నేను టిఆర్ఎస్ లో చేరను, కేసిఆర్ నే కాంగ్రెస్ లో చేర్పిస్తా

తెలంగాణ కాంగ్రెస్ నేత, మునుగోడు తాజా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తాను టిఆర్ఎస్ లో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తన మీద కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  తాను చేయి గుర్తు వదిలే ప్రసక్తే లేదని, అవసరమైతే కేసిఆర్ నే కాంగ్రెస్ లోకి రప్పిస్తానని వ్యాఖ్యానించారు. మునుగోడు కృతజ్ఞతా సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఆయన కామెంట్స్ చదవండి.

మునుగోడు నియోజకవర్గం నాకు తల్లి లాంటిది. మునుగోడు లో కాంగ్రెస్ ఎమ్మెల్యే గా నా గెలుపు ప్రజలది. కూటమి కార్యకర్తలది. వెనకబడిన ప్రాంతం మునుగోడు నియోజకవర్గం. ఎమ్మెల్సీ గా ఇంకా మూడేళ్లు సమయమున్నా మునుగోడు ప్రజల కోసం ఎమ్మెల్యే గా పోటీ చేసినాను. నాకోసం నా నియోజకవర్గ వర్గ ప్రజలు ఎవరు హైద్రాబాద్ రావలసిన అవసరం లేదు. మండల పరిధిలోనే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తా. తెలంగాణలో టీఆరెస్ ప్రభుత్వం వున్నా మునుగోడు లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టే లెక్క.

కేసీఆర్ ను కాంగ్రెస్ లో చేర్పిస్తా తప్ప నేను టీఆరెస్ లో చేరను. పార్టీ వదిలి పారిపోయే పిరికిపంద కాదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు లో నా మీద పోటీ చేసి ఓడిపోయిన టీఆర్ఎస్ నాయకుడు ఊరేగింపు చేసుకోవడం సిగ్గుమాలిన చర్య. నేను ఎమ్మెల్యే గా ఉన్నంత వరకు నా కార్యకర్తలపై ఈగ కూడా వాలదు. వచ్చే పంచాయితీ, పార్లమెంట్ ఎన్నికల్లో మా సత్తా చూపిస్తాం. కేసీఆర్ ఎలా గెలిచాడో ఎవరికి అర్థం కావడం లేదు. 

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి పై అనుమానాలున్నాయి. డబ్బు సంచులు, ఈవీఎంలు ట్యాంపరింగు లతో ఎనభై ఎనిమిది స్థానాలు కైవసం చేసుకుని టిఆర్ఎస్ వారు ఆక్రమంగా అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని కార్యకర్తలు అధైర్య పడొద్దు. అందరికి అండగా నేనున్నా. చర్లగూడెం రిజర్వాయర్ భూ నిర్వాసితులకు పదిలక్షల రూపాయల పరిహారం నేను ఇప్పిస్తాను. శివన్న గూడెం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడమే నా ప్రధమ కర్తవ్యం.

టీఆరెస్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చక పోతే మీ భరతం పడుతం. ప్రభుత్వం చేస్తున్న పథకాలు, ప్రాజెక్టులు కాంట్రాక్టర్ ల కోసమే నడిచినవి. గ్రామాల్లో రోడ్లు, రవాణా వ్యవస్థ నిర్వీర్యమయ్యింది. మునుగొడు నియోజకవర్గం లోని ఆరు మండలాలలో మా తల్లి కోమటి రెడ్డి సుశీలమ్మ ట్రస్ట్ పేరు మీద ఆరు అంబులెన్స్ లు ఏర్పాటు చేస్తాం. మునుగోడు వాగు నుండి ఇసుక రవాణా ఆపివేయలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.

రాచకొండ గిరిజన భూములు తిరిగి వారిప్పించేందుకు పోరాటం చేస్తాం. నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రెండు లక్షల మెజార్టీ తో ఎంపీగా గెలుస్తారు. రైతులందరికీ రైతు దినోత్సవం శుభాకాంక్షలు.