ముగ్గురు, నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసిఆర్ షాక్

అవును. ముగ్గురు నలుగురు అధికార టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గట్టి షాక్ తగిలేలా ఉంది. ఈ విషయాన్ని టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ క్లియర్ గానే చెప్పేశారు. పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేల సమావేశంలో కేసిఆర్ ఈ విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేశారు. ఆ ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలకు రానున్న ఎన్నికల్లో టికెట్ లేదని తేల్చి పారేశారు. వారికి అవసరమైతే వేరే పదవులు ఇస్తానని కూడా చెప్పారు. మరి ఎవరా ముగ్గురు నలుగురు ఏమా కథ అని పార్టీ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి.

తెలంగాణ భవన్ లో పార్టీ శాసనసభాపక్షం, పార్లమెంటరీ పక్షం సమావేశంలో కేసిఆర్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఇప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు గ్యారెంటీ అని చెప్పుకొచ్చిన కేసిఆర్ తొలిసారి ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలకు టికెట్ లేదని తేల్చి చెప్పేశారు. మొన్న ప్రగతి భవన్ లో జరిగిన మంత్రుల సమావేశం సందర్భంగా కూడా కేసిఆర్ సిట్టింగ్ సభ్యులందరికీ టికెట్లు ఇస్తానని ప్రకటించినట్లు వార్తలొచ్చాయి. మంత్రుల పని తీరు బాగుందన్నారు. కానీ మూడు రోజుల్లోనే సీన్ మారిపోయింది. ముగ్గురు నలుగురి పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉందని కేసిఆర్ స్పష్టం చేశారు. వారికి టికెట్ ఇవ్వబోనని చెప్పారు. ఆ ముగ్గురు, నలుగురు ఎవరు? వారి పేర్లేమీ సమావేశంలో పార్టీ అధినేత ప్రకటించలేదు. కానీ ఈ ప్రకటన పార్టీ ఎమ్మెల్యేలలో గుబులు పుట్టించే పరిస్థితి మాత్రం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే ఎవరి పనితీరు బాగాలేదు? ఎవరు రానున్న ఎన్నకల్లో ఓడిపోతారు అన్నదానిపై ఎవరికి వారు ఆత్మపరిశీలనలో పడ్డారు.

తెలంగాణలో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో కేసిఆర్ సర్వేలు చేయించారు. ఎమ్మెల్యేల పనితీరుతోపాటు ప్రభుత్వ పనితీరుపైనా సర్వేలు చేయించారు. ఇప్పటి వరకు ఏ సర్వే రిపోర్టును కూడా కేసిఆర్ బయటపెట్టలేదు. కానీ సర్వేల ఆధారంగా పార్టీ ఎమ్మెల్యేల పనితీరును కేసిఆర్ అంచనా వేస్తూ ఉన్నారు. పలు సందర్భాల్లో ఆయా ఎమ్మెల్యేలకు పని తీరు మార్చుకోవాలని కూడా హెచ్చరికలు జారీ చేశారు. సర్వేలో అధ్వాన్నంగా ఉన్న వారికి గట్టిగానే చెప్పారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు సీరియస్ గా తీసుకుని తమ పని తీరు మెరుగుపర్చుకున్నారు కానీ కొందరు మాత్రం అదే వైఖరితో ఉన్నారు. దీంతో శుక్రవారం జరిగిన పార్టీ సమావేశంలో కేసిఆర్ చాలా స్పష్టంగా వారికి టికెట్లు లేవని తేల్చారు.

అధికార పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు పోతారన్న చర్చ ఉన్న నేపథ్యంలో ఇంతకాలం కేసిఆర్ సిట్టింగ్ సభ్యులందరికీ సీట్లు ఇస్తామని ప్రకటించారు. కానీ తొలిసారి ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలకు సీట్లు లేవని చెప్పడం పార్టీ వర్గాల్లో కలకలం రేగింది. సెప్టెంబరులో పార్టీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని కేసిఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సెప్టెంబరులోనే అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తారా? విడతల వారీగా అభ్యర్థుల ప్రకటన ఉంటుందా అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. మరి ఈ ముగ్గురు, నలుగురితోనే ఆగిపోతుందా? లేక ఈ లిస్ట్ పెరిగే చాన్స్ ఉందా అని కూడా కొందరు ఎమ్మెల్యేల్లో గుబులు రేగుతున్నది.

నిన్న మొన్నటి వరకు అందరికీ సీట్లు అన్న అధినేత ఇప్పుడు ముగ్గురు నలుగురికి కట్ అన్నారు.. రేపు ఎన్నికలు దగ్గరకు వచ్చే నాటికి ఈ సంఖ్య మరింత పెరుగుతుందా అన్న అనుమానాలు సైతం కలుగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరా ముగ్గురు నలుగురు అన్నది టిఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు ఇప్పటికే ఆ ముగ్గురు, నలుగురికి తమకు టికెట్లు లేవని క్లారిటీ రావడంతో వారు పక్క పార్టీలకు జంప్ అవుతారా? లేదంటే ఏదో ఒక పదవి తీసుకుందామని టిఆర్ఎస్ లోనే కొనసాగుతారా అన్నది కూడా హాట్ టాపిక్ అయింది.