కేసీఆర్ పాలనను అంతమొందించే రోజు వచ్చింది..  కొడంగల్ లో రాహుల్

కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సభలో  ప్రసంగించిన రాహుల్ ఏమన్నారంటే…  

“17,000 కోట్ల మిగులు బడ్జెట్ తో తెలంగాణ ఏర్పడింది. రాష్ట్ర బడ్జెట్ రూ. 2 లక్షలు దాటింది కానీ కేసీఆర్ పుణ్యమా అని రాష్ట్రంలోని ప్రతి వ్యక్తిపై రూ. 60 వేల అప్పు మిగిలింది.  ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తయారు చేశారు.  ఇప్పుడు వీస్తున్న గాలి కాంగ్రెస్ గాలి.. ఇది కేసీఆర్ ను ఓడించే గాలి.  లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన కేసీఆర్… నాలుగున్నరేళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. దళితులు, గిరిజనులు, రైతులు, యువతను మోసం చేశారు. 22 లక్షల ఇళ్లను పేదలకు ఇస్తామని వంచించారు.  

దళితులకు, గిరిజనులు కు భూములు ఇస్తామని చెప్పి… కేసీఆర్ మాట తప్పారు. ప్రజాకూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే… భూములు, ఇళ్లు ఇస్తాం.  ప్రతి కుటుంబంపై రూ. 2 లక్షల అప్పు మోపిన కేసీఆర్… తన ఆదాయాన్ని మాత్రం 400 రెట్లు పెంచుకున్నారు.  కాకతీయ, మిషన్ బగీరథ పథకాల్లో అంతులేని అవినీతి జరిగింది.  రాష్ట్రంలోని అధికారం మొత్తం ఇప్పుడు ఒక కుటుంబం చేతిలో ఉంది. మహాకూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని అందరికీ పంచుతాం”  అని రాహుల్ తెలిపారు. 

రేవంత్ రెడ్డి ఏమన్నారంటే…

“1978వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో ఇందిరాగాంధీ కోస్గి వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తరువాత 40 సంవత్సరాలకు అదే పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఈ ప్రాంతానికి రావడంతో కోస్గి పులకిస్తోంది. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ 175 స్థానాల్లో విజయం సాధించింది. ఈ దఫా కూడా అటువంటి విజయం ఖాయం. ఈ ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజా కూటమి విజయం ఖాయమని, కేసీఆర్ కు భంగపాటు తప్పదని  హెచ్చరిస్తున్నాను. రాహుల్ రాకతో మన గెలుపు ఖాయమైంది.

తొమ్మిది సంవత్సరాల క్రితం తనకు ఇక్కడ అడ్రస్ కూడా లేదని, బీ-ఫామ్ తీసుకుని వచ్చి నామినేషన్ వేశాను.  7 వేల మెజారిటీతో గెలిపించిన కొడంగల్ ప్రజలను తాను ఎన్నడూ మరువబోను. 2014 ఎన్నికల్లో తనను 15 వేల మెజారిటీతో ఆశీర్వదించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ ఎన్నికల్లో మరింత మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించాలని కొడంగల్ ప్రజలను కోరుతున్నాను.

కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగా ప్రజా కూటమి ఏర్పడింది.  రాష్ట్రంలో మువ్వన్నెల జెండాను ఎగురవేసే సమయం ఎంతో దూరంలో లేదు. కేసీఆర్ కుటుంబ పాలనకు, అవినీతికి, దోపిడీకి వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని చూపించాల్సిన సమయం వచ్చింది. తనపై కక్ష కట్టిన కేసీఆర్, నాలుగేళ్ల వ్యవధిలో ఎన్నో కేసులు పెట్టించారు. జైలుకు పంపించారు. కేసీఆర్ ను బంగాళాఖాతంలో కలిపేంత వరకూ పోరాటం చేస్తాను.

దొరపాలనకు విముక్తి అయ్యే రోజు దగ్గరలోనే ఉంది. ఇచ్చిన ఏ హామీని కూడా అమలు పరచ చేతకానీ సీఎం కేసీఆర్. ఓటమి భయం పుట్టి 9 నెలల ముందే ఎన్నికలకు పారిపోయిండు. పూర్తి కాలం పరిపాలించ చేతకానోడు మళ్లేమి పరిపాలిస్తడు. తన కొడుకును యువరాజును చేయడానికి తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్న దౌర్భాగ్యుడు కేసీఆర్. డిసెంబర్ 11 తర్వాత కేసీఆర్ ఫాం హౌజ్ లో పండటం ఖాయం” అంటూ రేవంత్ ప్రసంగించారు.

ఆయన తర్వాత ప్రొఫేసర్ కోదండరాం మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే…

“మహబూబ్ నగర్ జిల్లాలో వెనుకబడిన ప్రాంతం కొడంగల్.  జిల్లాలో ఏ పార్టీకి సరైన నాయకత్వం లేని వేళ ఓ యువకుడిగా రేవంత్ రెడ్డి వచ్చాడు.  రాజకీయాల్లో రాణించి, ఇక్కడి ప్రజల సమస్యలను తీర్చారు. ఓ కొదమ సింహంలా ప్రభుత్వాలతో పోరాడి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.

తెలంగాణ రాష్ట్రం రావాలని పోరాటం చేసిన నేతల్లో రేవంత్ కూడా ఉన్నారు. కృష్ణా నదీ జలాలను ఇక్కడికి తెస్తానని టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేరలేదు.  ఇక్కడ కురిసే ప్రతి వర్షం చుక్కా కృష్ణానదిలోకే వెళుతుంది. దానిని చాలా సులభంగా కొడంగల్ తరలించవచ్చు కానీ పాలకులకు ఆ ఆలోచన రాలేదు.  

ఇక్కడి పొలాలు బీడు భూములుగా కనిపిస్తున్నాయి. వస్తాయనుకున్న నీరు రావడం లేదు. ముక్కెక్కడుందంటే చుట్టూ తిప్పి చూపించినట్టుగా కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఈ ప్రాంతానికి దగ్గరగా ఉన్న జూరాలను వదిలి శ్రీశైలం నుంచి నీటిని మళ్లించడం ఏంటి. కేసీఆర్ మాటలు నమ్మేందుకు చెవుల్లో పూలు పెట్టుకుని లేము. ఈ ప్రాంత ప్రజలు ఎంతో పట్టుదల ఉన్నవారు. ఇక్కడికి నీరు తెప్పించేవరకూ మీరు విశ్రమించ వద్దు. కాంట్రాక్టర్ల జేబులను నింపేందుకు కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అది తెలిసిన తరువాతనే కేసీఆర్ ను వ్యతిరేకించాము. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించాల్సిందే”  అని కోదండరాం ప్రసంగించారు.