కలెక్టర్ దేవసేన సీరియస్ : ఇద్దరు అధికారులపై వేటు

ఈమె పేరు దేవసేన. ఈమె ఐఎఎస్ ఆఫీసర్. నిఖార్సైన ఐఎఎస్ ఆఫీసర్లలో ఈమె ఒకరు. ఈమె ఎక్కడున్నా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే. పనిచేయని వాళ్లకు ఒంట్లో ఒనుకు పెట్టాల్సిందే. ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడాలేదు. అన్యాయం చేసేవాళ్లను చీల్చి చెండాడే స్వభావం ఈ దేవసేనది. 

మొన్నటికి మొన్న జనగామ ఎమ్మెల్యేకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అవినీతి అక్రమాలను బట్టబయలు చేశారు. ఆయన చేసిన చెరువు కబ్జాలను అడ్డుకున్నారు. ఎన్ని వత్తిళ్లు వచ్చినా బెదరలేదు. కానీ అనివార్యంగా ఆమెను జనగామ నుంచి సర్కారు బదిలీ చేసింది. ఎంతైనా పొలిటీషియన్స్ తో పెట్టుకుంటే ఎంత పెద్ద అధికారి అయినా నిలబడతారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగింది. ఆమెను జనగామ నుంచి పెద్దపల్లికి బదిలీ చేసింది తెలంగాణ సర్కారు.

దేవసేన, పెద్దపల్లి కలెక్టర్

ఇంతకాలం పెద్ద పల్లిలో సేవలందిస్తున్న దేవసేన గురువారం కొరడా ఝులిపించారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఇద్దరు విఆర్వోలపై వేటు వేసి సంచలనం రేపారు. పెద్దపల్లి జిల్లాలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇద్దరు విఆర్వోలను జిల్లా పాలనాధికారి శ్రీదేవసేన గురువారం సస్పేండ్ చేసారు. పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామ విఆర్వో ఈ.ప్రభాకర్, మంథని మండల మంథని గ్రామ విఆర్వో రాజమల్లు లను విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో కలెక్టర్ సస్పెండ్ చేసారు.

ఇద్దరు విఆర్వోలు తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించకుండా అలసత్వం వహించడం, విధులకు మధ్యం సేవించి హాజరు కావడం జరిగిందని, వారి పనితీరు మార్చుకోవాల్సిందిగా పలు మార్లు తహసిల్దార్లు హెచ్చరించినప్పటికి సదరు విఆర్వోల ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు, కావున పెద్దపల్లి, మంథని మండలాల తహసిల్దార్లు విఆర్వోల పట్ల చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ కు నివేదిక అందించారు, ఆ నివేదికను ఆధారం చేసుకొని జిల్లా కలెక్టర్ విధులను నిర్లక్ష్యం చేస్తున్న వారిని సస్పెండ్ చేసారు.

ఈ మేరకు పెద్దపల్లి జిల్లా పౌర సంబంధాల అధికారి ఒక పత్రికా ప్రకటనలో పై విషయం వెల్లడించారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలోనే కాకుండా తెలంగాణలో సంచలనం గా మారింది.