టిఆర్ఎస్ పుట్టా మధుకు అక్రమ ఆస్తులున్నాయా?

నిత్యం వివాదాల్లో నిలిచే ఎమ్మెల్యేల జాబితాలో ముందువరుసలో ఉంటారు మంథని టిఆర్ఎస్ ఎమ్మెల్యే పుట్టా మధు. నియోజకవర్గంలో ప్రతినిత్యం ఏదో ఒక వివాదం పుట్టా మధు కేంద్రంగా సాగుతూనే ఉంటది. తాజాగా పుట్టా మధు కోట్లకు పడగలెత్తారని ఆరోపిస్తూ ఆయన ఆస్తులపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. ఈ సంఘటన టిఆర్ఎస్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీనిపై హైకోర్టు స్పందించింది.

మంథని ఎమ్మెల్యే పుట్టా మధు, అతని కుటుంబసభ్యుల ఆస్తులపై విచారణ జరపాలంటూ మంథని మాజీ ఉప సర్పంచ్ ఇనుముల సతీష్ ఉమ్మడి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పుట్టా మధు ఫ్యామిలీ సుమారు 176 కోట్ల విలువ చేసే అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడని పిటిషనర్ పేర్కొన్నారు. పుట్టా మధు అక్రమాస్తులపై సిబిఐ విచారణ జరిపించాలని హైకోర్టును అభ్యర్థించారు పిటిషనర్.

పుట్టా మధు తల్లి పుట్టా లింగమ్మ పేరుతో నెలకొల్పిన పుట్టా లింగమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ కు 12ఎ, 80 (జి) కింద పర్మిషన్ ఇవ్వరాదని కూడా పిటిషన్ లో పేర్కన్నారు.

ఈ విషయంలో హైకోర్టు విచారించింది. దీనిపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశారా అని హైకోర్టు పిటిషనర్ తరుపు న్యాయవాదిని ప్రశ్నించింది. దానికి న్యాయవాది స్పందిస్తూ ఇప్పటికే సిబిఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేసినట్లు పిటిషనర్ తెలిపారు. అయితే దర్యాప్తు సంస్థలు స్పందిస్తాయేమో వేచి చూడాలని హైకోర్టు సూచించింది.

పదిరోజుల వరకు ఆగి ఆ తర్వాత దర్యాప్తు సంస్థలు స్పందించకపోతే మళ్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేయాలని సూచించింది. దీంతో పిటిషనర్ తన పిల్ ను వాసప్ తీసుకున్నారు.

మొత్తానికి పుట్టా మధు ఆస్తుల వ్యవహారం ఎటు దారి తీస్తుందోనన్నది పదిరోజుల్లో తేలనుంది.