు. అంతేకాదు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కూడా రేవంత్ రెడ్డి రద్దు చేసుకునారు.

‘‘నా ప్రాణాలకు హాని ఉంది. ఎన్నికల ప్రచారంలో నా మీద దాడులు చేసేందుకు కుట్ర పన్నారు. దీనిపై నాకు పక్కా సమాచారం ఉంది. ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పినా వారు పట్టించుకుంటలేరు. మావోయిస్టుల ముసుగులో నాపై దాడులు జరిపేందుకు కుట్ర జరుగుతున్నది. కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తున్నానని కేసీఆర్ అండ్ కొ నన్ను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారు. నా అడ్డు తొలగించుకుంటానని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఆపరేషన్ బ్లూ స్టార్ చేస్తా అన్నారు. నేను తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తూ వారి ఆగడాలను ఎత్తి చూపుతున్నానని నాపై దాడులు చేసేందుకు రౌడీలతో కుట్ర చేశారు. నాకు 4+4 భద్రత కల్పించాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా దానిని అమలు చేయకుండా కుట్ర చేశారు. మహేందర్ రెడ్డి డిజిపి అయ్యాక నా పై దాడులకు ప్రణాళికలు ఎక్కువయ్యాయి. నా కార్యకర్తలను వేధిస్తున్నారు. నేను వారి తప్పులను ప్రశ్నించడమే నేరమా? అందుకోసమే ఇవాళ మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో ఉన్న పర్యటనను రద్దు చేసుకుంటున్నాను. నాకు కేంద్ర బలగాల రక్షణ కల్పించేంత వరకు కూడా నేను బయటికి వెళ్లను’’  అని రేవంత్ ప్రకటించారు.

రేవంత్ కు ఇంత అదురు జొరబడ్డది ఎందుకబ్బా ?

తెలంగాణ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ను ఢీకొట్టిన నాయకులే తెలంగాణలో లేరు. పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, సిఎల్పీ నేత జానారెడ్డి అయినా కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్ అయినా ఏదో ఒక సందర్భంలో కేసిఆర్ ను ఢీకొట్టలేక చతికిలపడ్డారు. రకరకాల కారణాల చేత వారంతా సమయం, సందర్భం వచ్చినప్పుడే కేసిఆర్ పై విరుచుకుపడ్డారు తప్ప ఎల్లవేళలా కేసిఆర్ మీద ఎటాక్ చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం అలా కాదు. టిఆర్ఎస్ సర్కారు ఏర్పాటైన తొలిరోజు నుంచే రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ మీద, కేసిఆర్ కుటుంబం మీద ఎటాక్ చేస్తూ వచ్చారు. టిడిపిలో ఉన్న రేవంత్ రెడ్డి ఇలా కేసిఆర్ మీద ఎటాక్ చేస్తున్న సందర్భంలోనే టిడిపిలో అగ్ర స్థాయి నేతగా ఎదిగారు.

మధ్యలో ఓటుకు నోటు కేసు వెలుగులోకి రావడం, రేవంత్ రెడ్డి జైలుపాలు కావడం జరిగిపోయాయి. అయినా జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ లో అందరు నేతలకంటే రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందే ఉన్నారు. విమర్శల వేడి తగ్గలేదు. అయితే ఇటీవల రేవంత్ రెడ్డి ఆస్తులపై ఐటి దాడులు కూడా జరిగాయి. ఐటి దాడుల నుంచి రేవంత్ రెడ్డి దూకుడు తగ్గిందేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే కాంగ్రెస్ లో కీలక పదవి వచ్చిన తర్వాత రేవంత్ రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయాలనుకున్నారు. వర్కింగ్ ప్రసిడెంట్ హోదాలో రేవంత్ కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేశారు. అయితే ఆయన మెరుపు వేగంతో ప్రచారం చేయడం కోసం కాంగ్రెస్ అధిష్టానం హెలిక్యాప్టర్ కూడా అరెంజ్ చేసింది. ఈ పరిస్థితుల్లో గత మూడు రోజులుగా రేవంత్ శిబిరంలో అలజడి రేగింది.

గురువారం నాడు రేవంత్ రెడ్డి తన భద్రత మీద భయాందోళనలు వ్యక్తం చేశారు. తన మీద దాడులు జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారని, మఫ్టీలో ఉన్న పోలీసుల చేత దాడులు చేయించబోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు కేంద్ర బలగాల రక్షణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఆ ఆదేశాలను డిజిపి మహేందర్ రెడ్డి తొక్కి పెట్టారని ఆరోపించారు. ఇక శుక్రవారం రేవంత్ భయం రెట్టింపు అయింది. తాను ఎన్నికల ప్రచారానికి పోతే చంపేస్తారేమోనని భయాన్ని ఓపెన్ గా ప్రకటించారు. మావోయిస్టుల పేరుతో దాడులు చేసి అంతమొందించేందేకు కుట్ర జరుగుతుందని అందుకే తాను ఖమ్మం, మహబూబ్ నగర్ పర్యటనలను రద్దు చేసుకుంటన్నట్లు ప్రకటించిన సంచలనం రేపారు.

మరి ఇదంతా రేవంత్ రెడ్డి వ్యూహాకత్మకంగా వేస్తున్న అడుగులా? లేదంటే నిజంగానే ఆయన భయపడుతున్నారా అన్నది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. నిజానికి కేసిఆర్ ను నాలుగేళ్లుగా టార్గెట్ చేస్తూ వచ్చినందుకే రేవంత్ రెడ్డికి తెలంగాణలో పాపులారిటీ పెరిగింది. మరి అటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు కాడి కింద పడేయడం హాట్ టాపిక్ అయింది. ఎన్నికల సమరంలో అత్యంత కీలకమైన ఈ మూడు రోజులపాటు ఇంట్లోంచి బయటకు రానని రేవంత్ రెడ్డి ప్రకటించడం కాంగ్రెస్ వర్గాల్లోనూ కలవరం రేపుతున్నది.