కొడంగల్ లో రేవంత్ రెడ్డికి జన సమితి షాక్ (వీడియో)

2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ ను మట్టి కరిపించడమే ఏకైక లక్ష్యంగా ప్రకటించి ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డికి కష్టకాలం వచ్చిపడింది. వరుస ఎదురుదెబ్బలతో రేవంత్ రెడ్డి కకావికలమవుతున్నారు. తాజాగా కొడగంల్ లో కోదండరాం పార్టీకి చెందిన తెలంగాణ జన సమితి నేతలే కూటమికి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ లో చేరిపోయారు. వివరాలివి.

కొడంగల్ టిఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి

మహా కూటమిలో తెలంగాణ జన సమితికి సరైన ప్రాధాన్యత లేదన్న విమర్శలకు బలం చేకూరే సంఘటన కొడంగల్ లో జరిగింది. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన తెలంగాణ జన సమితి నేతలు కూటమికి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ స్థానిక అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. తాము మహా కూటమి నుంచి బయటకు వచ్చినట్లు ప్రకటించారు. తెలంగాణ జన సమితి జెండాలు, కండువాలు కప్పుకుని నరేందర్ రెడ్డికి మద్దతు పలికారు..

కూటమిలో కాంగ్రెస్ పార్టీ ధర్మం పాటించడంలేదని, తమకు తగిన గౌరవం ఇవ్వడంలేదని జన సమితి నేతలు ఆరోపించారు. కొడంగల్ లోని అంబేద్కర్ చౌరస్తాలో టిఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి సమక్షంలో టిజెఎస్ నేతలు టిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. టిఆర్ఎస్ కు మద్దతు తెలిపిన వారి వీడియో కింద ఉంది చూడొచ్చు.

రేవంత్ కు దెబ్బ మీద దెబ్బ… అసలు కొడంగల్ లో ఏమైతుంది?

గత మూడు రోజులుగా రేవంత్ రెడ్డి శిబిరంలో భయాందోళనలు నెలకొన్నాయి. గురువారం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తనకు ప్రాణభయం ఉందని మీడియా ముందు ప్రకటన చేశారు. మఫ్టీలో ఉన్న పోలీసుల చేత తనపై దాడులు చేయించే కుట్ర చేస్తున్నారని సిఎం కేసిఆర్ మీద, డిజిపి మహేందర్ రెడ్డి మీద ఆరోపణలు గుప్పించారు. తనకు పక్కా సమాచారం ఉండబట్టే ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నట్లు చెప్పారు.

అంతేకాకుండా శుక్రవారం ఉదయం సంచలన నిర్ణయం ప్రకటించారు. తనకు ప్రాణహాని ఉందని మరోసారి స్పష్టం చేశారు. మావోయిస్టుల పేరుతో దాడి చేసి తనను చంపాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర బలగాల భద్రత కావలని కోరినా కావాలని భద్రత ఇవ్వడంలేదన్నారు. రాజకీయంగా తన హోదా పెరిగినా ఉన్న భద్రతను తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మహబూబ్ నగర్, ఖమ్మం లలో జరిగే ప్రచార సభకు హాజరుకాబోనని రేవంత్ ప్రకటించారు. ప్రచార కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. మూడు రోజులపాటు తాను ఎక్కడా ప్రచారం చేయబోనని తేల్చి చెప్పారు. కేసిఆర్ మీద ఒంటికాలుతో లేచే రేవంత్ రెడ్డి నాలుగున్నరేళ్ల కాలంలో తొలిసారి ప్రాణభయంతో మీడియా ముందు మాట్లాడడం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది.

ఇది చాలదన్నట్లు హైకోర్టులో రేవంత్ రెడ్డికి షాక్ తగిలింది. రేవంత్ రెడ్డి తనకు ప్రాణభయం ఉందన్న పేరుతో ప్రచార సభలు రద్దు చేసుకున్న కొద్ది క్షణాల్లోనే హైకోర్టులో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ నిలుపుదల చేసింది. కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పు వెలువరించింది. అయితే కేంద్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేయగా డివిజన్ బెంచ్ కేంద్ర ప్రభుత్వం వాదనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. కేంద్ర బలగాలతో కాకుండా రాష్ట్ర బలగాలతోనే రేవంత్ కు భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డికి తాజాగా కూటమి పార్టీ అయిన జన సమితి నుంచి మరో షాక్ తప్పలేదు. జన సమితి కొడంగల్ నేతలు కూటమికి గుడ్ బై చెప్పి పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు. ఒకవైపు పట్నం నరేందర్ రెడ్డి బంధువు ఫామ్ హౌస్ లో 51 లక్షలు పట్టుపడ్డ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ సొమ్ము కేవలం 51 లక్షలు కాదు 17 కోట్ల 51 లక్షలు అని రేవంత్ ఆరోపించారు. కావాలని తప్పుడు లెక్కలు చెబుతున్నారని విమర్శించారు. ఈ విషయంలో ప్రధాని కార్యాయలంలోని ఒక కీలక అధికారి జోక్యం చేసుకున్నట్లు ఆరోపించారు.

మొత్తానికి తన అడ్డా గా చెప్పుకుంటున్న కొడంగల్ గడ్డ మీద రేవంత్ రెడ్డి తొలిసారి ప్రాణభయంతో ఇతరత్రా కారణాలతో ఆందోళన చెందుతున్న వాతావరణాన్ని టిఆర్ఎస్ కల్పించిందన్న వాదన తెరమీదకు వచ్చింది. మరి ఈ ఆటంకాన్ని రేవంత్ ఎలా ఎదుర్కొంటారన్నది చూడాలి.