తెలంగాణ మంత్రి ఈటల మాజీ డ్రైవర్ కు షాక్

తెలంగాణ రాజకీయాల్లో నోటికి పనిచెప్పే లీడర్లు బాగానే ఉన్నారు. నోరు తెరిస్తే అబద్ధం చెప్పడంలో కొందరు దిట్ట గా పేరు తెచ్చుకుంటే నోరు తెరిస్తే కంపు మాటలు, ముత్క కూతలు, తిట్లు, బూతులు మాట్లాడే వారు మరికొందరు. రోజు రోజుకూ రాజకీయాల్లో విలువలు దిగజారిపోతున్న ఈ రోజుల్లో ఈ కోవకు చెందిన రాజకీయ నాయకుల సంఖ్య పెరిగిపోతున్నది. అయితే తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీలో ఈ తరహా నోటికి పనిచెప్పే లీడర్లే ఎక్కువ మంది ఉన్నారు. ఏకంగా టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ అందరికంటే ఎక్కువగా నోటికి పని చెబుతూ చర్చల్లో నానుతూ ఉన్న విషయం అందరికీ తెలుసు.

అయినప్పటికీ తెలంగాణలో అక్కడో ఇక్కడో కొందరు డీసెంట్ పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. టిఆర్ఎస్ లో మాత్రం డీసెంట్ పొలిటీషియన్లను బూతద్దం పెట్టి వెతకాల్సిందే. ఎందుకంటే ఆవు చేనులో మేస్తే దూడ గెట్టు మీద మేస్తదా అన్నట్లు పార్టీ అధినేత అస్తమానం నోటికి పని చెబుతూ ఎవరిని పడితే వారిని కడిగిపారేస్తుంటే మిగతా నాయకులు, కార్యకర్తలు డీసెంట్ భాషలో మాట్లాడే పరిస్థితి ఉండదనే చెప్పాలి. అయినా కొందరు మాత్రం తమ భాషలో ఎక్కడా బూతు లేకుండా జాగ్రత్తపడే వారున్నారు. వారిలో ఫైనాన్స్ మినిస్టర్ ఈటల రాజేందర్ ఒకరు. టిఆర్ఎస్ పుట్టుక నుంచి నేటి వరకు ఈటల రాజేందర్ నోటితో ఏనాడూ బూతు కూతలు కూసిన పరిస్థితి లేదు. 

కరుకు భాష వాడుకలో తండ్రి బాటలోనే కేటిఆర్

అయితే టిఆర్ఎస్ పార్టీలో బిసి నేతగా వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్న ఈటల రాజేందర్ తాజాగా తన నియోజవర్గం హుజూరాబాద్ లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఎన్నడూ లేనిది ఈటలను గ్రామాల్లో జనాలు నిలదీసే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కాంగ్రెస్ వారే కావాలని చేయిస్తున్నారనంటూ టిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కానీ ఆ స్థాయికి అయినా ఈటలను నిలదీసే పరిస్థితి రావడం కూడా ఆలోచించాల్సిన పరిస్థితే కదా అన్నది టిఆర్ఎస్ నేతలు గుర్తెరగాల్సి ఉంది.

తాజాగా ఈటల మెడకు మాజీ డ్రైవర్ మల్లేష్ యాదవ్ వివాదం చుట్టుకుంది. మల్లేష్ యాదవ్ సుదీర్ఘ కాలం పాటు ఈటల రాజేందర్ వద్ద డ్రైవర్ గా పనిచేశారు. ఈటలకు నమ్మిన బంటుగా ఉండేవాడు. అయితే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో అసెంబ్లీలో ఈటల డ్రైవర్ మల్లేష్ యాదవ్ అప్పటి లోక్ సత్తా పార్టీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ మీద చేయి చేసుకున్నాడు. దీంతో అప్పటి ఉమ్మడి రాష్ట్ర స్పీకర్ నాదెండ్ల మనోహర్ సీరియస్ అయ్యారు. డ్రైవర్ మల్లేష్ ను రిమాండ్ కు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో 45 రోజులపాటు ఈటల డ్రైవర్ జైల్లో ఉన్నాడు.

నోటికి పని చెప్పని టిఆర్ఎస్ నాయకుడు ఈటల రాజేందర్

తదనంతరం పార్టీ ఆదేశాల మేరకు ఈటల తన డ్రైవర్ మల్లేష్ ను విధుల్లోంచి తొలగించారు. తొలగించేందుకు ఈటలకు మనసొప్పకపోయినా వివాదంలో ఉన్న వ్యక్తిని డ్రైవర్ గా పెట్టుకుంటే సమస్యలు వస్తాయని పార్టీ నాయకత్వం సూచనతో మల్లేష్ కు జైలు నుంచి వచ్చిన తర్వాత తిరిగి ఉద్యోగం ఇవ్వలేదని తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈటల రాజేందర్ డ్రైవర్ మీడియా ముందుకు వచ్చారు. ఏకంగా సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి ఈటలను కడిగి పారేశారు. తనను ఈటల మోసం చేసినట్లు ఆరోపించడమే కాదు తనకు రావాల్సిన డబ్బు ఇవ్వలేదని తీవ్రమైన విమర్శలు గుప్పించాడు.  అంతేకాదు ఈ ఎన్నికల్లో ఈటల మీద ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఈటలను ఓడిస్తానంటూ హెచ్చరికలు జారీ చేశాడు.

ఈ వివాదం చెలరేగడంతో ఈటల డ్రైవర్ మల్లేష్ యాదవ్ ను కాంగ్రెస్ పార్టీ వెనుక ఉండి ప్రేరేపించిందంటూ ఈటల వర్గం నేతలు అన్నారు. హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీలో పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్దమ్మ కొడుకు పాడి కౌషిక్ రెడ్డి కోసమే ఉత్తమ్ ఈ రకమైన డ్రామాలు చేయిస్తున్నారంటూ ఓయూ జెఎసి నేత బాలరాజు యాదవ్ ఆరోపించారు. ఇందులో రేవంత్ రెడ్డి కుట్ర కూడా ఉందని బాలరాజు యాదవ్ విమర్శించారు. రెడ్డి నేతలంతా కలిసి బిసి నాయకుడైన ఈటల రాజేందర్ మీద జిమ్మిక్కులు చేస్తే సహించబోమని హెచ్చరించారు.

సవాల్ చేసినట్లుగానే ఈటల డ్రైవర్ మల్లేష్ హుజూరాబాద్ లో పోటీకి దిగారు. నామినేషన్ కూడా వేశారు. అయితే మల్లేష్ నామినేషన్ స్క్రూట్నిలో నిలబడలేదు. సరైన సమాచారంతో అఫిడవిట్ సమర్పించకపోవడంతో మల్లేష్ యాదవ్ నామినేషన్ ను రిటర్నింగ్ అధికారులు రిజెక్ట్ చేశారు. ఇక పోటీ చేసి హల్ చల్ చేయాలనుకున్న మల్లేష్ యాదవ్ నామినేషన్ రిజెక్ట్ కావడంతో ఈ వివాదానికి తెర పడినట్లేనా లేదంటే ? ఈటల ప్రత్యర్థులకు మల్లేష్ యాదవ్ ప్రచారం చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.

మల్లేష్ యాదవ్ ఆరోపణలపై మంత్రి ఈటల రాజేందర్ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉద్యమ సమయంలో తన సొంత డబ్బు ఖర్చు పెట్టిన సందర్భాలున్నాయని అలాంటిది మల్లేష్ డబ్బులు వాడుకున్నట్లు ఆరోపణలు బాధించాయని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయారట. ఎన్నడూ లేనిది మల్లేష్ ఒక్కసారిగా తెర మీదకు రావడమంటే వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారేమో అని ఈటల అనుమానం వ్యక్తం చేశారని చెబుతున్నారు. ప్రత్యర్థులనైనా పల్లెత్తు మాట అనని తన మీద లేనిపోని అపవాదులు మోపడం బాధించిందని ఆవేదన వెలిబుచ్చారని ఆయన సన్నిహితులు తెలిపారు.

ఈటల రాజేందర్ డ్రైవర్ మల్లేష్ యాదవ్

మరి ఈ వివాదం ఇప్పుడు ఎటు టర్న్ తీసుకుంటుందో అన్నది చూడాలి.