తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్.. ఆ అవసరం ఎవరికి.?

KTR as the Chief Minister of Telangana?

వున్నపళంగా తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాజీనామా చేసెయ్యాలేమో.. ఆ స్థానంలో కేటీఆర్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోక తప్పదేమో. ఇదీ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న తాజా చర్చ. పలువురు మంత్రులు, గులాబీ పార్టీకి చెందిన కీలక నేతలు, ‘కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి.? కేటీఆర్‌ని ముఖ్యమంత్రిగా నేను కోరుకుంటున్నాను.. కేసీఆర్, ప్రధాని అవ్వాలి.. జాతీయ రాజకీయాల్లో తెలంగాణ నాయకత్వం చక్రం తిప్పాలి..’ అంటూ వ్యాఖ్యానిస్తుండడం రాజకీయంగా చర్చనీయాంశమయ్యింది. గులాబీ పార్టీలో ఏదో జరుగుతోంది. ఆ ‘ఏదో’ ఏంటన్నదానిపై మళ్ళీ భిన్న వాదనలున్నాయి. కేటీఆర్ ముఖ్యమంత్రి అవడం చారిత్రక అవసరం అన్న భావన గులాబీ పార్టీలో వచ్చిందంటే, కేసీఆర్‌కి వ్యతిరేకంగా ప్రకంపనలు షురూ అయ్యాయంటూ విపక్షాలు కొత్త వాదనల్ని తెరపైకి తెస్తుండడం గమనార్హం.

KTR as the Chief Minister of Telangana?
KTR as the Chief Minister of Telangana?

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల ఫలితాలు.. ఇవన్నీ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారడానికి కారణమయ్యాయి. అయితే, ఇంకో మూడు నాలుగు దఫాలు తెలంగాణకు కేసీఆరే ముఖ్యమంత్రిగా వుండాలని కేటీఆర్ చెబుతున్నారు. తన తండ్రి విషయంలో కేసీఆర్ ఇంత స్పష్టంగా చెబుతున్నప్పటికీ, కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలనే భావన గులాబీ నేతల్లో ఎందుకు పెరుగుతున్నట్లు.? నిజమే, కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పు లేదు. కానీ, కేసీఆర్ వుండగా కేటీఆర్ ముఖ్యమంత్రి అవడమెందుకు.? ఈ ప్రశ్నకు ఓ గులాబీ సీనియర్ నేత మాట్లాడుతూ, కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే, తెలంగాణ ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందుతుందని సమాధానమిచ్చారు. అంటే, కేసీఆర్ హయాంలో అభివృద్ధి కాస్త తక్కువగా జరుగుతోందనా అర్థం.! ఏమో, రాజకీయాల్లో మాట మాటకీ అర్థాలు మారిపోతుంటాయ్ మరి. కేటీఆర్ ముఖ్యమంత్రి అవడం ఎవరికి అవసరమొచ్చిందోగానీ, ఆ కారణంగా కేసీఆర్ కుర్చీ కిందకు నీళ్ళు వచ్చేలానే కనిపిస్తోంది పరిస్థతి. ఆ తర్వాత గులాబీ పార్టీలో చీలిక వస్తేనో!