టీఆరెఎస్ నేతలను హడలెత్తిస్తున్న ఫోన్ కాల్స్.

గులాబీ నేతలకు ఫోన్ భయం పట్టుకుంది. ఇటీవలే మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక భూవివాదానికి సంబంధించి ఫోన్ కాల్ లో సీఐని బెదిరిస్తున్న ఆడియో సంభాషణ లీక్ అవడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలా ఎమ్మెల్యేలు బెదింపులు, హెచ్చరికలు చేసిన కాల్ రికార్డ్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తుండటంతో ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణలోకి తీసుకుంది టీఆరెఎస్ అధిష్టానం. ఎలెక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో ఇటువంటి లీకులు కొనసాగితే ఇవన్నీ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని భావించి గులాబీ నేతలను జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తోంది. సీఎం కేసీఆర్ కూడా కొందరు నేతల పోకడలను తగ్గించుకోమని కఠువుగానే మందలించారని తెలుస్తోంది.

కాల్ రికార్డులను అరికట్టేందుకు టీఆరెఎస్ అధిష్టానం దృష్టి సారించిందని తెలుస్తోంది. ముఖ్య విషయాలు మాట్లాడాలంటే ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఫోన్ ద్వారా కాకుండా అధికారులను స్వయంగా కలిసి మాట్లాడమని తెలంగాణ భావం అధికారుల నుండి ఆదేశాలు వెళ్లాయి. ప్రోటోకాల్ సమస్యలు వస్తే పీఏలను పంపి పనులు చేయించుకోమని సూచించినట్లు సమాచారం. నాలుగేళ్లుగా గులాబీ నేతలు ఓవర్ యాక్షన్ చేసిన ఆడియో టేపులు, వీడియోలు బయటకు రావటం అధికార పార్టీకి చికాకు తెప్పించింది కానీ తెలివిగా వాటిని పక్కదోవ పట్టించింది.

రానున్నది ఎన్నికల సమయం. ఇలాంటప్పుడు ఈ ఆడియో టేపులు, వీడియోలు లీక్ అయితే పార్టీ పట్ల ప్రజల్లో విముఖత పెరిగే అవకాశం ఉంది. సీఎం నేతృత్వంలో పని చేస్తున్న పార్టీ రాజకీయ బృందం నేతలను అప్రమత్తం చేస్తూ జాగ్రత్తగా ఉండమని ఆదేశాలు పంపుతోంది. పార్టీకి అప్రతిష్ట తెచ్చే పనులకు దూరంగా ఉండమని హెచ్చరిస్తోంది. గతంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ, తాజాగా బెల్లంపల్లి ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి ఫోన్ రికార్డ్స్ లో చిక్కి అల్లాడారు. మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యవహారం సీఎం దృష్టికి వెళ్లడంతో దీనిపై పోలీస్ స్టేషన్లో చేసు నమోదు చేశారు. తమ గుట్టు బట్టబయలు చేస్తున్న ఫోన్ రికార్డ్స్ వల్ల ఫోన్ అంటేనే భయపడుతున్నారు టీఆరెఎస్ నేతలు. టెక్నాలజీ విపరీతంగా పెరిగిన ఈరోజుల్లో ఫోన్ పరిమితుల్లో వాడమని తమ నేతలను ఆదేశిస్తోంది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జరగబోయే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది టీఆరెఎస్ అధిష్టానం.