బ్రేకింగ్ : సెర్ప్ హెడ్ ఆఫీసులో మెరుపు నిరసన దీక్ష

సెర్ప్ ఉద్యోగుల జెఎసి ఆందోళన మొదలుపెట్టింది. తమ డిమాండ్లపై ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చిన సెర్ప్ ఉద్యోగుల జెఎసి శనివారం ఉదయం హైదరాబాద్ లోని ఒక హోటల్ లో అత్యవసర భేటీ నిర్వహించింది. ఈ సమావేశం జరుగుతున్న సమయంలోనే అసెంబ్లీ రద్దు దిశగా సర్కారు కదులుతుందన సమాచారం వారికి అందింది. దీంతో రేపు ప్రగతి నివేదన సభ కంటే ముందు జరగనున్న కేబినెట్ సమావేశం కంటే ముందే తమ డిమాండ్లు పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.

పే స్కేల్ వర్తింపజేయాలని మెరుపు దీక్షకు కూర్చున్న సెర్ప్ ఉద్యోగులు

ఈ మేరకు సెర్ప్ హెడ్ ఆఫీసులో మెరుపు నిరసన దీక్ష షురూ చేశారు. ఆగస్టు 30వ తేదీలోగానే తమ డిమాండ్లు పరిష్కరించాలని సర్కారును కోరినా ఇంకా తాత్సారం చేస్తున్నారని సెర్ప్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 3వ తేదీ నుంచి కుటుంబాలతో సహా ఆమరణ నిరహార దీక్ష చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.

అసెంబ్లీ రద్దు దిశగా సర్కారు కదిలితే తమ సమస్యలు పెండింగ్ లో పడిపోతాయన్న ఉద్దేశంతో ఉద్యోగులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ నిరసన దీక్ష ద్వారా సర్కారుపై వత్తిడి పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం దీక్ష షురూ అయింది. ఈరోజు మధ్యాహ్నం విద్యుత్ ఉద్యోగులకు సిఎం కేసిఆర్ వరాల జల్లులు కురిపించారు. ముందస్తు ఎన్నికల ఉద్దేశంతోనే విద్యుత్ ఉద్యోగులకు 35 శాతం పిఆర్సి లాంటి అనేక హామీలు ఇచ్చారని సెర్ప్ ఉద్యోగులు భావిస్తున్నారు.

సెర్ప్ హెడ్ ఆఫీసులో మెరుపు దీక్షకు దిగిన సెర్ప్ ఉద్యోగుల జెఎసి

ఈ నేపథ్యంలో తాము గతంలో నెలరోజులపాటు సమ్మె చేసినా, ఇప్పుడు సమ్మె నోటీసు ఇచ్చినా ఎందుకు సర్కారు తాత్సారం చేస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4వేల మంది సెర్ప్ ఉద్యోగుల బాధలు ఈ సర్కారుకు పట్టవా అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యక్షంగా సెర్ప్ ఉద్యోగులు నాలుగు వేల మందే కావొచ్చు కానీ పరోక్షంగా 50 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులను ప్రభావితం చేయగలమని వారు చెబుతున్నారు.

అన్ని శాఖల వారికి వరాలు కురిపిస్తున్న కేసిఆర్ సర్కారు తమపై మాత్రం శీతకన్న వేసిందని లబోదిబోమంటున్నారు. నిరసన దీక్ష ద్వారా సర్కారుపై వత్తిడి తెస్తామని వారు అంటున్నారు. ఇప్పటికైనా పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, శాఖ ఉన్నతాధికారులు తమ సమస్య పరిస్కారం కోసం సిఎం కేసిఆర్ పై వ్తతిడి తీసుకురావాలని కోరుతున్నారు.

డిమాండ్ల పరిష్కారం కోసం సెర్ప్ హెచ్ ఆర్ డైరెక్టర్ బాలయ్య కు వినతిపత్రం అందజేస్తున్న ఉద్యోగుల జెఎసి

సెర్ప్ ప్రధాన కార్యాలయం ఆవరణలో ఉద్యోగుల జెఎసి మెరుపు నిరసన దీక్షకు దిగడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.