ఒంటేరును టిఆర్ఎస్ లో చేర్చుకోవడం వెనుక సీఎం కేసీఆర్ వ్యూహమిదే

రాజకీయ అపర చాణక్యుడిగా సీఎం కేసీఆర్ కు పేరుంది. తన శత్రువులనే మిత్రులుగా చేసుకోవడంలో సీఎం కేసీఆర్ దిట్ట. నిన్న మొన్నటి వరకు కయ్యానికి కాలు దువ్విన కేసీఆర్, ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఇప్పుడు మిత్రులు కాబోతున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలలో ఒక్కసారిగా సంచలనానికి తెరలేచింది. టిఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హారీష్ రావు లేకుండానే నేరుగా కేసీఆరే ఈ ఆపరేషన్ చేసినట్టు తెలుస్తోంది.

గజ్వేల్ నియోజకవర్గం నుంచి 2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్, ఒంటేరు ప్రతాప్ రెడ్డి తలపడ్డారు. ఒంటేరు ప్రతాప్ రెడ్డి 2014 లో టిడిపి నుంచి, 2018 లో కాంగ్రెస్ నుంచి కేసీఆర్ పై పోటి చేశారు. కానీ ఆయన ఓటమి పాలయ్యారు. డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వా నేనా అనేట్టుగా వీరిద్దరు తలపడ్డారు. ఒంటేరు ప్రతాప్ రెడ్డి అయితే తీవ్ర స్థాయిలో కేసీఆర్ పై విమర్శలు చేశారు. అయితే నిజానికి కేసీఆర్ కి గజ్వేల్ లో ఒంటేరు గట్టి పోటినే ఇచ్చారు. 

సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుతో జాతీయ రాజకీయాలలో బిజి అయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలిచి జాతీయ రాజకీయాల పై పూర్తి స్థాయి దృష్టి పెట్టాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఎంపీగా పోటి చేసి పార్లమెంటుకి వెళితే గజ్వేల్ అసెంబ్లీ స్థానం ఖాళీ కానుంది. దీంతో గజ్వేల్ కు మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. గజ్వేల్ లో టిఆర్ఎస్ నుంచి కేసీఆర్ తప్ప ఎవరు పోటి చేసినా ఒంటేరు ప్రతాప్ రెడ్డి గెలుస్తారని టిఆర్ఎస్ నేతలు అంచనా వేశారు. దీంతో సీఎం గెలిచిన స్థానం నుంచి ఓడిపోతే తీవ్ర ఇబ్బందులుంటాయనే ఉద్దేశ్యంతో ఏకంగా ఒంటేరునే పార్టీలోకి లాగేద్దామని వారు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆర్దిక ఇబ్బందుల్లో ఉండడంతో ఆర్ధికంగా సహాయం అందించడంతో పాటు ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని హామీనిచ్చారని తెలుస్తోంది. కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళితే గజ్వేల్ ఎమ్మెల్యేగా పోటి చేసే అవకాశం కూడా ఇస్తామని తెలిపినట్టు సమాచారం. ఒంటేరు కుమారునికి కూడా నామినేటేడ్ పోస్ట్ లేదా జిల్లా పరిషత్ చైర్మన్ పదవినిస్తామని హామీనిచ్చినట్టు తెలుస్తోంది. వీటన్నింటి పై ఒంటేరు తన అనుచరులతో చర్చించాకనే పార్టీ మార్పు పై నిర్ణయం తీసుకున్నారని సమాచారం. సీఎం కేసీఆర్ బిజిగా ఉంటారు కాబట్టి స్థానికంగా గజ్వేల్ బాధ్యతలు అప్పగిస్తామని కూడా చెప్పారట. వీటన్నింటి పై టిఆర్ఎస్ పెద్దలు కొద్ది రోజుల క్రితమే చర్చించారని దానికి ఒంటేరు కూడా ఒప్పుకున్నారని తెలుస్తోంది.  దీంతో కేసీఆర్ మరో సారి తన రాజకీయ చతురతను చూపించారని నేతలు చర్చించుకుంటున్నారు.