బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు బెదిరింపులు.. ?

కొన్ని వారాల క్రితం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మీడియా సహాయంతో నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి బయట ప్రపంచానికి తెలిసేలా చేశారనే సంగతి తెలిసిందే. అయితే ఆర్‌జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీ బాసర విద్యార్థులకు ప్రస్తుతం కఠిన ఆంక్షలు అమలవుతున్నాయని సమాచారం అందుతోంది. ట్రిపుల్ ఐటీ అధికారులు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల విషయంలో విద్యార్థులు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.

యూనివర్సిటీలో ప్రస్తుతం సెల్ ఫోన్ వినియోగంపై ఆంక్షలు విధించారని బోగట్టా. ట్రిపుల్ ఐటీ బాసర డైరెక్టర్ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయని సమాచారం అందుతోంది. తరగతి గదులు, ల్యాబ్‌ లతో పాటు పరిపాలన భవనంలో సెల్ ఫోన్ల వినియోగాన్ని నిషేధించారని విద్యార్థులు చెబుతున్నారు. తాజాగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తమకు వసతులు కల్పించాలని ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.

విద్యార్థులు 7 రోజుల పాటు నిరసన తెలియజేయగా ఆ సమయంలో జరిగిన విషయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. విద్యార్థులు ఆందోళనకు దిగినా అక్కడ జరిగిన విషయాలు బయటకు తెలియకుండా ఉండాలనే ఆలోచనతో డైరెక్టర్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు తమ డిమాండ్లను పరిష్కరించకుండా ఇలా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు మీడియాకు కూడా యూనివర్సిటీలో ఆంక్షలు కొనసాగుతుండటం గమనార్హం. యూనివర్సిటీ లోపలికి మీడియాను అనుమతించడానికి అధికారులు నిరాకరిస్తున్నారని సమాచారం అందుతోంది. బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలు ఎదురైనా ఆ సమస్యలను బయటకు వెల్లడించరాదని ఆదేశాలు జారీ అయ్యాయని తెలుస్తోంది. బాసర అధికారులు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుండటం గమనార్హం. విద్యార్థులకు ఇచ్చిన హామీలలో ఒకటి రెండు హామీలు మాత్రమే నెరవేరాయని సమాచారం అందుతోంది.