కేసీఆర్ పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ

తెలంగాణలో ఎన్నికల ప్రచార నిమిత్తం నిజామాబాద్ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ నాలుగున్నరేళ్లు జరిగిన టిఆర్ఎస్ పాలన పై ఆయన నిప్పులు చెరిగారు. డోస్ పెంచి కేసీఆర్ పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ తెలుగులో తన ప్రసంగం ప్రారంభించి కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే…

“తెలంగాణ రాష్ట్రం ఎన్నో దశాబ్దాల ప్రజల పోరాట ఫలితంగా ఏర్పడింది. ఎంతో మంది యువకులు బలిదానాలు ఈ ఉద్యమం వెనకున్నాయి. వారి త్యాగాలను ప్రస్తుత పాలకులు వృథా చేస్తున్నారు. దీన్నిక సాగనివ్వబోం. తెలంగాణ ప్రజలు కన్న కలలన్నీ సాకారాం కావడం లేదు. వాటిని నెరవేర్చాల్సిన స్థానంలో ఉన్న ప్రభుత్వం ఆ పని చేయట్లేదు. ఈ ముఖ్యమంత్రి, ఆయన పార్టీ ఎలా ఉందంటే… అన్నీ సగం సగం చేసి వదిలి పెట్టడం తప్పా ఏది కూడా పూర్తిగా చేయచేతకాదు.  చివరకు పదవీ కాలాన్ని కూడా మధ్యలోనే ముగించారు.  

Related image

కేసీఆర్ అంటుంటారు… నేను నిజామాబాద్ ను అభివృద్ధి చేశాను. స్మార్ట్ చేశాను. లండన్ నగరం మాదిరిగా మారుస్తాను అని. కానీ… ఇక్కడ కరెంట్, మంచినీటికి కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నేను ఇప్పుడే హెలికాప్టర్ లో వస్తూ, ఈ చుట్టు పక్కల ప్రాంతాలు ఓసారి చూసి వద్దామని పైలట్ తో చెప్పి మరీ తిరిగొచ్చాను. నాకు ఏమీ కనిపించలేదు. నేను చూసి వచ్చాను. ఇండియాలో అభివృద్ధిలో వెనుకబడి  ఉన్నాయన్న ప్రాంతాలతో పోలిస్తే, మరింతగా నిజామాబాద్ పట్టణ పరిసరాలు అధ్వానంగా కనిపించాయి. లండన్ ఎలా ఉందో ఓ ఐదేళ్లు అక్కడ ఉండి చూసి రండి. ఇక చాల్లే ముఖ్యమంత్రి గారూ…  ఆపండి మీ మాటలు…

తెలంగాణ ఏర్పడి నాలుగున్నరేళ్లు అయింది. ఈ ప్రభుత్వం ఏం పని చేసింది. ఇది ఎన్నికల సమయం. ఈ నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం ఏం చేసిందన్న విషయం పైసాపైసా లెక్క అడగాల్సిన సమయం ఇది. ఇక్కడి యువత, రైతులు, దళితులు, బడుగు బలహీన వర్గాలు, ఆదివాసీల అభ్యున్నతికి ఇచ్చిన హామీల్లో ఏం నెరవేర్చారు? ఏం అభివృద్ధి సాధించారు? వాగ్దానాల అమలులో ప్రభుత్వ వైఫల్యంపై  కేసీఆర్ సమాధానం చెప్పి తీరాల్సిందే.

ఇక్కడి ముఖ్యమంత్రి, ఆయన కుటుంబీకులు ఏమనుకుంటున్నారంటే, దశాబ్దాలుగా ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ప్రభుత్వం స్థాపిస్తుంటే, తాము కూడా ఏమీ చేయకుండానే గెలవచ్చని భావిస్తున్నారు. అది ఎన్నటికీ జరగదు. జరగబోదు. కాంగ్రెస్ వారి అడుగుజాడల్లోనే ఇక్కడి సీఎం నడుస్తున్నారు. ఈ దేశం యువతది. యువత బుద్ధి చెప్పే రోజు ఎంతో దూరంలో లేదు.

 పరిపాలించమని ప్రజలు అవకాశం ఇస్తే, నాలుగున్నరేళ్లకే కేసీఆర్ తన అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వచ్చారు. ఇది కూడా ఒకందుకు మంచిదే. ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వ పీడను వదిలించుకునే అవకాశాన్ని ప్రభుత్వమే స్వయంగా ప్రజలకు దగ్గర చేసింది. కష్టాల నుంచి గట్టెక్కేందుకు కొన్ని నెలల ముందే ప్రజలకు అవకాశం వచ్చి టిఆర్ఎస్ పీడ విరగడమైంది. త్వరలోనే ప్రజలకు టీఆర్ఎస్ పానుంచి విముక్తి కలుగుతుంది.

నాకు గుర్తుంది. ఈ ప్రాంతంలో ఇంటింటికీ మంచినీరు ఇవ్వలేకుంటే, మరోసారి ఓటు అడిగేందుకు నేను రానని కొందరు చెప్పారు. వాళ్లు ఓటు అడిగేందుకు వచ్చారా? లేదా? అంటే అబద్ధపు హామీలు ఇచ్చినట్టా? ఇవ్వనట్టా? ఇటువంటి నేతలకు ఓట్లు అడిగే హక్కుందా? వారిని తరిమికొట్టాలా? వద్దా?. కనీసం ప్రజలకు మంచినీరు ఇవ్వలేని పాలకులు ఎందుకు? ఇటువంటి వ్యక్తికి ప్రభుత్వ పగ్గాలు ఎందుకు?
ప్రభుత్వం పేదల కోసం పనిచేయాలి. ఎవరైనా ధనవంతుడికి అనారోగ్యం వస్తే, పది మంది డాక్టర్లు వస్తారు. ప్రత్యేక విమానాల్లో చికిత్సకు వెళతారు. అదే పేదలైతే ప్రభుత్వ ఆసుపత్రి మినహా మరో మార్గం ఉండదు. ఈ తెలంగాణలో పేదలకు సేవలందించే ఆసుపత్రులు ఎక్కడున్నాయ్? ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. ఇక్కడి మెడికల్ కాలేజీలు సరిగ్గా పనిచేయడం లేదు. అక్కడి విద్యార్థులు కష్టాలు పడుతున్నారు. మామూలు హాస్టల్ లో ఉన్న సౌకర్యాలు కూడా ఇక్కడ లేవు.

ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా ఉన్నారంటే, జ్యోతిష్యం, జాతకాలు, నిమ్మకాయల దండలు, మిరపకాయలను ఎంతో నమ్ముకున్నారు. దేశంలో 50 కోట్ల మందికి ఆరోగ్య భద్రతను కల్పించే ఆరోగ్య పథకాన్ని పేదలకు అందకుండా చేసిన ఘనత ఈయనది. మోదీ పేరున ఉన్న పథకం అమలైతే తనకు నష్టమన్న భావనలో ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారు. ఆయన అభద్రతా భావంతో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణలో పూర్తిగా నిరంకుశ పాలన కొనసాగుతోంది. ఒకప్పుడు తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగితే ఎటువంటి చర్యలు జరిగాయో గుర్తు చేసుకోవాలి. తెలంగాణలో ప్రజల ప్రజాస్వామ్య హక్కులను పూర్తిగా కాలరాస్తున్నారు. దీనిని ఎట్టి పరిస్థితిలో సహించం. తన బతుకు మీదనే నమ్మకం లేక జాతకం చెప్పించుకునే ముఖ్యమంత్రి ఇక తెలంగాణ జాతకాన్ని ఎలా మారుస్తాడు. ప్రజలంతా బిజెపికి పట్టం కట్టాలి. అప్పుడే తెలంగాణలో అభివృద్ది సాద్యమవుతుంది. కేసీఆర్ ను గద్దె దించి తెలంగాణ ప్రజలు విముక్తి పొందాలి. కేసీఆర్ ఆటలు ఇక సాగవు”  అంటూ మోదీ ప్రసంగించారు.

కేసీఆర్ పై  తీవ్ర స్థాయిలో మోదీ విరుచుకుపడి మాట్లాడడంతో బిజెపి శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నాయి. టిఆర్ ఎస్, బిజెపి కుమ్మక్కయ్యాయని వస్తున్న వార్తలను తలదన్నేలా మోదీ ప్రసంగం ఉండడంతో బిజెపి శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు.