కేసిఆర్ కు దమ్ముంటే ఆ సభ జరపాలి : రేవంత్ రెడ్డి సవాల్

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరోసారి తెలంగాణ సిఎం కేసిఆర్ మీద ఫైర్ అయ్యారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆయన ఏమన్నారో చదవండి.

రాహుల్ గాంధీ పర్యటన ప్రాధాన్యత తగ్గించేందుకు, మీడియా కవరేజ్ తగ్గించేందుకు కేసీఆర్ హడావిడిగా పార్టీ కార్యవర్గ సమావేశం పెట్టారు. అయినా రాహుల్ పర్యటన విజయవంతం అయ్యింది. సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభ పెడతానని కేసీఆర్ చెప్పారు. కానీ అది సాధ్యం కాదని నిఘావర్గాలు నివేదిక ఇచ్చాయి. ప్రజలు పూర్తి వ్యతిరేకత తో ఉన్నారని సీఎం కు అందిన నివేదికలో ఉంది. కేసీఆర్ కు చేతనైతే శషబిషలు లేకుండా ముందుగా చెప్పిన విధంగా ప్రగతి నివేదన సభ జరపాలి. ప్రగతి నివేదన సభ పెడితే ఇచ్చిన హామీలపై నేను బహిరంగ చర్చకు సిద్ధం.

ఆగస్టు 15 కల్లా ఇంటింటి నల్లా నీళ్లు ఇస్తామని కేసీఆర్ చెప్పారు. లేకుంటే ఓట్లు అడగనని కూడా కేసీఆర్ అన్నారు. కానీ ఇంతవరకు ఆ హామీ ఏమైంది. ఈ డిసెంబర్ వరకు కూడా కెసిఆర్ ఆ హామీని నెరవేర్చలేరు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలే .. ప్రతి నియోజకవర్గానికి వంద పడకల హాస్పిటల్ అన్నాడు పెట్టలేదు. ఎక్కడా పెట్టలేదు. ఇవే కాదు చేస్తానన్న ఏ హామీని కేసీఆర్ నెరవేర్చలేక పోయాడు. 

సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే .. పార్టీలో తిరుగుబాటు నుంచి బయటపడేందుకు .. ముందస్తు ఎన్నికలనే నాటకం ఆడుతున్నారు. ఓటర్ లిస్టు వచ్చే జనవరి కల్లా పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల అధికారి రాష్ట్ర ఎన్నికల అధికారి లేఖ రాశారు. ఓటర్ లిస్ట్ పూర్తి కాకుండా ఎలా ముందస్తు ఎన్నికలను నిర్వహిస్తారు. 

అసెంబ్లీ లో ఎంఐఎం తో కలిసి వెళ్లాలని .. దాని తరువాత ఎంఐఎం కు పక్కన పెట్టి బీజేపీ తో కలిసి లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ చూస్తున్నారు. ఎంఐఎం కూడా దీనిపై ఆలోచించాలి. జమిలీ ఎన్నికలంటున్న మోడీ .. అసెంబ్లీ కి ముందస్తు ఎన్నికలకు ఎలా సహరిస్తారు. అసెంబ్లీ .. లోక్ సభ ఎన్నికలు వేరు వేరుగా పెట్టడం వల్ల ఆర్థిక భారం ఎక్కువగా ఉంటుంది. కేసీఆర్ రాజకీయ లబ్ధి పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలను మోడీ సహకరిస్తే .. అది లోపాయకారి ఒప్పందమే అవుతుంది. 

పార్టీ క్యాడర్ ను అప్రమత్తం చేసేందుకు మాత్రమే పీసీసీ చీఫ్ ముందస్తు ఎన్నికలంటున్నాడు. ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకే పీసీసి అధ్యక్షుడిగా ఉత్తమ్ పార్టీ ని సమాయత్తం చేస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులు ముందస్తు ప్రిపరేషన్స్ పక్కన పెట్టి సర్కార్ వైఫల్యాలను జనం లోకి తీసుకెళ్లాలి. 

బీజేపీ తో కలిసేవాళ్లను .. లోపాయకారి ఒప్పందాలు పెట్టుకునే వాళ్ళు మాకు శత్రువులేనని చంద్రబాబు ఆ పార్టీ నేతలకు చెప్పాడు. చంద్రబాబు మాటల ప్రకారం తెలంగాణలో టిఆర్ఎస్ వారికి శత్రువుని తేలిపోయింది. ఇక మిత్రులెవరన్నది తెలదానికి ఇంకా సమయం పడుతుంది.