ఛీ… ఇదేం సక్కదనం, పిసిసి చీఫ్ ఉత్తమ్ సీరియస్

శాసనమండలి వేదికగా టిఆర్ఎస్ చేస్తున్న కార్యకలాపాలపై తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఛీ.. ఇదేం సక్కదనం అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విలువలు దిగజార్చి టిఆర్ఎస్ పార్టీ వక్రమార్గంలో నడుస్తోందని మండిపడ్డారు. శాసనమండలి ఛైర్మన్ సీటుకు ఉన్న గౌరవాన్ని టిఆర్ఎస్ చెడగొడుతోందని మండిపడ్డారు. శాసనమండలి ఛైర్మన్ మీద వత్తిడి తెచ్చేవారెవరో బయటకు రావాలన్నారు.

శుక్రవారం నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ ను కలిసి తాము టిఆర్ఎస్ ఎల్పీలో కలిసిపోతామని లేఖ ఇచ్చారు. తాము సిఎల్పీ సమావేశం జరుపుకున్నామని, సిఎల్పీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, ప్రభాకర్ రావు, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, సంతోష్ కుమార్ లేఖ ఇచ్చారు.

అయితే ఈ లేఖ ఇచ్చిన వెంటనే పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనమండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ ఛైర్మన్ ను కలిశారు. ఆ నలుగురితో సిఎల్పీ సమావేశం జరగనే జరగలేదని తేల్చి చెప్పారు. అయినా అందులో ఇద్దరు సభ్యులపై అనర్హత వేటు వేయాలని తాము ఎప్పటి నుంచో ఛైర్మన్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. తాజాగా మరోసారి ఆ నలుగురి మద వేటు వేయాలని రాతపూర్వక ఫిర్యాదు చేశారు.

2016లోనే తాము అనర్హత వేటు కోసం ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఛైర్మన్ స్వామి గౌడ్ ఆ విషయాన్ని తొక్కి పెట్టారని, కానీ టిఆర్ఎస్ పార్టీ అనర్హత పిటిషన్ ఇవ్వగానే 24 గంటల్లోనే స్పందించి నోటీసులు జారీ చేశారని ఇదెక్కడి రూల్ అని ఉత్తమ్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి నీచమైన పనులు చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం అందరి బాధ్యత అన్నారు. ఛైర్మన్ కుర్చీలో ఎవరున్నా మనుషులు ముఖ్యం కాదని, వ్యవస్థ ముఖ్యమని తెలిపారు. 

మీడియా పాయింట్ లో ఉత్తమ్, షబ్బీర్ అలీ మాట్లాడుతూ టిఆర్ఎస్ తీరుపై మండిపడ్డారు. తెలంగాన సమాజం అసహ్యించుకునేలా టిఆర్ఎస్ వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి ప్రభాకర్ రావు, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి సభ్యత్వాలు రద్దు చేయాలని తాము ఎప్పుడో ఛైర్మన్ ను కోరామన్నారు. కానీ వారిద్దరూ ఆకుల లలిత, సంతోష్ కుమార్ తో కలిసి సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

తమ పార్టీలో లేని వారు సిఎల్పీ సమావేశం పెట్టే అధికారం లేదన్నారు. స్వామి గౌడ్ కు శాసన మండలి గౌరవం కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. తాము ముందే దామోదర్ రెడ్డి, ప్రభాకర్ ల పై చర్యలు తీసుకోవాలని కోరినప్పటికీ చర్యలు తీసుకోలేదని చెప్పారు. పార్టీ అధ్యక్షుడి అనుమతి లేనిదే సీఎల్పీ సమావేశం నిర్వహించే అధికారం ఎవరికి లేదున్నారు. నలుగురు టీఆర్ఎస్  సభ్యులు పార్టీ మారారని వెంటనే నోటీసులు జారీ చేసిన చైర్మన్ స్వామి గౌడ్ ఎందుకు కాంగ్రెస్ నోటీసులపై చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దీని పై స్పందించక పోతే నషనల్ ఇష్యూ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. డిఫెక్ట్ అయిన వారు చేసే తీర్మానం ఎలా చెలుబాటు అవుతుందని ఛైర్మన్ స్వామి గౌడ్ ను నిలదీశారు.