తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ కు పెద్ద దెబ్బ

తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ సామ దాన బేద దండోపాయాలతో ప్రతిపక్ష పార్టీలను చిత్తు చేస్తున్నది. ఇక ఎంపైర్ గా ఉండాల్సిన రాజ్యాంగ రక్షకులు టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కనుసన్నల్లో పనిచేస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో ప్రతిక్షాలు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఉంది.  దీంతో తెలంగాణలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కకావికలం అయిపోతున్నది. టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ వేసిన స్కెచ్ తో తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్షం అనేదే లేకుండాపోయింది. నిన్నటి వరకు తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న షబ్బీర్ అలీ ఇప్పుడు సాధారణ ఎమ్మెల్సీగా మారిపోయారు. ఆయనకున్న ప్రతిపక్ష నేత హోదాను రద్దు చేస్తూ మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై శుక్రవారం మధ్యాహ్నం శాసనసభ సెక్రటరీ డాక్టర్ వి.నర్సింహ్మాచార్యులు అసెంబ్లీ రాజపత్రం విడుదల చేశారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష్ హోదాను కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. పూర్తి వివరాలు చదవండి.

 

తెలంగాణ శాసనమండలి వ్యవహారం గులాబీ బాస్ కేసిఆర్ కు చిరాకు తెప్పించినట్లున్నాయి. వాటిని సెట్ రైట్ చేయడం కోసం ఆయన ప్రత్యేక శ్రద్ద చూపారు. ఒకవైపు ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీస్తూనే మరోవైపు ప్రత్యర్థి శిబిరంపై అనూహ్యమైన రీతిలో దాడికి దిగారు. దీంతో శాసనమండలిలో ప్రతిపక్షం కకావికలం అయిపోయింది. ప్రతిపక్ష హోదా రద్దు కాబడింది. ఇంతకూ కేసిఆర్ అంతగా గొట్టు నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్నదానికి ఒక లెక్క ఉంది.

ముందస్తు ఎన్నికల ముందు నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్సీలు గోడ దూకి కాంగ్రెస్ కు జంప్ చేశారు. వారిలో యాదవ రెడ్డి, భూపతిరెడ్డి, కొండా మురళి, రాములు నాయక్ ఉన్నారు. వీరు పార్టీ నుంచి వెళ్లడమే కాకుండా కొందరు కాంగ్రెస్ తరుపున పోటీ చేశారు. కొందరు ప్రచారం చేశారు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత కొండా మురళి సతీమణి కొండా సురేఖ ఓటమిపాలయ్యారు. భూపతిరెడ్డి నిజామాబాద్ జిల్లాలో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. యాదవ రెడ్డి పోటీ చేయకపోయినా ప్రత్యర్థి శిబిరంలోనే ఉన్నారు. రాములు నాయక్ పోటీ చేయలేదు కానీ సీరియస్ గా టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఈ వ్యవహారం కేసిఆర్ కు ఏమాత్రం నచ్చలేదు. 

షబ్బీర్ అలీ, మాజీ కౌన్సిల్ ప్రతిపక్ష నేత

అందుకే ఒకవైపు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్ కుమార్ ను టిఆర్ఎస్ వైపు మలిపారు. అంతకుముందే ఇద్దరు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ప్రభాకర్ రావు లతో కలిసి నలుగురు తమను టిఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయాలంటూ ఛైర్మన్ కు లెటర్ ఇచ్చారు. దీంతో ఛైర్మన్ వారికి అనుకూలంగా, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిర్ణయాన్ని తీసుకున్నారు. 24 గంటల్లోనే వారి విన్నపాన్ని మన్నించడంతోపాటు వారు టిఆర్ఎస్ లో విలీనం అయినట్లు గెజిట్ విడుదల చేశారు. ఇక టిఆర్ఎస్ తిరుగుబాటు ఎమ్మెల్సీలకు నోటీసులు జారీ అయ్యాయి. వారంలోగా సమాధానం చెప్పాలని మండలి ఛైర్మన్ నోటీసులు జారీ చేశారు.

కొండా మురళి, మాజీ ఎమ్మెల్సీ

ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ తిరుగుబాటు ఎమ్మెల్సీగా ఉన్న కొండా మురళి తన పదవికి రాజీనామా చేశారు. శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ కు రాజీనామా లేఖ ఇచ్చారు. దాన్ని వెనువెంటనే ఛైర్మన్ ఆమోదించారు. మరో ముగ్గురి విషయం తేలాల్సి ఉంది. పనిలో పనిగా శాసనమండలిలో ప్రతిపక్ష నేత హోదాలో షబ్బీర్ అలీ కంటిలో నలుసులా మరాడని కేసిఆర్ భావించారు. అందుకే టిఆర్ఎస్ ఎల్పీ లో కాంగ్రెస్ పక్షాన్ని విలీనం ప్రక్రియ చేపట్టి ఆయన హోదాను అధికారిక గెజిట్ ద్వారా రద్దయ్యేలా స్కెచ్ వేశారు. ఇప్పుడు మరో మూడు నెలలు మాత్రం షబ్బీర్ అలీ శాసనమండలిలో మామూలు ఎమ్మెల్సీగా కొనసాగాల్సి ఉంటుంది. ఆయనకు ఇచ్చిన సెక్యూరిటీ ప్రొటోకాల్ రద్దు కాబడ్డాయి.

తెలంగాణ శాసనమండలి చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి ఇదొక కోలుకోలేని దెబ్బగా చెప్పవచ్చు.