టిఆర్ఎస్ కు షాక్… ఖమ్మం జడ్పీ చైర్ పర్సన్ లక్ష్మీ రాజీనామా

తెలంగాణ అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో విజయదుందుంభి మోగించి జోరు మీదున్న టిఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఖమ్మం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గడిపల్లి లక్ష్మీ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కలెక్టర్ ఆర్ వీ కర్ణన్ కు అందజేశారు. దీని పై కలెక్టర్ ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

 జడ్పీ చైర్ పర్సన్ రాజీనామా చేయడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న టిఆర్ఎస్ కు ఇది పెద్ద కోలుకోలేని దెబ్బగా చెప్పవచ్చని పలువురు అంటున్నారు. అసలు చైర్ పర్సన్ పదవికి లక్ష్మీ రాజీనామా చేయడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి అనే దాని పై పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు.

లక్ష్మీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మధిర అసెంబ్లీ సీటును ఆశించారు. కానీ అక్కడ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గానికి చెందిన లింగాల కమలరాజ్ కు టికెట్ ఇచ్చారు. అప్పటి నుంచే లక్ష్మీ అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆమె అడపాదడపా పాల్గొన్నారని తెలుస్తోంది. అలాగే ఖమ్మం జిల్లా అధ్యక్ష పదవికి బుడాన్ బేగ్ రాజీనామా చేసినప్పుడే లక్ష్మీ కూడా రాజీనామా చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఆమె అప్పుడు పార్టీలోనే కొనసాగారు. ఇప్పుడు కూడా కేవలం పదవికి మాత్రమే రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి ఆమె రాజీనామా చేయలేదు.

ఖమ్మం జిల్లాలో కీలక నేతలంతా ఓటమి పాలయ్యారు. 10 అసెంబ్లీ సీట్లు  ఉన్న ఖమ్మంలో కేవలం ఒక్క సీటును మాత్రమే టిఆర్ఎస్ గెలుచుకోగలిగింది.  8 సీట్లలో కూటమి నాయకులు, ఒకటి ఇండిపెండెంట్ గెలుచుకున్నారు. దీంతో ఖమ్మం జిల్లాలో వచ్చిన విలక్షణమైన తీర్పును చూసి అంతా ఆశ్చర్య పోయారు. ఖమ్మం మినహా తెలంగాణ అంతటా అత్యధిక మెజార్టీతో టిఆర్ఎస్ గెలిచి రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఖమ్మం జిల్లాలో రాజకీయ ఉద్దండుడైన తుమ్మల నాగేశ్వరరరావు ఓటమి అందరిని ఆశ్చర్యపరిచింది. ఖమ్మం జిల్లాలో స్వంత పార్టీనేతల తప్పిదాల వల్లే ఓడిపోయామని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిస్థితులను చక్కదిద్దే బాధ్యతలను కేటిఆర్ కు కేసీఆర్ అప్పగించారు.

ఖమ్మం జిల్లాలో పలువురు జడ్పీటిసిలు, ఎంపీటిసీలు రాజీనామాలు చేశారు. టిఆర్ఎస్ పార్టీ విధానం నచ్చక రాజీనామా చేశామని వారు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. పార్టీలో నెలకొన్న అంతర్గత విబేధాలు చక్కదిద్దేందుకు ఉన్నత నాయకులు కూడా రంగంలోకి దిగారు. సత్తుపల్లిలో అయితే గొడవలు ముదిరి పాకాన పడ్డాయి. ఇటువంటి తరుణంలో జడ్పీ చైర్ పర్సన్ లక్ష్మీ తన పదవికి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆమె రాజీనామా పై కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారోనని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.