టిఆర్ఎస్ వేముల వీరేశం ను ఓడగొట్టింది మేమే (వీడియో)

తెలంగాణలో మొన్న జరిగిన ముందస్తు ఎన్నికల్లో కారు ప్రభంజనం సాగింది. కానీ కీలకమైన కొన్ని స్థానాల్లో టిఆర్ఎస్ ఓటమి పాలైంది. నలుగురు మంత్రులు మట్టికరిచారు. స్పీకర్ ఓడిపోయారు. కీలకమైన ఎమ్మెల్యేలు సైతం ఓటమిపాలయ్యారు. అందులో నకిరేకల్ నియోజకవర్గంలో వేముల వీరేశం ఓడిపోవడం జరిగింది.

టిఆర్ఎస్ ఓడిపోయిన స్థానాల్లో ప్రత్యర్థులు ఓడించారనడం కంటే సొంత పార్టీ నేతలే ఓడించారనే వాదన బలంగా వినబడుతున్నది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తమ పార్టీ నేతలే తనను ఓడించారని బహిరంగ ప్రకటన చేశారు కూడా. ఈ నేపథ్యంలో నకిరేకల్ లో వేముల వీరేశం ను కూడా సొంత పార్టీ నేతలు ఓడించారన్న విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు చదవండి.

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేమల వీరేశం గడిచిన నాలుగున్నరేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచారు. నియోజకవర్గంలోనే కాకుండా ఆయన మీద రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆరోపణలున్నాయి. నల్లగొండ మున్సిపల్ ఛైర్ పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో వీరేశం మీద విమర్శలు వచ్చాయి. అలాగే మిర్యాలగూడలో సంచలనం రేపిన అమృత భర్త ప్రణయ్ హత్య వివాదంలో కూడా వేముల వీరేశం పేరు తెరమీదకు వచ్చింది. ఇలా అనే ఆరోపణలుండడమే కాకుండా కోమటిరెడ్డి సోదరులైతే వేముల వీరేశం మీద తీవ్రమైన విమర్శలు గుప్పించారు.

ముందస్తు ఎన్నికల్లో వేముల వీరేశం ప్రత్యర్థి చిరుమర్తి లింగయ్య చేతిలో 8వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఇందులో రెండు బలమైన కారణాలు కనబడుతున్నాయి. అందులో ఒకటి ట్రక్కు గుర్తు కాగా రెండోది సొంత పార్టీ నేతలే వేముల వీరేశం ఓటమికి కారణమయ్యారనేది.

నేతి విద్యాసాగర్, శాసనమండలి వైస్ ఛైర్మన్

ఎన్నికల అనంతర పరిణామాలు చూస్తుంటే సొంత పార్టీ నేతలు వేముల ఓటమికోసం గట్టిగానే పని చేశారని ఆ పార్టీలో టాక్ మొదలైంది. శాసనమండలి వైస్ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ కు వేముల వీరేశం కు నకిరేకల్ లో విబేధాలున్నాయి. దీంతో వేముల వీరేశం ఓటమి కోసం నేతి విద్యాసాగర్ వర్గం క్రియాశీకలంగా పనిచేసిందని వీరేశం వర్గం గతం నుంచీ ఆరోపిస్తూనే ఉన్నది. అయితే దానికి సంబంధించిన ఎవిడెన్స్ రికార్డులు బయటకొచ్చాయి. నేతి విద్యాసాగర్ కీలక అనుచరుడు, నమ్మిన బంటు గా ఉన్న బంటు మహేందర్ ఈ విషయాన్ని బయటపెట్టారు.

బంటు మహేందర్ కేతేపల్లి మండలంలోని చెర్కుపల్లి గ్రామ కీలక నాయకుడు. ఆయన ఇటీవల లీడర్ల మధ్య చిట్ చాట్ లో మాట్లాడుతూ వేముల వీరేశం ను తామే ఓడగొట్టామని మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో అక్కడ ఉన్న ఆయన ప్రత్యర్థి ఒకరు ఆ మాటలను వీడియో తీసి సోషల్ మీడియాలోకి వదిలారు. ఆ వీడియో ఇఫ్పుడు నల్లగొండ టిఆర్ఎస్ వర్గాల్లో కలవరం రేపుతున్నది.

వేముల వీరేశం ను ఓడగొట్టింది మేమే. నేతి విద్యాసాగర్ సార్ ఓడగొట్టమంటేనే ఓడగొట్టాము అని బంటు మహేందర్ మాట్లాడారు. ఈ పరిణామాలపై పార్టీ నాయకత్వం ఏరకమైన చర్యలు తీసుకుంటుందన్నది చూడాల్సి ఉంది.

బంటు మహేందర్ మాట్లాడిన వీడియో కింద ఉంది చూడొచ్చు.